ఏటి ఒడ్డున కూర్చుని మెత్తటి ఇసుకను చేతిలోకి తీసుకోండి.. అది మీకు తెలియకుండానే మీ అనుమతి లేకుండానే మీ చేతివేళ్ల సందుల్లోంచి ఆ ఇసుక క్రమంగా జారిపోతుంది. కొద్దిసేపటికే మీ చేతిలో ఏమీ మిగలదు, శూన్య హస్తం తప్ప. ఈ ఉదాహరణ కాలానికి బాగా వర్తిస్తుంది. మనకు తెలియకుండానే దశాబ్దాలకు దశాబ్దాలు గడిచిపోతాయి. 

చూస్తుండగానే కాలం పరుగులు తీస్తుంది. ఈ పరుగును ఒక్క నిమిషం ఆపి మీరు ఆలోచించాల్సిన సమయం వచ్చింది. నేను ఎలా బతుకుతున్నాను.. ఎవరి కోసం బతుకుతున్నాను.. నేను అనుకున్నట్టుగానే నేను బతుకుతున్నానా.. అంటే చాలా మంది వద్ద సంతృప్తి కరమైన సమాధానం లభించదు. అందుకే నీ కోసం నువ్వు బతుకు..

నీలా బతుకు.. నీకు ఇష్టంవచ్చినట్టు బతుకు.. నిజమే చెప్పు.. నీకు తోచిందే మాట్లాడు.. ఇష్టం ఉంటే అవును అని చెప్పు.. కాదంటే కాదు అని చెప్పు.. నీకేమి చేయాలనిపిస్తే అదే చేయి.. నీ జీవితం నీ ఇష్టం.. నీ లక్ష్యం.. నీ జీవితం.. నీ ఇష్టం అంతే.. ఒకరిని చూసి అలాగే ఫాలో అయిపోకు.. జీవితం కార్బన్ కాపీ కాదు. పక్కవాడికి వచ్చిన ఫలితం నీకు రావాలని లేదు. 

అంతే కాదు.. ఈ జీవితం ఏ మలుపులోనైనా ఆగిపోవచ్చు. ఒక్కసారి నీ ఊపిరి ఆగాక నిన్ను నీ పేరు పెట్టి పిలవరు. అప్పుడు నీకు పెట్టే పేరు శవం. ఆ శవాన్ని ఇటు తీసుకురండి.. ఇక్కడ దింపడి.. అక్కడ పెట్టండి అంటారు గానీ.. ఫలానా వెంకట్రావును తీసుకురమ్మని చెప్పరు. నువ్వు ఎవరికోసం తపిస్తున్నాననుకుంటావో..అదే జనం.. నీ ఊపిరిఆగాక ఒక్క నిమిషం కూడా నిన్ను పేరు పెట్టి పిలవరు. 



మరింత సమాచారం తెలుసుకోండి: