శివుడు కోరిన కోరికలు తీర్చే భోళా శంకరుడు. శివుని అనుగ్రహం పొందితే సమస్తం లభిస్తాయి. సర్వశుభాలను అందించే మహాదేవుడు శివుడు. పురాణాలు శివుడికి అభిషేకం చేయడం ద్వారా దైవానుగ్రహంతో పాటు పరిపూర్ణ జ్ఞానాన్ని పొందవచ్చునని చెబుతున్నాయి. శివుడు అభిషేక ప్రియుడు. అభిషేకం సమయంలో దేవుని విగ్రహాల నుంచి శక్తులు వెలువడుతాయని పురాణాలు చెబుతున్నాయి. 
 
శివునికి అభిషేకం చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. కొన్ని పదార్థాలతో శివునికి అభిషేకం చేయిస్తే కోరుకున్న కోరికలు తప్పక నెరవేరుతాయి. తిరుమంజనపొడితో శివునికి అభిషేకం చేయిస్తే దేవుని అనుగ్రహం కలుగుతుంది. పసుపు పొడితో అభిషేకం చేయిస్తే ప్రభుత్వ అధికారుల నుంచి సానుకూల ఫలితాలు వస్తాయి. శివునికి బియ్యం పిండితో అభిషేకం చేయిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి. 
 
పంచామృతంతో శివునికి అభిషేకం చేయిస్తే అష్టైశ్వర్యాలు చేకూరి అప్పుల బాధలు తొలగిపోతాయి. చందనాది తైలంతో అభిషేకం చేయిస్తే ఉదర సంబంధిత సమస్యలు దూరమవుతాయి. నెయ్యితో అభిషేకం చేస్తే మోక్షం లభిస్తుంది. బత్తాయి పండ్ల రసంతో అభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధించటంతో పాటు అనారోగ్యాలు మాయమవుతాయి. చెరుకు రసంతో అభిషేకం చేస్తే ఆయుర్ధారంతో పాటు ఆరోగ్యం లభిస్తుంది. 
 
శివునికి నిమ్మరసంతో అభిషేకం చేస్తే శత్రుభయం ఉండదు. కొబ్బరినీటితో శివుడిని పూజిస్తే ఉన్నత పదవులు, హోదా, గౌరవం, కీర్తి లభిస్తుంది. శివునికి ఉసిరికాయపొడితో అభిషేకం చేస్తే రోగాలు మటుమాయం అవుతాయి. పన్నీరుతో అభిషేకం చేస్తే సంతోషకరమైన జీవనం లభిస్తుంది. శివునికి చందనంతో అభిషేకం చేయడం ద్వారా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అన్నాభిషేకాలు చేసిన వాళ్లకు సకల సంతోషాలు సిద్ధిస్తాయి. శివునికి తేనెతో అభిషేకం చేస్తే అద్భుతమైన గాత్రం సొంతమవుతుంది. బిల్వపత్రాలతో శివుడిని పూజిస్తే పరమేశ్వరుని అనుగ్రహం తప్పక లభిస్తుంది.                        

మరింత సమాచారం తెలుసుకోండి: