బాబా బోధన ఆదర్శ జీవనానికి సాధన! బాబా లీలలు దుష్ట బుద్దులు, ఆవ లక్షణాలను రూపుమాపుతాయి. బాబా మహిమలు మనో వికారాల్ని విరిచేసి బతుకుల్ని తీయబర్చే అమృత గుళికలు. బాబా చెప్పిన సూక్తులు భావి జీవితానికి స్పూర్తిదాయకాలు. బాబా హితోక్తి మనిషి జీవిత పరమార్థానికి దిక్సూచి. సాయి తత్త్వంలోని జ్ఞాన వికాసాన్ని మానవత్వాన్ని వంటపట్టించుకుంటే బతుకు ఆనందమయమవుతుంది. జీవితం ధన్యమవుతుంది. నేడు మనిషి ఎదుర్కొంటున్న సంక్లిష్ట పరిస్థితులు, చిక్కులకు ఏకైక పరిష్కారం సాయితత్వమే. ఎవరికీ అర్థం కానిదేదీ బాబా చెప్పలేదు. బాబా చూపింది సత్యమార్గం. ఆ బాటలో నడిచి మంచిని పెంచుకోమన్నారు. సాయి బోధనలను మనసా, వాచా, కర్మణా ఆచరిస్తే బతుకులు తీయనవుతాయి. 

 

యోగీశ్వరులు ఒక లక్ష్యం, కర్తవ్యం కోసం ఈ భూమిపై అవతరిస్తారు. కర్తవ్యం పూర్తయ్యాక శరీరాన్ని విడుస్తారు. అయితే తమ భావాల్ని అందరిలో నింపి వెళ్ళడం వల్ల అవి ఎప్పటికి సజీవంగానే ఉంటాయి. ఆ సజీవ భావమే షిర్డీ సాయి స్వరూపమై వెలుగొందుతోంది. తన దైనిక వ్యవహారాలలోను, బోధనలలోను సాయిబాబా హిందూమతానికి చెందిన సంప్రదాయాలనూ, ఇస్లాం సంప్ర్రదాయాలనూ కూడా పాటించారు. నమాజ్చదవడం, అల్-ఫతీహా మననం, ఖొరాన్ అధ్యయనం వంటి ఆచారాలను ప్రోత్సహించారు కాని చాలా ఇతర ఆచారాలను పాటించలేదు.

 

ఆయన దుస్తులుకూడా సూఫీ ఫకీర్ తరహాలోనే ఉండేవి. మతం, కులం వంటి భేదాలపై ఆధారపడిన విద్వేషాలను పూర్తిగా వ్యతిరేకించారు. అలాగే సనాతన ఛాందస సంప్రదాయాలను, ఏ మతానివైనా గాని, ఖండించారు. తాను ఫకీరుగా ఉన్నా తన అనుయాయులను సామాన్య గృహస్థ జీవనం గడపమని చెప్పారు. ప్రార్థన, భగవన్నామస్మరణ, పుణ్యగ్రంధ పఠనం - వీటిని ప్రోత్సహించారు. ఖొరాన్ చదువమని ముస్లిములకూ, రామాయణం, భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రం వంటివి పారాయణం చేయమని హిందువులకూ ఉపదేశించారు. నీతి బద్ధమైన జీవనం గడపమనీ, ఇతరులను ప్రేమించి సహాయం చేయమనీ చెప్పారు.  సాధారణ జీవితం గడిపి మన జీవితాల్ని ధన్యం చేసిన బాబా తాను భగవంతునికి పరిపూర్ణ సేవకుడనని చెప్పుకున్న నినయ భూషణుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: