ఉగాది పండగ అంటే  కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడం అన్నమాట. దీనినే కొత్త  సంవత్సరాది  అని కూడా అంటారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి  స్వాగతం పలకడం అన్నమాట. ఉగాది పచ్చడి చేసుకోడం, దాన్ని తినడం పండగ యొక్క ఆనవాయితీ.

 

అయితే ఈ పచ్చడి ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదట. దీనిని కూడా చెప్పిన  సమయంలోనే  తినాలట. ఆ సమయం ఏంటో తెలుసుకుందామా !  శ్రీవికారినామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ శ్రీశార్వారి నామ తెలుగు సంవత్సరాది ఉగాదిని జరుపుకునే సమయం, ముహూర్తం గురించి పండితులు  ముందుగానే తెలియజేశారు. ఉగాది పర్వదినం మార్చి 25 బుధవారం నాడు వచ్చింది కాని అసలు వాస్తవానికి   మంగళవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఛైత్ర శుద్ధ పాడ్యమి మొదలైనా గాని  పండగ మాత్రం బుధవారం  రోజే జరుపుకోవాలి. ఎందుకంటే పురాణాల్లో   శాస్త్రోక్తంగా చెప్పారు కూడా.  సూర్యోదయం సమయంలో తిథి ప్రకారం పండుగ జరుపుకోవాలట. 

 

 

ఉగాది రోజున అత్యంత ముఖ్యమైనది పచ్చడి. ఈ పచ్చడి ఏ సమయంలో తీసుకోవాలనేది కూడా వేద పండితులు తెలియజేశారు. ఉదయాన్నే  నిద్ర లేచి ఇల్లు శుభ్రం చేసుకుని గుమ్మంలో ముగ్గుపెట్టుకోవాలి. తర్వాత  అభ్యంగన స్నానం చేసి, దేవుడు ఫొటోలకి కుంకుమ బొట్టు పెట్టి, పూలతో అలంకరించాలి. తర్వాత  పచ్చడి తయారు చేయాలి. దీనిని దేవునికి  నైవేద్యం  సమర్పించిన తర్వాత ఉదయం 6.00 గంటల నుంచి 11.00 మధ్యన తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇది అత్యంత అనుకూలమైన సమయమని తెలిపారు. ‘శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయచ, సర్వారిష్ట వినాశాయనింకం దళబక్షణం’ అనే ఈ శ్లోకాన్ని ప్రత్యేకంగా చదివి పచ్చడి తీసుకోవాలి. వందేళ్లపాటు వజ్రదేహంతో ఎలాంటి కష్టాలు లేకుండా జీవించాలని కోరుకోవడం దీని అర్థం. 

 

ఉగాది పచ్చడి మాత్రం ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తినాలి. ఉదయం 7 గంటల నుంచి 10.45 మధ్య మంచి ముహూర్తం. తిరిగి మధ్యాహ్నం 1.30 గంటలకు ముహూర్తం బాగుందని వెల్లడించారు. అలాగే, ప్రయాణాలు కూడా  ఉదయం 6.00 గంటల నుంచి 11.00 గంటలోగా చేయాలి. మరల   తిరిగి మధ్యాహ్నం 1.30 నుంచి 4.30 గంటలకు మంచిది. 

 

పడమర దిశకు ప్రయాణాలు అత్యంత శుభదాయకం. ఉత్తర ప్రయాణం పనికిరాదని పండితులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉండడం చేత వీలయినంతగా ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: