దేవునికి సంబంధించిన మనుషుల ఆలోచనల్లో ఎంతో వైవిధ్యం ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో దైవాన్ని ఆరాధించినా.. అసలు దేవున్నే నమ్మని వారు చాలా తక్కువ. అయితే దేవున్ని నమ్మేవారు కూడా అంతా ఒకలా ఉండరు. నిత్యం దైవ పూజ చేస్తేనే దైవంపై భక్తి ఉన్నట్టు అని వాదించేవారు కొందరైతే.. అసలు దేవునికి పూజలతో పనేంటి.. మనస్సులో భక్తి ఉండాలి కానీ.. అనేవారు మరికొందరు. 

ఈ వాదనల్లో ఏది నిజం.. ఏది అబద్దం.. రెండూ నిజమేనా.. రెండూ అబద్దమేనా.. ఈ విషయాలను లోతుగా పరిశీలిస్తే.. వాస్తవానికి దేవునికి భగవంతునికి రూపం, రంగు, పేరు వంటివి ఆపాదించకూడదు. అవేవీ లేని నిర్గుణాకారుడినే దైవంగా భావించాలి. ఆయన్నే మదిలో ఆరాధించాలి. దీని కోసం విగ్రహారాధన, పూజామార్గం అంత అవసరమేమీ కాదు.

మరి అదే నిజమైతే ఇన్నిపూజలు, విగ్రహాలు, ఆరాధనలు ఎందుకు జరుగుతున్నాయని అన్న ఆలోచన సహజంగానే వస్తుంది. అయితే నిర్గుణాకారుడైన దైవాన్ని మనస్సులో ఆరాధించడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అందుకు ఎంతో ఏకాగ్రత, జ్ఞానం అవసరం. ఆ పని కొందరు యోగులు, తపోసాధకులకే అది సాధ్యమవుతుంది. సామాన్య మానవులకు ఆ ఏకాగ్రత దుర్లభం. 

అందుకే సామాన్యుల మనస్సు ఒక చోట నిలిపేందుకే దేవునికి రూపాన్ని ఆపాదించుకుంటాం.. దైవ ప్రార్థన కోసం గీతాలు రాసుకుంటాం.. వాటి ద్వారా నిర్గుణాకారుడైన దైవాన్ని పూజిస్తాం. అయితే సామాన్యుడైనా, రుషి పుంగవుడైనా అందరి లక్ష్యం ఒక్కటేనన్న విషయం అందరూ తెలుసుకోవాలి. అంతా ఆ పరమాత్ముని కృప కోసమే ఆరాటపడుతున్నామన్న స్పృహ ఉండాలి. అప్పుడు ఏ దైవాన్ని పూజించినా, ఏ ప్రార్థన చేసినా అది నేరుగా ఆ దేవునికే చేరుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: