గురుపౌర్ణమిఅంటే గురువులని సత్కరించడం. మనకు అమ్మ నాన్న తర్వాత గురువే ప్రత్యక్ష దైవం. మనకి మంచిది చెడు అంటే ఏంటో చెప్పి మనల్ని ఒక  ఉన్నత స్థానాలకు చేర్చే గొప్ప వ్యక్తి గురువు.అజ్ఝానమనే చీకటిని తొలగించి జ్ఝానాన్ని అందించే గురువు సాక్షాత్తు బ్రహ్మ అనడంలో సందేహం లేదు. అలాంటి గురువుని పూజించడానికి  ఒక రోజు ఉందంటే అది ఈ ఆషాఢమాసములో వచ్చే గురుపౌర్ణమి రోజే. దీనినే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఎందుకలా అంటారు అసలు గురు పౌర్ణమి విశిష్టత ఏంటో తెలుసుకుందాం..

 

 

 

పూర్వం వారణాశిలో ఓ పేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారట. ఆ బ్రాహ్మణుని పేరు 'వేదనిధి', ఆయన సతీమణి పేరు 'వేదవతి'. వీరు ఇరువురు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నోములు నోచినా వారికి ఇంకా సంతాన భాగ్యం  కలగలేదట. అయితే ప్రతిరోజు వ్యాసభగవానులు మధ్యాహ్న సమయంలో రహస్యంగా గంగానదికి స్నానానికై వస్తూ ఉంటారని వేదనిధికి తెలుస్తుంది. ఈ క్రమంలోనే వేదవ్యాసుడు ఒకరోజు ఒక భిక్షువు రూపం ధరించి గంగానది స్నానానికి వెలుతుండాడు. అది చూసిన వేదనిధి వెంటనే వారి పాదాలను ఆశ్రయిస్తాడు. దానికి ఆ భిక్షువు చీదరించుకుని కసురుకుంటాడు. అయినా సరే వేదనిధి ఆయన పాదాలను  వదలకుండా  వేడుకుంటూ ఉంటాడు. మహానుభావా తమరు సాక్షాత్తు వ్యాసభగవానులని మిమ్మల్ని శరణు పొందగోరుచున్నాను అంటాడు.

 

 

 

వేదనిధి మాటలు విన్న ఆ భిక్షువు వేదనిధిని ఆప్యాయంగా చేరదీస్తాడు. ఆ తరువాత వేదనిధిని ఏమి కావాలో కోరుకోమంటారు. ఈ క్రమంలో రేపు నా తండ్రిగారి పితృకార్యము. దానికి తమరు బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక దయచేయాలని వేదనిధి వేడుకుంటాడు. అందుకు ఆ మహర్షి వేదనిధి ఆహ్వానాన్ని అంగీకరిస్తాడు.వ్యాసున్ని కలిసిన సంతోషంతో ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణికి గంగానదీతీరాన జరిగిన విషయాన్ని వివరిస్తాడు. ఆ తురువాతి రోజున ఉదయమే ఇచ్చిన మాటప్రకారం వ్యాస మహర్షి వారిగృహానికి విచ్చేస్తాడు. దీంతో వేదనిధి దంపతులు మహర్షిని సాదరంగాలోనికి ఆహ్వానించి అతిథి సత్కారము చేసి పూజిస్తారు.వారి పూజ అనంతరం ఎంతోశుచిగా వంటకాలను సిద్ధపరిచి శ్రాద్ధవిధులను విధి విధానంగా నిర్వహిస్తారు. అనంతరం ఆ దంపతులు ఆ వ్యాస భగవానునికి సాష్టాంగ నమస్కారం చేస్తారు.

 

 

 

వారి ఆతిధ్యాన్ని స్వీకరించిన ముని ఎంతో సంతుష్ఠులైన ఓ పుణ్య దంపతులారా.. మీకు ఏమి వరం కావాలో కోరుకోండి అని అంటాడు. ఎన్ని నోములు, వ్రతాలు చేసినా సంతానభాగ్యము మాత్రము మాకు కలుగలేదు అని బదులు పలుకుతారు. ఆ మాటలు విన్న ముని త్వరలోనే మీకు తేజోవంతులు, ఐశ్వర్యవంతులు అయిన పదిమంది పుత్రసంతతి కలుగుతుందని ఆశీర్వదిస్తాడు. ఈ క్రమంలో వేదనిధి, వేదవతి దంపతులు వ్యాసముని అనుగ్రహంతో సుఖసంతోషాలు కలిగి పుత్రులతో ఆనందంగా జీవించసాగారు. అపార జ్ఞానం కలిగిన వేదవ్యాసుడు. వేదవ్యాసుని మానవజాతి కంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళాడు కాబట్టి ఆయన్ను మానవాళికంతటికీ గురువుగా భావిస్తుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: