తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతిరోజు మూడు వేల పైచిలుకు సమయ నిర్దేశిత సర్వ దర్శనం టోకెన్లను టీటీడీ తిరుపతిలోని విష్ణు నివాసం శ్రీనివాసo, అలిపిరి వద్ద గల భూదేవి కాంప్లెక్స్ నందు భక్తులకు ఇస్తున్నది. ఇప్పటికే ఈనెల 18వ తేది వరకు ఉన్న కోటాకు పూర్తిగా టోకెన్లు ఇవ్వడం జరిగింద‌న్నారు. అయితే దూర ప్రాంతాల నుండి భక్తులు తిరుపతికి వచ్చి ఇక్కడి కౌంటర్లలో టికెట్లు పొందిన వారు, వారి దర్శనం తేదీ వచ్చే వరకు తిరుపతి లోనే బస ఉండి తమకు టైం స్లాట్ టోకెన్లు వచ్చిన తేదీలలో దర్శనానికి వెళ్తున్నారని తెలిసి టీటీడీ ఈ ప్ర‌క‌ట‌న చేసింది. ఈ క్రమంలో కొందరు భక్తులు తిరుపతిలోనే రెండు మూడు రోజులు ఉండిపోతున్నారని సమాచారం. 

 

దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఇక్కడ ఇబ్బందులు పడకుండా, వారి ప్రాంతాల నుంచే ఆన్ లైన్ ద్వారా దర్శనం టోకెన్లు పొందవలసిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.  ఇదిలా ఉండ‌గా జూన్ 21న ఆదివారం ఉదయం 10.18 గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం 1.38 గంట‌ల వరకు సూర్యగ్రహణం ఉంటుంద‌ని తెలిపారు. కావున  జూన్ 20వ తేదీ రాత్రి 8.30 గంట‌ల‌కు ఏకాంత సేవ త‌రువాత మూసిన శ్రీ‌వారి ఆల‌య తలుపులను జూన్ 21న మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు తెరుస్తార‌ని పేర్కొంది. మ‌ధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు సుప్ర‌భాతం, శుద్ధి, పుణ్యాహ‌వ‌చ‌నం, తోమాల సేవ, కొలువు, బంగారు వాకిలి లోప‌ల పంచాంగ శ్ర‌వ‌ణం నిర్వ‌హిస్తార‌ని తెలిపింది.  అనంత‌రం మొద‌టి అర్చ‌న‌, మొద‌టి గంట‌, బ‌లి శాత్తుమొర‌, రెండో అర్చ‌న, రెండో గంట త‌దిత‌రాల‌ను ఏకాంతంగా చేప‌డ‌తారు.

 

రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు శుద్ధి, రాత్రి కైంక‌ర్యాలు, రాత్రి గంట, రాత్రి 8 నుండి 8.30 గంట‌ల ఏకాంతసేవ నిర్వ‌హిస్తారు. ఈ కైంక‌ర్యాల కార‌ణంగా జూన్ 21వ తేదీ నాడు పూర్తిగా శ్రీ‌వారి ఆల‌యంలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఉండ‌దు. క‌ల్యాణోత్స‌వం ఆర్జితసేవ‌ను టిటిడి ర‌ద్దు చేసింది. గ్ర‌హ‌ణం స‌మ‌యంలో మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇత‌ర ప్రాంతాల్లో అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ ఉండ‌దు. భ‌క్తులు ఈ విష‌యాల‌ను గ‌మ‌నించాల‌ని టిటిడి కోరుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: