జ‌గ‌మంతా ఒక్క‌టిగా ఈ సృష్టికి క‌ర్త అయిన శ్రీ జ‌గ‌జ్జ‌న‌నీ అమ్మ‌వారిని చాలా మంది పూజిస్తారు. ఈ అమ్మ‌వారు జ‌మ్మూకాశ్మీర్‌లోని హిమాల‌య ప‌ర్వాతాల్లో 19,500 అడుగుల ఎత్తులో స్వ‌రూపంతో స్వ‌యంభువుగా వెలసింది. ఈ ఆల‌యానికి ద‌గ్గ‌ర‌లోనే స‌రోవ‌రం ఉండేది. ముక్కోటి దేవ‌త‌లూ బ్ర‌హ్మ ముహూర్తంలో స్నాన‌మాచ‌రించి అమ్మ‌వారి ద‌ర్శ‌నం చేసుకుని వెళ్ళేవార‌ని మ‌న పురాణ గ్రంధాల్లో లిఖించ‌బ‌డి ఉంది. ఈ అమ్మ‌వారి గురించి కాపాలికావిథి, పూర్వాచారగాణా పత్యవిథి, వామకేశ్వరతంత్రం, కౌలాచార తంత్రం, శక్తిస్థల్, దేవీ భాగవత పురాణాలు, బ్రహ్మ, విష్ణు, శైవ, బ్రహ్మవైవర్త కార్తికేయ పురాణాల్లో శ్రీ జగజ్జననీ అమ్మవారి గురించి క్షుణ్ణంగా తెలుసుకొనవచ్చును. ఈ అమ్మవారికి భర్త అనేటువంటి శక్తి ఈ సృష్టిలో ఎక్కడా లేద‌ని చెప్పాలి. అయితే ఈ అమ్మ‌వారు తన ఇచ్ఛానుసారము భర్తగాను, భార్యగాను రూపాంతరం చెందుతూ వుంటుంది. తన నుంచి వచ్చిన అంశామూర్తులకే భర్త అనేటువంటి శక్తి వుంటుంది. పార్వతికి శివుడు, లక్ష్మికి విష్ణువు, సరస్వతికి బ్రహ్మ యిత్యాదిగా వుంటారు. అయితే ఈ అమ్మవారు మాత్రం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో, ఒక్కొక్క రూపంతో వెలుస్తూంటుంది. అదే ఈ అమ్మ‌వారి ప్ర‌త్యేక‌త‌. 

 

కనుక ఈ అమ్మను మహామాయ, యోగమాయ, అదిపరాశక్తి అని కూడా చాలామంది  పిలుస్తుంటారు. కాకపోతే జగత్తునంతా సృష్టించినటువంటి తల్లి కాబట్టి జగజ్జనని అనే పేరున ప్రసిద్ధమైంది. ఈ అమ్మవారు హిమాలయాల్లో విరాట్ స్వరూపంతో ఏ విధంగా ఐతే వెలిసిందో ఇప్పుడు మన నంద్యాల పట్టణంలో కలియుగంలో అదే విధంగా వెలసింది. అమ్మవారి కడుపులో పంచముఖశివుడు, పాదపీఠశాయిగా శ్రీ మహావిష్ణువు, మహావిష్ణువు నాభి నుండి పశ్చిమ భాగంలోని క్రింది చేతిలో చతుర్ముఖ బ్రహ్మ వుంటారు. అంత‌టి మ‌హ‌త్యం క‌లిగిన అమ్మ‌వారు కాబ‌ట్టే ఈమెకు జ‌గ‌త్‌జ‌న‌నీ అనే పేరు ఉంది.

 

అమ్మవారి కుడివైపు ఒక చేతిలో చంద్రమండలం, అలాగే 2వ చేతిలో భూమండలం, 3వ చేతిలో సూర్యమండలం, లక్ష్మి దేవి, అభయ హస్తంలో త్రినేత్రం, త్రిశూలం మరియు ఎడమ వైపు ఒక చేతిలో శంఖు, 2వ చేతిలో ఢమరుకం, 3వ చేతిలో ధనుస్సు, 4వ చేతిలో చతుర్ముఖ బ్రహ్మ వుంటారు. ఈ శ్రీ మాతకు 17 తలల ఆదిశేషుడు పడిగ పట్టి వుంటాడు. అ అమ్మ‌వారికి సింహం వాహనంగా వుంటుంది. సృష్టికి మూలం తనేనని త్రిమూర్తులు, త్రిమాతలతో సహా ముక్కోటి దేవతలందరూ తమ కార్యకలాపాలను తన అనుమ‌తితోనే సాగిస్తారని ప్రపంచానికి తెలిపే విరాట్ స్వరూప‌మే ఈ  జగజ్జనని. ఈ అమ్మవారికి ఇక్కడ ప్రతి రోజు రాహు కాల పూజలు విశేషంగా జరుగును. అమావాస్య, పౌర్ణమి పూజలు విశిష్టంగా జరుగుతాయి. అలాగే సూర్య గ్రహణము, చంద్ర గ్రహణములలో శ్రీ అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: