దేశవ్యాప్తంగా రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం పెద్దగా లేకపోయినా ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా కరోనా ఎఫెక్ట్ తో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి విదేశీ భక్తులు, ఎన్నారైలు ఇండియాకు వచ్చిన 28 రోజుల పాటు రావొద్దని సూచించింది. 
 
ప్రతిరోజూ తిరుమల తిరుపతి దేవాలయాన్ని లక్షల సంఖ్యలో భక్తులు సందర్శిస్తారనే విషయం తెలిసిందే. తిరుమలలో కరోనా వేగంగా విజృంభించే అవకాశం ఉండటంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. తిరుమలకు వచ్చే భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని విదేశాల నుంచి వచ్చే భక్తులు సహకరించాలని కోరింది. టీటీడీ అస్వస్థతకు గురైన భక్తులు దైవ దర్శనాన్ని వాయిదా వేసుకోవాలని కోరింది. శబరిమల దేవస్థానం నిర్వాహకులు ఈ నెలాఖరు వరకు భక్తులు ఆలయ దర్శనానికి రావద్దని విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. 
 
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 4,000కు పైగా కరోనా భారీన పడి మృతి చెందారు. కరోనా బాధితుల సంఖ్య 1,16,000 కు చేరింది. చైనా, ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియాలో కరోనా భారీన పడి భారీ సంఖ్యలో మృతి చెందారు. మన దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 59కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం లేకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: