ఈనెల 13 నుంచి 19 వరకు బాలబ్రహ్మేశ్వరస్వామి, జోగులాంబ అమ్మవారి ఆలయాలను మూసివేస్తున్నట్లు అలంపూర్‌ ఆలయాల అధికారులు తెలిపారు. అలంపూర్‌లో దర్గా ఉర్సు ఉత్సవాల సందర్భంగా వారం రోజుల పాటు అధికసంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ల‌క్ష‌లాదిగా జ‌నం త‌ర‌లివ‌స్తుంటారు. తెలంగాణ ప్రాంతం నుంచే కాకుండా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు  రాష్ట్రాల నుంచి భ‌క్తులు త‌ర‌లివ‌స్తుంటారు. అయితే ఈసారి భారీ సంఖ్య‌లో భ‌క్తులు త‌ర‌లివ‌స్తే  కొవిడ్‌-19 వ్యాప్తి చెందే ప్రమాదముందని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు ఆల‌యాల అధికారులు తెలిపారు. 

 


ఉత్సవాల సమయంలో  ఆలయాల్లో అర్చకులు నిత్యపూజలు నిర్వహించి మూసివేస్తారని, ఉభయ ఆలయాల దర్శనాలకు భక్తులకు అనుమతి లేదన్నారు. భక్తులు దేవస్థానం వారికి సహకరించి 13 నుంచి 19వ తేదీ వరకు దర్శనాలకు రాకుండా విరమించుకోవాలని  అధికారులు స్ప‌ష్టం చేశారు.జోగులాంబ ఆలయాన్ని 14వ శతాబ్దంలో బహమనీ సుల్తానులు ధ్వంసం చేయగా, జోగులాంబ, చండి, ముండి విగ్రహాలను బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో భద్రపర్చారు. కొద్ది సంవత్సరాల క్రితం జోగులాంబ ఆలయాన్ని ప్రత్యేకంగా నిర్మించారు. ఇక్కడ అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన (ఐదవ శక్తిపీఠం) జోగుళాంబ ఆలయం ఉంది. 

 


అమ్మవారిపై దవడ పంటితో ఇక్కడ పడినట్టు పురాణకథనం. జోగులాంబ మహాదేవి, రౌద్ర వీక్షణ లోచన, అలంపురం స్థితమాత, సర్వార్థ ఫల సిద్ధిద అని జోగులాంబ దేవిని ప్రార్థిస్తారు. అమ్మవారు ఉగ్రరూపంతో ఉన్నప్పటికీ, ఆలయంలో గల కోనేరు ఈ ప్రాంతంలో వాతావరణాన్ని చల్లబరుస్తూ ఉంటుందని స్థానికుల విశ్వాసం. ఇక్కడ అమ్మవారు ఉగ్రస్వరూపిణి. మొదట అమ్మవారి విగ్రహం బాల బ్రహ్మేశ్వరాలయంలో ఉండేది. 2008 లో ప్రత్యేకంగా ఆలయ నిర్మాణం చేసి అమ్మవారిని అక్కడకు తరలించారు. బాల బ్రహ్మేశ్వరాలయంలో ఉన్నప్పుడు అమ్మవారిని కిటికీ గుండా చూసేవారు. ఇక‌ బాల బ్రహ్మేశ్వరాలయం నవ బ్రహ్మ ఆలయాలలో ముఖ్యమైనది. జోగులాంబాలయం పునర్నిర్మాణం జరిగే వరకు ఇక్కడ ప్రధానార్చకాలయం ఇదే. జోగులాంబ పూర్వపు గుడి విధ్వంసం జరిగాకా, కొత్త ఆలయం నిర్మించేదాకా ఈ స్వామి ఆలయంలోనే పూజలందుకున్నది. ఈ దేవాలయం చుట్టూ బహిఃప్రదిక్షణాపథాన్ని, ప్రాకారాన్ని, ముఖమంటపాన్ని చాళుక్య విజయాదిత్యుడు కట్టించినట్లు తెలుస్తుంది. ఈ నిర్మాణాలలో శిల్పి ఈశాన్యాచారుడి కృషి చెప్పుకోదగినదని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: