శ్రీ సీతారాముల స్వామి వారి దేవస్థానం, తెలంగాణలోని ఖమ్మం జిల్లా, భద్రాచలంలో ఉంది. ఇది తెలంగాణ రాష్ట్రంలోని రామాలాయాలలోకెల్లా అతి పెద్దది. హిందువులు ఆరాధ్య దైవంగా భావించే శ్రీరాముని ఆలయం ఇది. ఇక ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున ఈ దేవాలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇది దేశ వ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన ఉత్సవం. ఈ కళ్యాణానికి అనేక లక్షల భక్తులు హాజరవుతుంటారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు బట్టలు ఈ దేవాలయమునకు ప్రతి సంవత్సరం పంపడం జరుగుతుంది.

 

ఆ స‌మ‌యంలో భద్రాచలం భక్తకోటి సంద్రంగా మారుతుంది. పచ్చటి తోరణాలు, చలువ పందిళ్లు, మేళతాళాల నడుమ సీతారాముల వివాహ ఘట్టం జ‌రుగుతుంది. ఇక ఇదిలా ఉంటే..  భద్రాచలంలో ఈ ఏడాది ఏప్రిల్‌ 2,3 తేదీల్లో జరిగే శ్రీరామనవమి మహోత్సవాలు తిలకించేందుకు దేవస్థానం ఆన్‌లైన్‌లో టిక్కెట్‌ విక్రయాలు ప్రారంభించింది. భక్తులు టిక్కెట్లను  www.bhadrachalamonline.com వెబ్‌సైట్‌ ద్వారా బుక్ చేసుకోవ‌చ్చు. అలాగే భధ్రాచలంలో మార్చి 25 నుంచి ఏప్రిల్‌ 8వ తేదీ వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. 

 

ఇక 2వ తేదీన స్వామివారి తిరు కల్యాణ మహోత్సవం, 3న స్వామివారి మహాపట్టాభిషేకం వీక్షించేందుకు రూ.5 వేలు, రూ.2 వేలు, రూ.1116, రూ.500, రూ.200, రూ.100 విలువతో సెక్టార్‌ టిక్కెట్లు ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నామని దేవాలయ అధికారులు తెలిపారు. ఇతర వివరాలకు 08743-232428 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు. ఈ క్ర‌మంలోనే ఆలయం వెలుపల పారిశుద్ధ్యం, వీధి దీపాలు, తాగునీటి వసతులు, నిరంతర విద్యుత్తు సరఫరా, అన్న ప్రసాదాల పంపిణీ, వైద్య శిబిరాలు నిర్వహణలో ఏలాంటి లోపాలు తలెత్తరాదని ముందుగానే త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: