ఈరోజుల్లో జీవితం ఉరుకుల పరుగుల మయం. ఉదయం లేచిన దగ్గర నుంచి ఒక్కొక్కరికీ ఒక్కో టార్గెట్. ఎల్కేజీ విద్యార్థికి కూడా మంచి ర్యాంకే రావాలి. అన్ని విషయాల్లో పోటీ పడాలి. అన్నింటిలోనూ ముందే ఉండాలి. చదువుల్లో ఎప్పుడూ టాప్ లో ఉండాలి. ఆ తర్వాత మంచి జాబ్ రావాలి. జాబ్ వచ్చినా అందరికంటే మంచి పొజిషన్ రావాలి. 

ఉద్యోగంలో బాసును మెప్పించాలి. పోనీ సొంతంగా బిజినెస్ పెడితే పోటీ తట్టుకుని నిలబడాలి. ఇన్ని ఒత్తిళ్ల మధ్య ఫ్యామిలీకి టైమ్ కేటాయించాలి. ఇలా ఎన్నో టార్గెట్లు.. మరి ఇన్ని సవాళ్ల మధ్య మీ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా.. ఒక్కసారి అద్దం ముందు నిల్చుని మీలోకి మిమ్మల్ని చూస్తూ.. మీ కళ్లలోకి మీరే చూస్తూ ఎప్పుడైనా నేనేంటి అని ఆలోచించారా..?

నాకేం కావాలి.. నేనేం కాదలచుకున్నాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా.. ఇలా చేయాలి.. అలా చేయాలి అంటూ మీలోపల నుంచి మిమ్మల్ని నిత్యం కన్విన్స్ చేయాలని ప్రయత్నించే అంతరాత్మ గొంతుకు ఎప్పుడైనా విన్నారా.. వినకపోతే ఒక్కసారి విని చూడండి. మీ అంతరాత్మ మీకేదో చెప్పాలనుకుంటుంది. అదేంటో కనిపెట్టండి.

ఒత్తిళ్లు, పోటీ, పోలికలు పక్కకు పెట్టి అసలు మీరేంటో.. కేవలం మీరే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి. అలా ప్రయత్నం చేస్తే.. మీకు ఒక అఖండ చైతన్య భావన స్ఫురిస్తుంది. ఆ చైతన్యమే అన్నింటా నిండి నిబిడీకృతమై ఉండాలన్న అభిప్రాయం కలుగుతుంది.

నేను ఏమిటి అన్న ప్రశ్నకు సంతృప్తికరమైన జవాబు రాబట్టుకోవటం అంత సులభమేమీ కాదు. కానీ అలా తెలుసుకోవడం మాత్రం వాయిదా వేయకూడని ఓ అత్యవసరం. దానికి సరైన సమాధానం లభిస్తే మీ జీవితం ఆనందమయమే. 


మరింత సమాచారం తెలుసుకోండి: