మహా శివరాత్రి.. ఎన్నో ప్రాధాన్యతలు, ప్రత్యేకతలు ఉన్నాయని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. శివరాత్రి వచ్చిందంటే చాలు భక్త జనకోటి శివోహం అంటూ భక్తితో వూగిపోతుంటారు. శివరాత్రి ఏటా మాఘ బహుళ చతుర్ధశి రోజు వస్తుంది. మాఘమాసం అంటే శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం. సృష్టి- స్థితి- లయల్లో.. లయకారకుడు శివుడు. అలాగని ఆయన శక్తికి పరిమితి లేదు.. శివుడాజ్ఞ లేనిదే చిన్న చీమైనా కుట్టదన్న సామెత ఉండనే వుంది. అలా శివుడు సర్వ శక్తి సంపన్నుడై లింగాకారంలో ఆవిర్భవించిన రోజును మహాశివరాత్రి అంటారు. 

 

శివరాత్రి రోజున ఉపవాసం ఉండి, రాత్రి మొత్తం జాగారం చేస్తే పుణ్యం, మోక్షం లభిస్తుందని వేదాలు చెబుతున్నాయి. పత్రం పుష్పం ఫలం తోయం...వీటిలో ఏది సమర్పించినా స్వీకరిస్తాడు. భక్తి శ్రద్ధలతో తనను కొలిచే భక్తులను ఆనందంగా అనుగ్రహిస్తాడు. అలాగే ఈ రోజున శివ ప్రతిష్ట చేసినా లేక శివకళ్యాణం చేసినా ఎంతో శ్రేష్టం. మహాశివరాత్రి రోజు తనను పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టులవుతారని శివుడు చెప్పడాన్ని బట్టి ఈ విశిష్టత ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక శివపూజలో ప్రధానమైన అంశం ‘అభిషేకం’. శివుడు అభిషేక ప్రియుడు. లోక రక్షణ కోసం నాడు గరళాన్ని తానే మింగి, గొంతులో బంధించి అలా గరళకంఠుడయ్యాడు.  

 

హాలాహల ప్రభావానికి శివుడి కంఠం కమిలి, నీలంగా మారడంతో నీలకంఠుడిగా పేరుపొందాడు. గరళాన్ని గొంతులో బంధించడం వల్ల అది శివునిలో విపరీతమైన తాపాన్ని పుట్టించసాగింది. తగ్గించుకోవడానికి క్షీరసాగర మథనంలో పుట్టిన చంద్రుడిని తలపై ఉంచుకున్నాడు. నిరంతర తాపోపశమనం కోసం గంగను కూడా నెత్తిన పెట్టుకున్నాడు. అయినా, శివుడిని హాలాహల తాపం ఇబ్బంది పెడుతూనే ఉంటుందట. అందుకే భక్తులు నిత్యం శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు. అయితే ఈ క్ర‌మంలోనే ర‌క‌ర‌కాల అభిషేకాలు చేస్తుంటారు. అందులో రుద్రాభిషేకం ఒక‌టి. 

 

దీని విశిష్ట‌త ఏంటంటే.. వేదాలలోనుండి ప్రత్యేకమైన మంత్రాలను రుద్ర సూక్తంగా పండితులచే పఠించబడుతుంది. దీనిని శివలింగానికి ప్రాతఃకాలంలో పవిత్రస్నానం చేయిస్తారు. దీనినే రుద్రాభిషేకం అంటారు. శివలింగంతో బాటు గండకీ నదిలో మాత్రమే లభించే సాలిగ్రామం కూడా పూజలందుకుంటుంది. దీనిద్వారా మనసులోని మలినాల్ని తొలగించుకోవడమే ఇందులోని పరమార్ధం. అలాగే రుద్రాభిషేకం చేస్తే సర్వసంపదలూ చేకూర్చుతాడు ఆ పరమదయాళువు.


  

మరింత సమాచారం తెలుసుకోండి: