హిందూ మతంలోని ప్రధాన దేవతలలో ఒకరు శివుడు. త్రిమూర్తుల్లో ఒక‌రైన శివుడుని.. పరిమితులు లేని వాడిగా, నిరాకారుడిగా మరియు గొప్పవాడిగా హిందువులు పూజిస్తారు.  అలాంటి ప‌ర‌శివుడికి దేశ‌వ్యాప్తంగా ఎన్నో ప్రసిద్ధి ఆల‌యాలు ఉన్నాయి. అందులో శ్రీ శంభు లింగేశ్వర స్వామి ఆల‌యం కూడా ఒక‌టి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం పరిధిలోని మేళ్లచెరువు మండల కేంద్రంలోని కొలిచిన వారికి కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీర్చే శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయాలలో ఒకటి.

 

ఈ ఆలయం చాలా పురాతనమైంది. మ‌రియు ఈ శంభు లింగేశ్వర స్వామి ఆల‌యానికి వేల సంవత్సరాల చరిత్ర కూడా ఉంది. అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో శివుడికి అంకితం చేయబడిన ప్రాచీన దేవాలయాలలో ఒకటి. ఈ దేవాలయ నిర్మాణ శైలి కాకతీయ రాజవంశం యొక్క గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుంది. ఇక ఇక్కడి స్వామి శంభులింగేశ్వరుడిగా పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. ఈ దేవాల‌యంలో అద్భుత విశేషం ఏంటంటే.. గర్భాలయంలోని శివలింగం  పుష్కరానికి ఒక అంగుళం చొప్పున పెరుగుతూ ఉండటం. 

 

అవును! శివలింగం పెరుగుతూ ఉందనడానికి నిదర్శనాన్ని ఇక్కడి అర్చక స్వాములు చూపిస్తారు కూడా. అలాగే ఈ శివలింగం మ‌రో ప్రత్యేకత ఏమిటంటే.. ఆ శివలింగం అగ్ర భాగాన అనగా తల పైన ఒక గుంటలాగా ఉంటుంది. ఆ గుంటలో నుంచి నీరు వస్తుంది. ఆ చోటు నుంచి అక్కడి పూజరులు నీరు తీసి భక్తులకు తీర్ధంగా ఇస్తారు. మరలా ఆ చిన్ని గుంట నిండ నీరు నిండుతుంది. అయితే ఈ రంధ్రం నిండిపోయి నీరు పొర్లిపోవడం జరగదు. అలాగే రంధ్రంలోని నీరు తగ్గిపోవడం జరగదు. ఇదే ఆ స్వయంభు శివలింగం ప్రత్యేకత. ఇక  శివరాత్రి వ‌చ్చిందంటే.. ఇక్కడ జరిగే జాతరకు వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు .. స్వామి దర్శనం చేసుకుని పునీతులవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: