తెలుగు నూతన సంవత్సరాది ఉగాది. అంటే ఉగాది నుంచే తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుంది. దీంతో ఇది తెలుగువారి పండుగ అయ్యింది. అయితే ఈ ఉగాది ఒక్క తెలుగువారే కాకుండా దక్షినాది రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్ర‌ ప్రదేశ్, తెలంగాణా, మహారాష్ట్ర ప్రజలు కూడా జరుపుకుంటారు. ప్రకృతి పరంగా చూస్తే కొత్త మార్పులు కూడా ఉగాది రోజు నుంచే ప్రారంభం అవుతాయి. వసంత రుతువు ఆగమనానికి సంకేతం. నవ వసంతానికి నాందీవచనం. చెట్లు కొత్త సోయగాలతో ప్రకృతిని హరితవర్ణం చేసే శుభదినం. మ‌రియు కోయిలలు కుహు కుహు రాగాలు పాడుతూ హాయిగొలిపే సుదినం. అదే ఉగాది.  

 

ఇక చైత్ర శుద్ధ పాడ్యమినే ఉగాదిగా పేర్కొంటారు. ఈ రోజునే బ్రహ్మ సమస్త సృష్టినీ ప్రారంభించాడని చెబుతారు. వైకుంఠనాథుడు మత్స్యావతారాన్ని ధరించి, సోమకుడిని సంహరించి వేదాలను కాపాడింది కూడా ఉగాది రోజునే.  శాలివాహనుడు పట్టాభిషిక్తుడైంది కూడా ఉగాదినాడే జరిగింది. ఇలా ఉగాది పండగకు సంబంధించి ఇలాంటి ఎన్నో విషయాలు మన పురాణాల్లో ఉన్నాయి. అయితే హిందూ సంప్రదాయంలో మన పండుగలు ఒక ప్రత్యేక దైవరాధనతో జరుపుకోవడం మన ఆచారం. కానీ ఉగాది నాడు ప్రత్యేకంగా ఏ దైవాన్ని ఆరాధించరు. కేవలం కాలాన్ని ఆరాధించే పండుగ ఈ ఉగాది. ఇందులోనూ అంతర్లీనంగా దైవచింతన కనిపిస్తుంది. 

 

కాలః కాలయతా మహం అన్నాడు కృష్ణభగవానుడు. కంటికి కనిపించని ఆ కాలం యొక్క స్వరూపాన్ని నేనే అంటాడు గీతాచార్యుడు. అందుకే ఉగాది రోజున విష్ణు సంకీర్తనం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం చాలా మంచిది. ఇక ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. కాసిన్ని ఆనందాలు, మరికాసిన్ని బాధలు, ఇంకొన్ని సంతోషాలు, అప్పుడప్పుడూ నిరాశానిస్పృహలు. వీటన్నింటి కలయికే జీవితమనే సారాన్ని ఉగాది పచ్చడి మనకందిస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: