రోజూ వచ్చే సూర్యోదయమే అనుకొంటూ నిస్తేజపడితే ముందుకు కదల్లేం. పోయిన కాంతి కణాలు మళ్లీ రావు. వచ్చేవన్నీ ఎప్పటికప్పుడు కొత్త కాంతి కణాలే. అలాగే,  ఏటా వచ్చేదే అయినా ప్రతీ సంక్రాంతి తనదైన కొత్త కాంతిని తెస్తుంది. సరికొత్త స్ఫూర్తితో ముందడుగు వేద్దాం అనే భావ‌న‌ను మ‌న‌లో నింపుతుంది. సంక్రాంతి సంద‌ర్భంగా మ‌నం గ‌మ‌నించాల్సిన ముఖ్య‌మైన అంశాలు కొన్ని ఉన్నాయి. మనదైన స్థానికతలు, భారతీయతకు పెద్దపీట వేద్దాం. ప్రాచీన వేదసంస్కృతిలోని జీవన విలువలను గుర్తిద్దాం. వాటిలోని మానవీయ కోణాలను మనం ఆచరణలో పెడుతూ, రాబోయే తరాలకోసం అందిద్దాం. రంగురంగుల ముగ్గులు, ఆకాశంలో ఎగిరే గాలిపటాలు, పిండివంటల కమ్మదనం, మిఠాయిల మధురిమ, గంగిరెద్దుల గలగలలతో సహా పాడిపంటల పచ్చదనాన్ని తలకెత్తుకొందాం. ప్రకృతి, పర్యావరణ, జీవావరణాలతోసహా తోటి మానవాళిపట్ల మమతానురాగాల పూలు చల్లుదాం. అప్పుడే నిజమైన సంక్రాంతి సౌరభం కదా!

 


మ‌రో ముఖ్య విష‌యం. మ‌న మనసును మన నియంత్రణలో ఉంచుకోవడం. అలా ఉంచుకోవ‌డం ద్వారానే స్థితప్రజ్ఞులమవుతాం. అయితే, ఇది చెప్పినంత తేలిక కాదు. సవ్యంగా జరగాలంటే, నిరంతర సాధన కావాలి. ‘దు:ఖేష్వ నుద్విగ్నమనా: సుఖేషు విగతస్పృహ:/ పీతరాగ భయక్రోధ: స్థితదీర్ముని రుచ్చతే॥ (56-2), యస్సర్వత్రానభిస్నేహ: తత్తత్ప్రాప్య శుభాశుభమ్‌/ నాభినన్దతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా: ॥ (57-2)’ అన్నది భగవద్గీత. రాగద్వేషాలను సమానంగా చూసే దృష్టికి అలవాటు పడితేనే మనసు మన అధీనంలోకి వస్తుంది. అందుకు అనవసరమైన కోర్కెలు, మోహాలు, ఆశలు, ఆకాంక్షలు వంటి అన్నింటినీ వదిలేసుకోవాలి. ‘మరి, బతుకుమీద ఆశకూడా ఉండకూడదా? సంసారంలో బాధ్యతలు నెరవేర్చవద్దా?’ అని అడిగే వాళ్లుంటారు. 

 

నిజమే, మానవ జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించవలసిందే. ఎవరూ సంసార బాధ్యతల నుంచి పారిపోకూడదు. కాకపోతే, ఈ జన్మను ఒక వాహకంగా, శరీరాన్ని ఓ వేదికగా వాడుకోవాలి, అంతే. అందుకే, ‘ఈ బంధనాల్లో కొనసాగుతూనే ఆధ్యాత్మిక సాధనను అలవర్చుకోవాలని’ భారతీయ జ్ఞానులు చెప్తారు. సుఖదు:ఖాలను ఒకే రీతిలో చూడగల స్థితికి మనసును చేర్చగలిగితే ఒకింత విజయం సాధించినట్లే లెక్క. భయక్రోధాలు, రాగద్వేషాలను ఏ మాత్రం దగ్గరకు రానీయకూడదు. మంచి-చెడు రెండింటి ప్రభావాలూ మనపైన పడకూడదు. దేనినీ పొగడడం, ద్వేషించడం చేయరాదు. అప్పుడే స్థితప్రజ్ఞత సిద్ధిస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: