ద్వాదశ జ్యోతిర్లింగాల్లో శ్రీశైలం కూడా ఒకటి. ఈ ఆలయం ప్రస్తావన పురాణ కాలం నుంచి కూడా ఉంది. ఈ ఆలయంలోని ప్రధాన మూర్తి అయిన మల్లికార్జునుడికి ఎంత ప్రాధాన్యత ఉందో ఈ ఆలయ శిఖరానికి కూడా అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చెప్పడం అతిశయోక్తి కాదు. హరహర మహదేవ శంభో శంకరా అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతూ నల్లమల అడవులలో కొండగుట్టలమధ్య గల శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రం ఉంటుంది. ఈ ఆలయ శిఖరాన్ని దర్శించి మోక్షం పొందాలని భావిస్తూ దేశలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా విదేశీయుల నుంచి కూడా ఎంతో మంది ఇక్కడకు వస్తుంటారు.

 

ఈ ఆలయంలో శివ పార్వతుల భక్తులకు దర్శనం ఇస్తారు. ఇక్కడ మల్లికార్జున స్వామిని శివుడుగా, మాత పార్వతి దేవిని భ్రమరాంబగా పూజిస్తారు.  నల్లమల లోతట్టు ప్రాంతమైన భౌరాపూర్‌ చెరువు వద్ద వెలసిన భ్రమరాంబ అమ్మవారికి రెడ్డిరాజులు, విష్ణుకుండినులు, చాళుక్యుల కాలంలో గుడి నిర్మించినట్టు చరిత్ర చెప్తున్నది. ఆదివాసీల సోదరి భ్రమరాంబికను శివుడు వివాహం చేసుకున్నందున చెంచు గిరిజనులు శివుడిని బావగా పిలుచుకొంటూ అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తుంటారు. మహాశివరాత్రి రోజున పూర్వంనుంచి చెంచులే ప్రత్యేకంగా శివపార్వతులకు కల్యాణంచేసే పద్ధతి నేటికీ కొనసాగుతున్నది. ఆ కాలంలోనే ఈ ఆలయానికి కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాలనుంచి భక్తులు తరలివచ్చేవారు. 

 

శ్రీశైలంలో వెలిసిన మల్లికార్జున ఆలయం ప్రాచుర్యంలోకి రావడంతో భక్తులు శివరాత్రి సందర్భంగా అక్కడికి వెళ్తున్నారు. ఈ ఆలయంలో పాండవులు, శ్రీరాముడు లాంటి పురాణ పురుషులు దర్శించుకుని పూజలు చేసారని చరిత్ర చెబుతుంది. శ్రీశైల దేవస్థానాన్ని రక్షించడానికి కొందరు రాజులు ఆలయం చుట్టూ కోట లాంటి పటిష్ఠ కట్టడము నిర్మించారు. నాలుగు వైపులా నాలుగు పెద్ద ద్వారములు, సుదూరానికి సైతం కానవచ్చే బ్రహ్మాండమైన నాలుగు గోపురాలు, అత్యద్భుతమైన కట్టడాలుగా దేవాలయాలు నిర్మించారు. శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది, అష్టాదశ శక్తి పీఠములలో ఆరవది, దశ భాస్కర క్షేత్రములలో శ్రీశైలం ఆరవది.

మరింత సమాచారం తెలుసుకోండి: