శ్రీరామనవమి.. హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామ నవమి రోజున సీతారామ కళ్యాణం జరపడం అనాదిగా ఆచారంగా వస్తున్నది. అలాగే శ్రీ రామ నవమి భద్రాచలం లో అత్యంత ప్రసిద్ధమైనది. శ్రీ రామ కళ్యాణమహోత్సవము కన్నులపండుగగా జరుపుకుంటారు. ఇక దశావతారాల్లో ఏడవ అవతారంగా, రావణ సంహరనార్ధమై, శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12గంటలకు జన్మించారు. ఆ రోజునే శ్రీ‌రామ‌న‌వ‌మిగా జ‌రుపుకుంటారు. 

 

అలాగే పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. మ‌రియు శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. అందుకే శ్రీరామ‌న‌విమిని ప్ర‌జ‌లంద‌రూ ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో క‌న్నుల పండ‌గ‌గా జ‌రుపుకుంటారు. ఇక రావణుడి మీద సాధించిన విజయం, సీతతో అతని వివాహం, పట్టాభిషేకం, ఈ మూడూ కలిపి వేడుకగా నిర్వహించే పండగే ఇది. 

 

మన దేశంలో చాలా ప్రాంతాల్లో శ్రీ‌రామ‌న‌వ‌మిని తొమ్మిది రోజుల పాటు ఎంతో ఘ‌నంగా జరుపుకుంటారు. ఈ తొమ్మిది రోజులు గ్రామాలలో హరికథలు చెప్తారు. ప్రతి వీధిలో నవమి పందిళ్లు వెలుస్తాయి. సీతారామ కల్యాణమే కాక సాయంత్రం అయితే ఎన్నో కార్యక్రమాలకు ఈ పందిళ్లు నెలవవుతాయి. హరికథా కాలక్షేపం ముఖ్య కార్యక్రమం. సంగీత కార్యక్రమాలు, నంప్రదాయ నృత్యాలు వంటి ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి. ఇలా శ్రీరామచంద్రుడిని తెలుగువారు ప్రతి ఇంటా ఇంటి ఇలవేలుపుగా కొలుస్తారు.


   

మరింత సమాచారం తెలుసుకోండి: