దానం చేసే గుణమూ,ప్రియముగా మాట్లాడడమూ, ధీరత్వమూ,ఉచితానుచితాల జ్ఞానమూ అభ్యాసం వల్ల రావు. అవి సహజ గుణాలయి ఉండాలి.

 

తాను చేరదీసి ఆశ్రయమిచ్చిన కర్ణుడే దానకర్ణుడని పేరు పొందడం చూసి ఆ మాత్రం దానం నేను చేయలేనా అని కర్ణుడి దాతృత్వంతో పోటీ పడి అడిగినవారికి లేదనకుండా దానం చేస్తానని ప్రకటించేడు దుర్యోధనుడు.

 

ఓ రోజు ఓ మునీశ్వరుడు దుర్యోధనుడి వద్దకు వచ్చి " రాజా! నేను ఓ యజ్ఞం చేయ తలపెట్టేను.దానికి చాలా కట్టెలు అవసరం. ఇప్పించమని అడిగేడు." సరే! తమకు కావలసినన్ని కట్టెలు తీసుకుని వెళ్ళండి." అన్నాడు.దుర్యోధనుడు.

 

అప్పుడా మునీశ్వరుడు " రాజా! ఇప్పుడు కాదు. యజ్ఞం ప్రారంభించేముందు వచ్చి తీసుకుని వెళ్తానన్నాడు.

 

 "సరే" అన్నాడు దుర్యోధనుడు.కాలగమనంలో ఋతువులు మారేయి.వర్షఋతువు వచ్చింది.మునీశ్వరుడు వచ్చి తనకిస్తానన్న కట్టెలు ఇప్పించమని అడిగేడు."

 

 స్వామీ! నేను ఇస్తానన్నప్పుడు తమరు తీసుకు వెళ్ళలేదు. మరి ఇప్పుడేమో వర్షాకాలం. ఈ సమయంలో మీకు కావలసినన్ని ఎండు కట్టెలు లభించడం కష్టం కదా! మరోసారి వచ్చి తీసుకు వెళ్ళండి." అన్నాడు దుర్యోధనుడు.

 

" సరే!" అని ఆ మునీశ్వరుడు కర్ణుడి వద్దకు వెళ్లి తన అవసరాన్ని తెలిపేడు. వెంటనే కర్ణుడు దుర్యోధనుడు తనకిచ్చిన భవంతిని కూలగొట్టించి అందులోని కలపను తీసుకోమన్నాడు.కర్ణుడి దాతృత్వం తెలుసుకుని దుర్యోధనుడు సిగ్గుపడి తన దాన ప్రతిజ్ఞను ఉపసంహరించుకున్నాడు.

 

తనకు అక్కర్లేని దానిని దానం చేయడం అధమం,తనకున్నదానిలో దానం చేయడం మధ్యమం ,దానం చేసేస్తే తనకు లేకపోయినా సరే చేసే దానం ఉత్తమం.ఈ గుణమే కర్ణుడికి దానకర్ణుడిగా పేరు తెచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: