తిరుమల కలియుగ వైకుంఠం. కలియుగంలో దర్శన ప్రార్థనార్చనలతో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శ్రీవేంకటేశ్వరుడుగా తిరుమల కొండలోని ఆనంద నిలయంలో అవతరించార‌ని అంటుంటారు. అందుకే తిరుమల కలియుగ వైకుంఠం అని భక్తుల విశ్వాసం. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ప్రతిదినం లక్ష నుండి రెండు లక్షల వరకు భక్తులు సందర్శిస్తుంటారు. అయితే అతి తక్కువ మందికి మాత్రమే తెలిసిన  వివరాలతో శ్రీవారి ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ‘ది సేక్రెడ్‌ ఫుడ్‌ ఆఫ్‌ గాడ్‌’ (స్వామివారి పవిత్ర ప్రసాదాలు) అనే పుస్తకం రాశారు. అందులో శ్రీ‌వారికి నైవేద్యం ఎలా పెడ‌తారు అన్నది కూడా ఉంది. ఆ వివరాలు మీకోసం..


 
ప్రసాదం సమర్పించడానికి ముందు గర్భాలయాన్ని నీళ్ళతో శుద్ధి చేస్తారు. గాయత్రీ మంత్రం జపిస్తూ నీళ్లు చల్లుతారు. వండిన ప్రసాదాలను మూత పెట్టిన గంగాళాల్లో దేవుడి ముందు ఉంచుతారు. స్వామి, ప్రసాదాలు, నైవేద్యం సమర్పించే అర్చకుడు మాత్రమే గర్భగుడిలో ఉంటారు. అనంత‌రం గర్భాలయం తలుపులు మూసేస్తారు. విష్ణు గాయత్రి మంత్రం పఠిస్తూ అర్చకుడు ప్రసాదాల మీద నెయ్యి, తులసి ఆకులు చల్లుతారు. కుడిచేతి గ్రాసముద్రతో ప్రసాదాన్ని తాకిన అర్చకుడు స్వామి కుడి చేతికి దానిని తాకించి, నోటి దగ్గర తాకుతారు. అంటే స్వామికి గోరు ముద్దలు తినిపించడం అన్న మాట. పవిత్ర మంత్రాలు ఉచ్ఛరిస్తూ అన్నసూక్తం నిర్వర్తిస్తారు. 

 

చరాచర సృష్టికి కర్త అయిన స్వామి నైవేద్యం సమర్పించడం అంటే, సృష్టిలో ఆకలితో ఉన్న సమస్తాన్నీ సంతృప్తి పరచడమే. ఈ విధంగా స్వామిని వేడుకుంటూ, ముద్ద ముద్దకీ నడుమ ఔషధగుణాలున్న ఆకులు కలిపిన నీటిని సమర్పిస్తారు. నైవేద్యం సమర్పించేంత వరకూ ఆలయంలో గంట మోగుతూనే ఉంటుంది. ఇది స్వామికి భోజనానికి పిలుపుగా దీనిని భావిస్తారు. రోజుకు మూడు పూటలా స్వామికి నైవేద్యం సమర్పిస్తారు. ఇక్క‌డ మ‌రో విష‌యం ఏంటంటే.. ప్రసాదం వండేవారు వంట సమయంలోగానీ, తర్వాతగానీ వాసన చూడరు. వాసన సోకకుండా ముక్కు, నోటికీ అడ్డుగా వస్త్రం పెట్టుకుంటారు. ఇక... శ్రీవారికి సమర్పించేదాకా బయటి వారెవరూ దానిని చూడకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి: