ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలలో శబరిమల ఒకటి. ప్రపంచంలో ఏడాదికోసారి భక్తులు సందర్శించే పుణ్య క్షేత్రాల జాబితాలో హజ్‌లోని మక్కా మసీదు ప్రథమ స్థానంలో ఉంటే.. శబరిమలది రెండోస్థానం అని చెప్పవచ్చు. మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలైలో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. ఈ పుణ్యక్షేత్రాన్ని ప్రతియేటా భక్తకోటి సందర్శిస్తుంటారు. నారాయణుడు, పరమశివుడు ఇద్దరూ  ఒక్కరే అని పురాణాలు చెబుతున్నాయి. 

 

అయ్యప్ప పూజలో శంకరునికి ఇష్టమైన పాలాభిషేకం ఉంటే, విష్ణువుకు ఇష్టమైన హోమమూ ఉంటుంది. శంకరుని నిరాడంబరమైన నేలపడక, తెల్లవారుఝామున స్నానం, చెప్పులులేని నడక, భస్మధారణ వంటివి కనిపిస్తుండగా, మెడలోని పుష్పమాల శ్రీహరి మెడలోని వనమాలను తలపిస్తుంది. అలాగే తలపై ధరించే చంద్రునిముడిలో శంకరునికి సంబంధించిన మూడునేత్రాలు ఉంటాయి. కొబ్బరికాయ, నెయ్యి ఉండగా, పిన్ ముడిలో జీవించడానికి అవసరమైన వస్తువులుంటాయి. విష్ణువు స్థితికారుడు కాదా మరి. 

 

పానవట్టంపై కూర్చోబెట్టిన శివలింగంగా కనిపిస్తున్న అయ్యప్పస్వామి, ఎడమచేతి వయ్యారపు వంపుతో విష్ణువు మోహీనీ అవతారానికి ప్రతీకగా కనిపిస్తున్నాడు. ఒంటినిండా భస్మం హరరూపాన్ని తలపిస్తుంటే, ముఖాన ఉండే తిరునామం హరిరూపాన్ని చూపిస్తుంది. మెడలోని  రుద్రాక్షమాల శంకరునిది అయితే, తులసిమాల శ్రీహరికి ఇష్టం అయినది. అయ్యప్పస్వామి దీక్ష శంకరునికి ఇష్టమైన కార్తీకమాసంలో ప్రారంభమై, శ్రీహరికి ఇష్టమైన మార్గశిరమాసంలో పూర్తి అవుతుంది.


 

మరింత సమాచారం తెలుసుకోండి: