పుణ్య‌క్షేత్రాలు ఎన్నో ఉన్నా కూడా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి ఉండే మ‌హిమే వేరు. ఇక్క‌డికి ప్ర‌తి రోజు ఆయ‌న‌ను ద‌ర్శించుకోడానికి ఎంతో మంది భ‌క్తులు వ‌స్తుంటారు. ఏడు కొండల్లో కొలువైన ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించి వడ్డీ కాసుల వాడైనా ఆ స్వామి హుండీలో కానుకలు వేస్తే చాలు జన్మ ధన్యం అని చాలా మంది భ‌క్తులు భావిస్తారు. అయితే తిరుమలలో వేంకటేశ్వరస్వామి అవతారం వెనుక ముఖ్యంగా మూడు కారణాలు ఉన్నాయని పురాణాలూ చెబుతున్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం...

 

ద్వాపర యుగంలో యశోదమ్మ చిన్నికృష్ణున్ని పెంచే అదృష్టం కలిగింది. ఇక ఆయ‌న‌ను పెంచి అంత‌టి అదృష్టాన్ని ద‌క్కించుకుంది. యశోదమ్మ అడక్కుండా రెండు మూడు సార్లు విశ్వరూప దర్శనభాగ్యం ఆమెకు కలిగింది. అయితే కృష్ణుడి బాల్య క్రీడలు అంత సాధారణమైనటువంటివి కావు. యశోదమ్మకి ఒక కోరిక మిగిలి పోయింది. రుక్మిణి కల్యాణం చూడలేకపోయింది. అప్పుడు ఆమె అడిగితే.. కృష్ణుడు "నేను కలియుగంలో వేంకటేశ్వరునిగా అవతరిస్తాను. నీవు వకుళమాతగా వచ్చి నా కల్యాణం చేయించు అని వాగ్దానం చేసాడంట. అందువల్ల స్వామి అవతారం జరిగినట్లు ఓ పురాణంలో చెబుతుంటారు.

 

ఇక మ‌రో క‌థ ఏమిటంటే... నారద ముని శ్రీమహావిష్ణువు దగ్గరకు వెళ్లి ఈ విధంగా అన్నాడ‌ట కలియుగంలో మానవులు తక్కువ కాలం జీవిస్తున్నారు. భగవంతుడి మీద అస్సలు మనస్సు లేదని చెప్ప‌గా. అప్పుడు శ్రీ మహావిష్ణువు.. నేను వారి పాపాలని కడగడానికి, వారిని ఉద్ధరించడానికి శ్రీ వేంకటేశ్వరునిగా అవతరిస్తాను. వారు ఒక్కసారి నా కొండకి వచ్చి, తల నీలాలు సమర్పించి, నా దర్శనం చేసుకుంటే వారి పాపాలని నేను తీసేస్తాను అని చెప్పాడంట. అలా అవతారం జరిగినట్లు మరో క‌థ కూడా ఉంది.

 

వేదవతిని వివాహం చేసుకోవడం , వేదవతి ఆమె తండ్రికి కూడా వివాహం చేద్దాం అని తలచినప్పుడు నేను శ్రీనివాసుడనే వివాహం చేసుకుంటానని చెప్పింద‌ట‌. అప్పుడు ఆమె తండ్రి శ్రీనివాసుడిని పరిణయమాడడమంటే మాటలా. పార్వతి దేవి చూడు ఎంత తపస్సు చేసింది శంకరుడు గురించి. ఆయ‌న కోసం ఎంతో త‌ప‌స్సు చేస్తేగాని ఆయ‌న దొర‌క‌లేదు అన్నాడ‌ట‌. అల అన‌గానే అప్పుడు వేదవతి కూడా హిమవత్ పర్వతానికి వెళ్లి తపస్సు చేసిందిట. ఆమె తపస్సు చేస్తుంటే, రావణాసురుడు వచ్చి ఎత్తుకుపోవాలని చూస్తే, వేదవతి వాడిని నువ్వు ఒక స్త్రీ వల్లే నాశనం అవుతావని శపించి అగ్ని ప్రవేశం చేసింది. ఆ సమయంలో అగ్నిహోత్రుడు ఆమెను కాపాడి, కూతురిగా స్వీకరించాడు. కొన్నాళ్ళ తరువాత, రావణుడు సీతమ్మని ఎత్తుకు పోతుండగా అగ్నిహోత్రుడు తారసపడ్డాడు. రావణాసురుడు నమస్కారం కూడా చేయలేదని ఆగ్రహించి.. నీ రథంలో ఉన్న సీత నిజమైన సీత కాదు, మాయ సీత అని అన్నాడంట. అసలు సీత నా దగ్గర ఉందని అప్పుడు రావణాసురుడు చాలా సంతోషపడి, అగ్ని హోత్రుడి దగ్గర ఉన్న మాయాసీతని నిజమైన సీత అనుకుని లంకకి తీసుకుపోయాడు.

 

నిజమైన సీత మాత్రం అగ్ని హోత్రుడి దగ్గరే ఉండిపోయింది. అసలు సీత తరపున వేదవతి అశోక వనంలో 12 నెలలు ఉండి, రాముడిని రప్పించి, రావణ వధ చేయించింది. వేదవతి తన కార్యం పూర్తి అయ్యాక, అగ్నిహోత్రుడు దగ్గరకి వెళ్ళిపోయింద‌ట‌. వేదము యొక్క స్వరూపమే సీత. సీతమ్మ స్వరూపమే వేదవతి. నిజానికి ఇద్దరు లేరు అని చెబుతుంటారు.  12 నెలలు సీతమ్మ తరపున వేదవతి అశోకవనంలో ఉంది కనుక, అగ్నిహోత్రుడు రాముడితో వేదవతిని కూడా భార్యగా స్వీకరించమన్నాడు. అప్పుడు రాముడన్నాడు, ఈ అవతారం లో నేను ఏకపత్ని వ్రతున్ని. నేను కలియుగంలో శ్రీ వేంకటేశ్వరునిగా అవతరించి వేదవతిని పరిణయమాడతనన్నాడ‌ట‌. అలా ఈ మూడు ముఖ్య కారణాల వల్ల ఆ భగవానుడు వెంకటేశ్వర స్వామి అవతారం ఎత్తాడనీ మ‌న పూర్వీకులు చెబుతుంటారు.ఇక ఈ విష‌యం చాలా మందికి నేటి యువ‌త‌కి తెలిసుండ‌దు. ఒక‌ప్పుడు వీటిగురించి తెలుప‌డానికి ఇంట్లో పెద్ద‌వారు ఉండేవారు. ఇప్పుడు ఎవ‌రి కాపురాలు వారు కావ‌డంతో పిల్ల‌ల‌కు ఈ విష‌యాల గురించి చెప్పేవారే లేక‌పోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: