నేటి నుంచి పూరి జగన్నాథుని రథయాత్ర కన్నుల పండుగగా జరగనుంది.  ఈ ఏడాది యాత్రలో భక్తులు పాల్గొనకూడదని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రథయాత్ర నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా చేపట్టాలని సూచించింది. అనేక నిబంధ‌న‌ల మ‌ధ్య ఈ సారి పూరి జ‌గ‌న్నాథుడి ర‌థ‌యాత్ర కొన‌సాగ‌నుంది.  కరోనా వ్యాప్తి నేపథ్యంలో, పెద్దసంఖ్యలో భక్తులు రాకుండా చూసుకోవాలని, ప్రజారోగ్యం విషయంలో రాజీపడరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా ఒడిశా ప్రభుత్వం రథయాత్రను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఒడిషా రాష్ట్రంలో గల పూరీ దివ్య క్షేత్రంలో శ్రీమహావిష్ణువు జగన్నాథుడి రూపంలో సోదరుడు బలభద్ర, సోదరి సుభద్రలతో కలసి కొలువు తీరి ఉన్నాడు.

 

రథయాత్రకు రెండు రోజులు ముందుగా అమావాస్య నాడు, నూతన దేవతామూర్తుల నేత్రోత్సవం జరుగుతుంది. యథావిధిగా పూజలు మొదలవుతాయి. మరుసటి రోజు ప్రజలకు నవయవ్వన దర్శనం లభిస్తుంది. ఆషాఢ శుక్ల విదియనాడు పాండాలు మేళతాళాలతో ఉదయకాల పూజలు నిర్వహించి 'మనిమా' (జగన్నాథా...) అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ విగ్రహాల్ని కదిలిస్తారు. ఆనందబజారు, అరుణస్తంభం మీదుగా అత్యంత కోలాహల వాతావరణంలో ఊరేగిస్తూ రథం వెనక భాగం నుంచి తీసుకువచ్చి రత్నపీఠం మీద అలంకరింపజేస్తారు. ఈ ఉత్సవాన్ని 'పహండీ' అంటారు. ఆ దశలో కులమత భేదాలకు తావుండదు. గుండిచా ఆలయానికి వెళ్లేందుకు సిద్ధమైన సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథారూఢులై ఉండగా... 'ఇలపై నడిచే విష్ణువు'గా గౌరవాభిమానాల్ని అందుకునే పూరీ రాజు పల్లకీలో అక్కడికి చేరుకోవడంతో సంరంభాలు మిన్నంటుతాయి. పరమాత్ముని ముందు సేవకుడిగా మారిన ఆ మహారాజు బంగారపు చీపురుతో రథాల లోపల ఊడుస్తాడు. దీన్నే 'చెరా పహారా' అంటారు.

 

పూరీ దేవాలయంలో మూల విరాట్‌ నుండి ప్రసాదం వరకు అంతా విశిష్టమే. దేవాలయాలలో మూలవిరాట్‌ విగ్రహాలు రాతితో మరియు ఉత్సవ విగ్రహాలు పంచలోహములతో తయారుచేయబడతాయి. కాని ఈ విశిష్ట దేవాలయంలో విగ్రహాలు చెక్కతో తయారు చేయబడి ఉండ‌టం గ‌మ‌నార్హం. అదే విగ్రహాల‌ను ఉత్సవమూర్తులుగా ఊరేగింపబడతారు.  ప్రసాదంగా ఇచ్చే అన్నం, పప్పు మొదలైనవి కుండలలో వండుతారు. ఇత దేవాలయాలలో మాదిరిగా స్వామి తన దేవేరులతో కొలువై ఉండక, సోదరుడు బలభద్ర, సోదరి సుభద్రతో కొలువై ఉంటాడు. అందుకే ఈ ఆలయాన్ని సోదర ప్రేమకు ప్రతీకగా కీర్తి పొందింది.

మరింత సమాచారం తెలుసుకోండి: