కేరళ తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ వివాదంపై ట్రావెన్​కోర్​ రాజకుటుంబానికి అనుకూలంగా సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ట్రావెన్ కోర్ రాజవంశానికి ఉన్న ఆలయ పాలనాపరమైన హక్కులను సమర్థించింది.

 

 

2011లో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టింది జస్టిస్​ యూయూ లలిత్​ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం. పద్మనాభస్వామి ఆలయ పరిపాలనలో.. ట్రావెన్‌కోర్ పూర్వపు రాజకుటుంబ హక్కులను సమర్థించింది. చివరి పాలకుడి మరణం కారణంగా రాజకుటుంబం తమ హక్కులను ప్రభుత్వానికి వదులుకోదని స్పష్టం చేసింది. పద్మనాభస్వామి ఆలయం నిర్వహణ బాధ్యత రాజకుటుంబానికే అప్పగించింది.

 

 

ఆలయ కార్యకలాపాల నిర్వహణకు.. తిరువనంతపురం జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది సుప్రీం ధర్మాసనం. కొత్త కమిటీ ఏర్పాటయ్యే వరకు ప్రస్తుత కమిటీ కొనసాగుతుందని స్పష్టం చేసింది.

 

 

ఆలయ నిర్వహణపై 2009లో విశ్రాంత ఐపీఎస్​ అధికారి టీపీ సుందరరాజన్​ కేరళ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. రాజవంశస్థుల నుంచి ఆలయ నిర్వహణ బాధ్యతలను కేరళ ప్రభుత్వానికి అప్పగించాలని కోరారు. అయితే, ఆలయ విషయంలో ఎలాంటి వివాదం లేదని... సంప్రదాయ, ఆధ్యాత్మిక నమ్మకాలు ఉన్నాయని కేరళ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టంచేసింది.

 

అనంత పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ వివాదానికి సంబంధించి... మొదట 2011 జనవరి 31న కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది. ఆలయ ఆస్తులు, నిర్వహణ బాధ్యతలను ట్రావెన్‌కోర్‌ రాజవంశం నుంచి స్వాధీనం చేసుకుని ఆలయంపై నియంత్రణను చేపట్టాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 1991లో ట్రావెన్‌కోర్ చివరి పాలకుడి మరణంతో కుటుంబ హక్కులు నిలిచిపోయాయని హైకోర్టు తేల్చిచెప్పింది.

 

 

ఆలయంలో కల్లారాలుగా పిలిచే.. అన్ని నేలమాళిగలను తెరిచి, లెక్కింపు చేపట్టాలని తీర్పునిచ్చింది హైకోర్టు. ఆభరణాలు, విలువైన వస్తువులతో కూడిన జాబితా తయారు చేసి ప్రజలు, భక్తులు, పర్యటకులకు ప్రదర్శించడానికి మ్యూజియం వంటి ఏర్పాట్లు చేయాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనేక శతాబ్దాల కాలంలో స్వాధీనం చేసుకున్న ఆలయ సంపదను.. రహస్యంగా ఉంచడంలో అర్థం లేదని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: