దేశంలో 108 దివ్య తిరుపతులు శ్రీవెంకటేశ్వర స్వామి అంశతో ప్రకాశిస్తున్నాయి. అటువంటి పుణ్యక్షేత్రాల్లోఒకటి ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం జమలాపురంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం .భక్తుల కొంగుబంగారమై వెలుగొందుతూ తెలంగాణరాష్ట్రం లో చిన్న తిరుపతిగా ప్రసిద్ధిగాంచిందీ దేవాలయం. జాబాలి మహర్షి తపస్సుకు మెచ్చి సాక్షాత్తూ వైకుంఠం నుంచి దిగొచ్చిన వేంకటేశ్వర స్వామి ఇక్కడ సతీసమేతంగా వెలిశారు. కలియుగంలో భక్తుల కోరికలను నెరవేర్చే దైవంగా శ్రీనివాసునికి పెట్టింది పేరు. అటు తెలంగాణ రాష్ట్రానికీ, ఇటు ఆంధ్రప్రదేశ్ కు సమీపంలో ఉన్న ఈ ఆలయం భక్తజనులు కొనియాడుతున్న మహిమాన్విత క్షేత్రంగా వెలుగొందుతున్నది.


 వేంకట అంటే ?


వేం అంటే పాపాలు కట అంటే హరించడం. వేంకట అంటే పాపాలను హరించేవాడని అర్థం... పాపాలను హరిస్తూ ధర్మాన్ని రక్షించే అవతారమే ఈ శ్రీనివాసుడు.

నడిచి వచ్చిన దైవం


శ్రీరామునికి గురువైన జాబాలి మహర్షి తీర్థయాత్రలు చేస్తున్న సమయంలో జమలాపురం చేరుకున్నారట . ప్రకృతి రమణీయతతో అలరారుతున్న ప్రాంతం ఆయనకు నచ్ఛడంతో ఇక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసుకొని గురుకులాన్ని స్థాపించారట. ఇక్కడి సూచిగిరి కొండపై జాబాలి మహర్షి తపస్సు చేస్తుండేవారు. ఆ తపస్సుకు మెచ్చిన శ్రీమహా విష్ణువు సూచిగిరిపై శ్రీవెంకటేశ్వర అవతారం లో స్వయంభూ గా వెలిశాడట. కొన్నాళ్ల తర్వాత నెల్లూరు ప్రాంతానికి చెందిన యజ్ఞనారాయణ శర్మ అనే బ్రాహ్మణుడు కాశీకి వెళుతూ జమలాపురానికి చేరుకున్నాడు. ఇక్కడ ఆయనకు అద్భుతమైన అనుభూతి కలిగిందట. తన కలలో కనిపిస్తూ ఉండే చెట్లూ ,కొండలూ ఇవేనని ఆయన గుర్తుపట్టాడు. ఈ చోటుతో తనకు ఏదో అనుబంధం ఉన్నదని భవించాడు.  దీంతో  కొన్నాళ్ళు ఇక్కడే ఉండాలని నిశ్చయించుకున్నారట. ఆకాడి కొండా మీద స్వామి  వారు బాలుడి రూపం లో వఛ్చి పశువుల కాపరులైన బాలల తో ఆడుతుండేవారట. నీది ఏ ఊరు అంటే? నీ ఊరే నా ఊరు అనీ... ఏం పేరు అంటే నీ పేరే నా పేరు అనీ చెబుతుండేవారట. ఈ బాలుడి గురించి విన్న యజ్ఞ నారాయణ శర్మ కొండపైకి వెళ్లారు. అక్కడే జాబాలి మహర్షి ప్రతిష్ఠించిన స్వామివారి విగ్రహం, శిలా శాసనం కనిపించాయట. దీంతో ఇక్కడే స్థిరపడి రోజూ కొండపైకి వెళ్లి పూజలు చేసేవారు. స్వామివారి మహిమల గురించి తెలుసుకున్న భక్తులు  కొండకు వెళ్లడం మొదలు పెట్టారు.



వేంకటేశ్వరుడు కదిలివచ్చే...


యజ్ఞ నారాయణ శర్మ తర్వాత ఆయన వారసుల్లో ఆరోతరానికి చెందిన అక్కుభట్లు స్వామివారిని అర్చించేవారట. ఒకనాడు వార్ధక్యం వల్ల కొండపైకి ఎక్కలేక మధ్యలో రాయి తగిలి కింద పడిపోయారు. పూజా జలం, నైవేద్యం కింద పడిపోయాయి. దీంతో బాధపడిన ఆయన "ఆకలేస్తే నువ్వే దిగిరా స్వామీ... ఇక రాలేను" అనుకున్నాడట. వెంటనే ఒక గాంభీరమైన కంఠం వినిపించిందట. "నేను వస్తున్నాను... వెనుకకు చూడకుండా ముందుకు పద" అనే మాటలు అక్కుభట్లు వారికి వినిపించాయి. ఆయన గ్రామం వైపు వస్తుండగా పెద్ద వెలుగుతో కూడిన ధ్వని వచ్చింది. అక్కుభట్లు వెనుదిరిగి చూసే సరికి స్వామి వారు సూచిగిరి నుంచి ఒక అడుగు ప్రస్తుతం ఆలయం ఉన్న కొండపైకి వేశారట. ఈ పాద ముద్ర ఇప్పటికీ ప్రస్తుత గుట్ట మీద ఉన్నది. అప్పుడే స్వయంభూ గా సాలగ్రామ రూపం లో స్వామి వెలిశాడిక్కడ. నాటి నుంచి యజ్ఞ నారాయణ శర్మ వారసులైన ఉప్పల ఇంటి పేరుగల వంశస్థులే ధర్మ కర్తలుగా, అర్చకులుగా కొనసాగుతున్నారు. ఇప్పుడు పద్నాలుగోతరం అర్చకులు స్వామి వారికి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  


శ్రీకృష్ణ దేవరాయలూ దర్శించుకున్నారు
కాకతీయ రాజు ప్రతాపరుద్రుడూ, విజయనగరాధీశుడు, శ్రీకృష్ణ దేవరాయలూ జమలాపురంలో వేంచేసిన వెంకటేశుడిని దర్శించుకున్నారు.



ఆలయ నిర్మాణం


 తాడేపల్లి రాజు జీర్ణోద్ధరణ చేపట్టారు. 1965లో ఈ ఆలయం దేవాదాయ శాఖ ఆధీనం లోకి వెళ్ళింది. శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ స్వామి వెంకటేశుడి విగ్రహాన్ని స్వయంభూ తో పాటు, ప్రతిష్ఠిస్తే బాగుంటుందని సూచించారు. అలా 1976 మార్చి 26 చైత్ర శుద్ధ సప్తమి నాడు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. పక్కనే అమ్మవారి ఆలయం ఉంటుంది. ప్రతిష్ఠ జరిగిన రోజు ఏటా స్వామివారికి కళ్యాణం నిర్వహిస్తారు. అర్జునిడికీ, హరిహరులకూ పాశుపతాస్త్రం ఇచ్చిన ప్రదేశం కూడా ఇదేనట. అందుకే వెంకటేశ్వర స్వామి సన్నిధానం లో శివాలయం  ఏర్పాటు చేశారు .

వెంకట, శ్రీనివాస అనే పేర్లే ఎక్కువ


ఇక్కడి వారంతా ఇలవేల్పుగా వెంకటేశ్వర స్వామి కొలుస్తుంటారు. ఈ ప్రాంతం లో ఎక్కువగా వెంకట, శ్రీనివాస అనే పేర్లు పెట్టుకుంటారు. కుటుంబం లో ఎవరొకరికీ తప్పనిసరిగా స్వామి వారి నామం కలిసేలా పిలుచుకుంటారు.    


ఇలా వెళ్లొచ్చు....  

ఖమ్మం నుంచి 80 కిలో మీటర్ల దూరం ఉంటుంది. విజయవాడ నుంచి 60 కిలో మీటర్లు ఉంటుంది. భద్రాచలం- విజయవాడ రహదారిలోని మైలవరం నుంచి 20 కిలో మీటర్లు. విజయవాడ -సికింద్రాబాద్ రైలు మార్గం లో ఎర్రుపాలెం స్టేషన్ లో దిగి అక్కడి నుంచి జమలాపురం దేవస్థానానికి చేరుకోవచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: