మరణం.. దీని గురించి భయపడన వ్యక్తులు చాలా అరుదు. జీవితాన్ని చాలా ధైర్యంగా ఎదుర్కొన్నవారు కూడా మరణం విషయానికి వచ్చేసరికి పిరికివాళ్లైపోవడం చూస్తుంటాం. కానీ మనసు పెట్టి ఆలోచిస్తే అసలు మరణం గురించి ఎందుకు భయపడకూడదో ఇట్టే అర్థమైపోతుంది. దీనికి ఎవరూ ప్రత్యేకంగా బోధ చేయనక్కర్లేదు..

చుట్టూ ఉన్న ప్రపంచమే ఈ మరణ రహస్యాన్ని మనకు బోధిస్తుంది. మనలో ప్రతి ఒక్కరం చరిత్ర చదివే ఉంటాం. వందా, నూట ఇరవై ఏళ్లకు మించి ఈ భూమి మీద నివసించిన వాళ్లు మనకు కనిపించరు. అంటే మరణం జననం అంత సాధారణం. ప్రతి మనిషికీ ఓ పుట్టిన రోజు ఎలా ఉంటుందో.. మరణించే రోజు కూడా ఉంటుంది. 

కాకపోతే.. ఈ రెండు రోజుల మధ్య మన గురించి సమాజం ఏమనుకుంటుంది.. చరిత్ర మనల్ని ఎలా గుర్తుంచుకుంటుంది అన్న విషయమే ప్రధానం. మరణించి కూడా చిరకాలం గుర్తుండిపోయేలా జీవించాలి. అలా చేయాలంటే మన గురించి కాకుండా ఇతరుల కోసం బతకడం అలవాటు చేసుకోవాలి. శ్రధ్దగా గమనిస్తే చరిత్రలో మంచి స్థానం సంపాదించినవాళ్లంతా చేసింది అదే. 

భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు.. కదన భీతున్ని చూసి కాలుండు నవ్వురా అంటాడు శతక కారుడు. అంటే ఈ భూమి ఎవరికీ ఎలా శాశ్వత ఆస్తి కాదో.. మరణం కూడా అంతే. యుద్ధానికి వెళ్లేందుకు భయపడే వాడిని చూసి యముడు నవ్వుతాడట. ఎందుకంటే.. యుద్ధానికి వెళ్లకపోతే మాత్రం నువ్వు ఎంతకాలం బతుకుతావు.. ఎప్పటికైనా నా దగ్గరకు రాకుండా తప్పించుకుంటావా అని. 

అందుకే మన భయం మరణం గురించి కాకూడదు. మరణం మనల్ని పలకరించే సమయానికి మనల్ని గుర్తుంచుకునేంత మంచిపేరు సంపాదించడం కావాలి. అదే మరణ రహస్యం. 



మరింత సమాచారం తెలుసుకోండి: