హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఇక శ్రీరాముని పేరు వినగానే  మనకు ఆంజనేయస్వామి తప్పక గుర్తువస్తారు. ఎందుకంటే.. రామాయణంలో రామునికున్నంత ప్రాముఖ్యం హనుమకూ ఉంది. అయితే ఆంజ‌నేయ‌స్వామికి ఎన్నో ప్ర‌ముఖ దేవాల‌యాలు ఉన్నాయి. అందులో పాకిస్థాన్‌లోని కరాచీలో శ్రీరామభక్తుడు ఆంజనేయస్వామి స్వయంభువుగా వెలసిన ప్రముఖమైన క్షేత్రం కూడా ఒక‌టి.

 

కరాచీలో అత్యంత రద్దీగా ఉండే ప్రదేశంలో ఉన్న ఈ ఆలయ చరిత్ర ఎంతో పురాతనమైనది. ఈ ఆలయం పదిహేను వందల సంవత్సరాల క్రితం నిర్మించినట్లు ఇక్కడ లభించిన ఆధారాల ద్వారా తెలుస్తున్నది. ఇక్కడి శ్రీ పంచముఖి హనుమాన్‌ మందిరం యుగయుగాల నుంచి పూజలందుకుంటోంది. అలాగే వనవాసంలో శ్రీరాముడు సీతా సమేతంగా లక్షణుడితో కలిసి ఇక్కడ విడిది చేసినట్టు స్థానిక స్థలపురాణం చెబుతోంది. పాక్‌లోని హిందువులు ప్రతి ఏటా ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు. 

 

తెలుపు నీలం రంగులో 8 అడుగుల ఎత్తువున్న ఈ మూల విగ్రహం, నరసింహ, ఆదివరాహ, హయగ్రీవ, హనుమాన్ మరియు గరుడ అనే ఐదు అంశాలతో పంచముఖ ఆంజనేయునిగా అవతరించింది. ఈ ఆలయంలో మూలవిరాట్‌ ఉన్న ప్రాంగణంలో 21 ప్రదక్షిణలు చేస్తే కోరుకున్న కోరికలు నెరువెరుతాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. కొన్ని సంవత్సరాల క్రితమే ఆలయంలో అభివృద్ధి పనులు చేపట్టారు. అంతేకాదు.. ఇటీవ‌ల ఈ ఆలయంలో తవ్వకాలు జ‌రిపారు. 

 

ఆ తవ్వకాల్లో భక్త హనుమాన్ విగ్రహాలు బైటపడ్డాయి. ఇవి అంత్యం పురాతనమైన విగ్రహాలు అని అధికారులు తేల్చాయి. ఇవి సుమారు 15 వందల సంవత్సరాల నాటివేగాక.. ఈ విగ్ర‌హాలు ఎంతో విలువైనవిగా తెలుస్తోంది. ఈ విగ్రహాలను అమూల్యమైన రాయితో ఆనాటి శిల్పులు చెక్కారని పురాతత్వ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ విగ్రహాలలో హనుమంతుడు, గణేశుడు, నంది మొదలైనవి కూడా ఉన్నాయి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: