దైవ దర్శనం చేసుకోవాలంటే.. భక్తితో పాటు డబ్బు కూడా ఉండాలి.. అందుకే మదిలో ఎంత భక్తి ఉన్నా.. చాలామంది పేదవాళ్లు తీర్థయాత్రలకు దూరంగా ఉంటారు. తిరుపతి వెంకన్నను సైతం జీవితంలో ఒక్కసారి కూడా చూడలేని పేదలు ఎందరో ఉంటారు.


అయితే కేవలం డబ్బు ఉంటే చాలు.. దేవుళ్లను దర్శించుకోవచ్చన్నదీ కొన్నసార్లు కరెక్టు కాదు.. ఎందుకంటే.. కొన్ని ఆలయాలకు ప్రత్యేకతలు ఉంటాయి. చాలా అరుదుగానే దర్శనం ఇచ్చే దేవుళ్లూ ఉంటారు. కంచిలోని అత్తి వరదరాజ పెరుమాళ్ కూడా అలాంటి దేవుడే. మీరు ఎంత కోటీశ్వరులైనా ఇక్కడి దేవుడిని మూడు, నాలుగు సార్లు దర్శించుకోవడం అసాధ్యం.


ఎందుకంటే ఇక్కడి దేవుడు కేవలం 40 ఏళ్లకు ఓసారి మాత్రమే దర్శనం ఇస్తారు. 40 ఏళ్లకు ఓసారి.. 48 రోజుల్లో ఎప్పుడైనా స్వామి వారిని దర్శించుకోవచ్చు. అరుదుగా లభించే దర్శనం కాబట్టి.. భక్తులు ఈ స్వామి దర్శనం కోసం బారులు తీరతారు. ఇక్కడి దేవుడు ఆలయంలో కాకుండా పుష్కరిణిలోని పెట్టెలో ఉంటాడు.


40 ఏళ్లకు ఓసారి ఆ పెట్టెను బయటకు తీసి స్వామివారిని ఆలయంలో ప్రతిష్టించి 48 రోజుల పాటు పూజిస్తారు. మళ్లీ పూజల అనంతరం.. స్వామిని అదే వెండిపెట్టెలో పెట్టి.. పుష్కరిణిలో భద్రపరుస్తారు. అంటే మీ జీవితంలో ఆ స్వామిని ఒక్కసారి దర్శించుకున్నాక.. మళ్లీ దర్శించుకోవాలంటే... 40 ఏళ్లపాటు ఎదురు చూడాలి.


రెండోసారి దర్శనం చేసుకోవాలంటే... మరో 40 ఏళ్లపాటు ఎదురు చూడాలి. అందుకే.. మీ దగ్గర ఎంత సొమ్ము ఉన్నా.. ఆ స్వామిని మూడు సార్లు దర్శించుకోవడం దాదాపు అసాధ్యం. ఆలోపు మృత్యువు మిమ్మల్ని పలకరిస్తుంది. ఇక్కడి వరదరాజ పెరుమాళ్‌ ఆలయ ధర్మకర్త తాతాచార్యుల కుటుంబానికి చెందిన 101 సంవత్సరాల వృద్ధురాలు రాజమ్మాళ్‌ మాత్రం అరుదుగా మూడోసారి దర్శనం చేసుకున్నారు.


ఆమె గతంలో 1939, 1979లో రెండుసార్లు అత్తివరదర్‌ను దర్శించుకున్నారు. ప్రస్తుతం మూడోసారి స్వామివారిని దర్శించుకున్నారు. 20 ఏళ్ల వయస్సులో ఆమె తొలిసారి స్వామి దర్శనం చేసుకున్నారు. 1979లో రెండోసారి.. ఈ 2019లో మూడోసారి దర్శనం చేసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: