త్రిమూర్తులలో చివరివాడైన లయకారుడు శివుడు. సింధూ నాగరికత కాలం నుంచే పూజలందుకున్న శివునికి దేశమంతటా అధిక సంఖ్యలో శివాలయాలు ఉన్నాయి. హిందువులు పూజించే దేవుళ్లలో ప్రథముడైన శివుడిని శైవంలో పరమాత్మగాను, ఆదిదేవునిగాను భావిస్తారు. వైష్ణవంలో శివుడిని విష్ణువు యొక్క రూపంగా కొలుస్తారు. చాలామంది శివుడు మోక్షాన్ని మాత్రమే ఇస్తాడని భావిస్తూ ఉంటారు. అయితే పురాణాలు మాత్రం శివుడు సిరిసంపదలు ప్రసాదించడంలో ముందుంటాడని చెబుతున్నాయి. 
 
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమాళ్ల సంకీస గ్రామంలో ప్రజలకు సిరిసంపదలను ప్రసాదించే శివుడు కొలువై ఉన్నాడు. శివుడు దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆవిర్భవించాడు. శివుడు అనేక ప్రాంతాల్లో ఆవిర్భవించినా ప్రతి పుణ్యక్షేత్రానికి ఏదో ఒక ప్రత్యేకత తప్పకుండా ఉంటుంది. ఈ క్షేత్రంలో శివుడిని దర్శించుకుంటే సంపదలు ప్రసాదిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. కాకతీయుల కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించారని సమాచారం. 
 
డోర్నకల్ లోని ఈ క్షేత్రం కాకతీయుల భక్తికి నిలువుటద్దంలా కనిపిస్తూ ఉంటుంది. ఈ క్షేత్రం మారుమూల ప్రాంతంలో ఉండటంతో ఇప్పుడిప్పుడే ఈ క్షేత్రం యొక్క ప్రాముఖ్యత ప్రజలకు తెలుస్తోంది. ఈ క్షేత్రంలోని శివుడిని దర్శించుకుంటే దరిద్రం తొలగిపోయి సంపదలు పొందుతారని ఇక్కడి గ్రామస్తులు చెబుతున్నారు. ఈ క్షేత్రంలో శైవ సంబంధమైన పర్వదినాల్లో శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. 
 
ఇదే గ్రామంలో శివాలయంతో పాటు సీతారామలక్ష్మణులతో పాటు భరత శత్రుఘ్నులు కూడా గర్భాలయంలో కొలువై ఉన్న రామాలయం కూడా ఉంది. వందల సంవత్సరాల కాలం నాటి ఈ ఆలయం వల్ల గ్రామం హరిహర క్షేత్రంగా పేరు తెచ్చుకుంది. చారిత్రక వైభవం గల ఈ పుణ్యక్షేత్రాలను దర్శిస్తే అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు                                       

మరింత సమాచారం తెలుసుకోండి: