సాధార‌ణంగా వేసవికాలం ప్రారంభం అయిందంటే చాలు శ్రీరామనవమి సందడి కనిపిస్తుంది. ప్రతి రామాలయంలో శ్రీరామనవమి కోసం భారీ ఏర్పాట్లు జరుగుతాయి. మూర్తీభవించిన ధర్మానికి ప్రతీక శ్రీరామచంద్రుడు. మర్యాదా పురుషోత్తముడైన ఆ మహానుభావుడు ఈ భూమిపై సాధారణ మానవుడిగా జన్మించిన దినమే శ్రీ రామనవమి. హిందువులు ఈ పండగను అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో భద్రాచలం, ఒంటిమిట్ట ఆలయాల్లో శ్రీసీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. 

 

అయితే శ్రీ‌రామ‌న‌విమి పూజ విధానం.. పాటించాల్సిన ఆచారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీరామనవమి రోజున స్నానాదికాలు ముగించి, కొత్త బట్టలు ధరించి, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. వాకిట్లో రంగవల్లులు దిద్ది, గుమ్మానికి తోరణాలు కట్టి, గడపకు పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అనంత‌రం లక్ష్మణ, భరత, శతృఘ్నులు, హనుమంతుడితో కూడిన సీతారాముల చిత్ర పటమును అలంకరించి, శ్రీరామచంద్రుడి అష్టోత్తరం చదవడం గానీ, రామాయణంలోని పట్టాభిషేక అధ్యాయాన్ని పారాయణ గానీ చేసేకోవాలి. పూజకు సన్నజాజి, తామర పువ్వులు, నైవేద్యానికి పానకం, వడపప్పు, కమలాకాయలు సమర్పించాలి.  

 

ఇక భారతదేశం యావత్తు పల్లె గ్రామాల్లో రామమందిరం ఉండనే ఉంటుంది. స్థానిక పురజనులు కమిటీలుగా ఏర్పడి ఏటేటా రాములోరి ఉత్సవాలను నవరాత్రులుగా జరుపుకొంటారు. శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్ళు వేసి, సీతారామ కళ్యాణం చేస్తారు. ఇళ్ళల్లో కూడా యధాశక్తిగా రాముని పూజించి వడపప్పు, పానకం, నైవేద్యం చేసి అందరకీ పంచుతారు. అలానే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తుంటారు. గ్రామాల్లో పేద, ధనిక బేధాలు లేకుండా రాములోరి ప్రసాదంగా స్వీకరించటం పరిపాటి.
 


 

మరింత సమాచారం తెలుసుకోండి: