టెక్నాలజీ ఎంత పెరుగుతున్నా.. అదనంగా ఎన్ని వస్తువులు అందుబాటులోకి వస్తున్నా.. అధునాతన సౌకర్యాలు కాళ్ల ముందుకే వచ్చి పలకరిస్తున్నా.. మనల్ని సంతృప్తి పరచలేకపోతున్నాయి. మనల్ని ఆనందంగా ఉంచలేకపోతున్నాయి. కోరుకున్న ఉద్యోగం, చిన్న సుఖమయ సంసారం, ఆర్థికంగా లోటులేని జీవితం మన సొంతమైనా ఇంకా ఏదో  వెలితి వేధిస్తూనే ఉంటోంది. 

చాలామందికి ఇది జీవన అనుభవం. కానీ దీన్ని అధిగమించాలంటే ఏం చేయాలో తోచదు. ఎందుకు ఇలా మనసులో అసంతృప్తి రగులుతుందో తెలియదు. కొంతవరకూ సౌకర్యంవంతంగానే జీవిస్తున్నా పక్కవాళ్లకు ఉన్న అంతకుమించిన సౌకర్యాలు, వస్తువులు మనల్ని అసంతృప్తికి గురి చేస్తాయి. దీన్నిబట్టి మీరే ఆలోచించండి. మనిషికి ఆనందాన్నిచ్చే రెండక్షరాల పదం తృప్తి అన్న విషయం తెలియకనే ఇంత అసంతృప్తికి గురవుతాం. 

లభించినదానితో సంతృప్తిగా ఉండేవారికి ఎక్కడున్నా స్వర్గమే. దొరికిన దానితో తృప్తి పడనివారికి ఈ జీవితం నరకమే. చెప్పడానికి సులభంగానే ఉన్నా.. నమ్మడం మాత్రం కాస్త కష్టమే. అందుకే మన పురాణాలు ఈ విషయాన్ని ఎన్నో ఉదాహణల ద్వారా తెలిపాయి. 

మహాభారతం విషయానికి వస్తే.. పాండవులు తమకు అయిదు గ్రామాలిచ్చినా చాలని పలికారు. కానీ దుర్యోధనుడు అందుకు అంగీకరించలేదు. చివరకు అందుకు తగిన ఫలితం అనుభవించాడు. శ్రీకృష్ణుడు తన స్నేహితుడు తీసుకొచ్చిన అటుకులనే మహదానందంగా స్వీకరించాడు. స్నేహంలోని గొప్పదనాన్ని చాటాడు. అందుకు మూలం సంతృప్తే కదా. 

ఇక రామాయణం విషయానికి వస్తే... శబరి ఎంగిలి చేసిన ఫలాలు కూడా రాముడు అపురూపంగా భావించి ఆరగించాడు. తన భక్తురాలికి అమితానందం కలిగించాడు. ఇవన్నీ సంతృప్తికి ఉదాహణలు. ఇప్పుడు అసంతృప్తికి ఉదాహరణగా రావణుడిని చెప్పుకోవచ్చు. అతిలోక సౌందర్యవతి అయిన భార్య మండోదరి ఉన్నా.. తృప్తి చెందక సీతాదేవిని కోరి.. కష్టాలు తెచ్చుకున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: