ఆ ఊర్లో దేవుడంటే మహా ఇష్టం.... ఒక్కో ప్రాంతానికి ఓక్కో విభిన్నత ఉన్నట్టే రామగుండంలో ఓ ఊరిలో ప్రత్యేకత ఉంది. ఈ ఊర్లో జనాలకు సంబంధించిన పేర్లన్నీ నాగ తో ఉంటాయి. ఆ ఊరేంటి అందరికీ నాగదేవతల పేర్లేంటి అనే కదా మీ డౌట్ .

 

రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని న్యూమారేడుపాక గ్రామానికి వెళ్తే కొత్త వాళ్లు ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. నాగులు ఇల్లు ఎక్కడ అన్నా, నాగరాజు చిరునామా తెలుసా అని అడిగినా నారాయణ కావాలి అని అడిగినా.. నాగేంద్ర ఎక్కడుంటాడని ఆరా తీసినా గ్రామస్థులు ఎగబడి నవ్వుతారు. ఎందుకంటే అలాంటి  పేర్లున్న వ్యక్తులు, దాదాపు వందకు పైగా ఉన్నారు. మరి ఇంత మందికి ఒకే మాదిరి పేర్లు ఎందుకు పెట్టారో తెలుసుకుందాం.

 

ఊర్లోని పెద్దలు చెపుతున్న  ప్రకారం 1975కు ముందు మారేడుపాక గ్రామంలో ఎవరికీ సంతానం కలగలేదు. ఊరి మహిళలు ఎన్నో వ్రతాలు చేసినా అమ్మా అని పిలుపించుకునే భాగ్యానికి నోచుకోలేదు.. అదే సమయంలో గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో అతి పెద్ద నాగుపాము ఒకటి సంచరించడం స్థానికులు చూశారట. ఆ ప్రాంతానికి వెళ్లి చూడగా అక్కడే ఒక నిలువెత్తు పుట్ట కనిపించిందని,   అందులో తొలిసారిగా నాగులపంచమి రోజున మహిళలు పాలు పోయగా పాము బయటకు వచ్చి తాగిందని చెపుతున్నారు ఇక్కడి ప్రజలు. 

 

పామును నాగదేవతగా కొలిచి తమకు పిల్లలు పుడితే,  నీ పేరు పెడతామని అని మొక్కుకున్నారట ఇక్కడి ప్రజలు.. దీంతో వెంటనే చాలా మందికి సంతానం కలిగిందని ప్రగాఢ విశ్వాసం.. ఆ మొక్కు ప్రకారమే పిల్లలకు 'నాగ' అనే పేరు వచ్చేలా పేర్లు పెట్టారు.  నాగరాజు, నాగులు, నారాయణ, నరేందర్‌, మల్లిఖార్జున్‌.. ఇలా పేర్లు పెట్టడంతో తర్వాతి కాలంలో ఊరంతా ఆ పేర్లున్న వారితోనే నిండిపోయిందని అంటున్నారు గ్రామ ప్రజలు.


 
అంతే  కాదు ఏటా ఘనంగా ఊరిలో ఆలయానికి ఉత్సవాలు కూడా జరిపిస్తారట. ఓసీపీ-3 ప్రాజెక్టు ఆవిర్భావంతో ఈ ఊరిని సింగరేణి తీసుకొని యైటింక్లయిన్‌ కాలనీ సమీపంలో గ్రామస్థులకు పునరావాసం  కల్పించింది. కొత్తగా ఏర్పాటైన గ్రామానికి న్యూమారేడుపాకగా స్థానికులు నామకరణం చేసుకున్నారు. పాత గ్రామంలోని పుట్ట వద్ద ఊరి ప్రజలు గుడిని నిర్మించుకోగా సింగరేణి బొగ్గు ఉత్పత్తి కోసం మట్టి పోయడంతో అది కాలగర్భంలో కలిసిపోయింది. ఆ గుడికి గుర్తుగా అక్కడున్న శివలింగాన్ని తీసుకొచ్చి న్యూమారేడుపాక శివారులో పెద్ద గుడిని నిర్మించుకున్నారు ఊరి ప్రజలు. ఏటా మహాశివరాత్రి, నాగులచవితి, నాగులపంచమి ఉత్సవాల్లో ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా చేస్తుంటారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: