శివుడు.. హిందూ మతంలోని ప్రధాన దేవతలలో ఒకరు. ఈయన త్రిమూర్తులలో చివరివాడైన లయకారుడు. శివుడు హిందువులు పూజించే దేవుళ్లలో ప్రథముడు. శివుడు పశుపతిగాను, లింగం రూపములోను సింధు నాగరికత కాలానికే పూజలందుకున్నాడు. ఇక సుమారు 1,008 మంది పేర్లతో శివుడిని పిలుస్తారు. ఈయ‌న‌కు ఆల‌యాలు కూడా చాలానే ఉన్నాయి. అందులో ఒడిషా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లోని లింగరాజ దేవాలయం కూడా ఒక‌టి. భువనేశ్వర్ లోని పురాతన ఆలయాలలో ఒకటైన లింగరాజ ఆలయం పర్యాటక ఆకర్షణ. దీనిని 1100 ఏళ్ల క్రితం నిర్మించారు. దీని ఎత్తు 180 అడుగులు. కళింగుల నిర్మాణశైలికి ఈ కట్టడం అద్దం పడుతుంది. 

 

అయితే ఒడిష గోల్డెన్ ట్రయాంగిల్‌ని విశ్లేషించడం అంటే...గోల్డెన్ ట్రయాంగిల్‌ని రూపొందించే మూడు ప్రసిద్ధ ఆలయాలు తెలుసుకోవాలి. అందులో ఒకటి భువనేశ్వర్ లోని లింగరాజ ఆలయం. తర్వాత పూరిలోని జగన్నాధ ఆలయం, కోణార్క్‌లోని సూర్యదేవాలయం ఒడిషలో ప్రముఖ పర్యాటక కారకాలుగా చెప్పుకోదగినవి. ఇక లింగరాజ ఆలయం విష‌యానికి వ‌స్తే.. ఈ ఆలయ నిర్మాణం చాలా ప్రత్యేకమైనది. ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారనే దానికి కచ్చితమైన ఆధారాలు లేనప్పటికీ సోమ వంశీయుడయిన కేసరి అనే రాజు 11వ శతాబ్దంలో నిర్మించి ఉంటాడని భావిస్తున్నారు. 

 

చారిత్రక ఆధారాలను బట్టి కేసరి తన రాజధానిని జైపూర్ నుంచి భువనేశ్వర్‌కి మార్చినట్లు తెలుస్తోంది.  అయితే ఇక్క‌డ మ‌రో విష‌యం ఏంటంటే.. ఈ ఆలయ నిర్మాణం 6వ శతాబ్దంలోనే జరిగిందని చెప్పడానికి ఆలయం వద్ద నున్న శిలాశాసనాలపై చెక్కబడిన సంస్కృత లిపి సాక్ష్యంగా ఉన్నది. ఇక‌ లింగరాజ అనగా లింగాలకు రాజు అనే అర్థము. ఈ ఆలయంలోని లింగమునకు త్రిభువనేశ్వర అనే పేరు కూడా ఉంది. ఈ దేవాలయం నాల్గు భాగాలుగా ఉంటుంది. వీటిలో ప్రధాన ఆలయం, యజ్ఞశాల, భోగ మండపం, నాట్యశాలలు ఉంటాయి. ఈ ఆలయం భువనేశ్వర్ నగరంలోని అన్ని ఆలయాలలో కెల్లా పెద్దది.  ఈ ఆల‌యాన్ని చూడ‌డానికి మ‌న రెండు క‌ళ్లు స‌రిపోవు. ఎందుకంటే అంత అందంగా ఉంటుంది. కాబ‌ట్టి మీరు ఎప్పుడైనా భువనేశ్వర్ వెళ్తే.. లింగరాజు ఆలయం చూడ‌డం మాత్రం మ‌ర్చిపోకండి.
  

మరింత సమాచారం తెలుసుకోండి: