ఒక రాయిని దేవతా విగ్రహంగా తయారు చేయటానికి శిల్పులు, ఆగమ శాస్త్రవిదులు దానికి ఎన్ని సంస్కారాలు చేస్తేనో అది అంత అందంగా, అంత పవిత్రంగా దైవీశక్తి మంతంగా రూపొందుతున్న విషయం మనకు తెలియంది కాదు. పాదరసాన్ని అనేక సంస్కారాలు చేస్తే అది బంగారంగా తయారవుతుంది. ప్రాణం తీసే విషం కూడా తగిన సంస్కారాలు చేస్తే ప్రాణాన్ని కాపాడుతుంది కదా! ఇన్నింటిని సంస్కరించి ప్రయోజనం పొందగలుగుతున్నప్పుడు ఒక బాలుని సంస్కరించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయలేమా? సంస్కార శబ్దానికి వ్యుత్పత్తిని ఒకసారి పరిశీలించండి?

          "సంస్క్రియతే - జ్ఞాన యోగ్యతామాపాద్యతే పురుషస్య తిత్తమనేనేతి సంస్కారః" దేనిని అనుష్ఠించటం వలన పురుషుని చిత్తము ఆత్మతత్వ జ్ఞానాధిగమానికి అర్హంగా (యోగ్యమైనదిగా) చేయబడుతుందో అట్టి క్రియా విశేషము సంస్కారమని అనబడుతుంది. శాస్త్ర విహితమైన కర్మానుష్ఠానం వలన శరీరంలో, అంతఃకరణలో గాని ఉత్పన్నమయ్యే అతిశయ విశేషమే సంస్కారము. ఈ అతిశయము కొన్ని సంస్కారాల్లో దోషాలను తొలగించే రూపంలోను, కొన్నింటిలో గుణాలను పెంపొందించే రూపంలో, మరికొన్నింటిలో రెండు రకాలుగాను ఉంటుందని సంస్కార దీపికా నిర్వచనము.

          జీవులందరికి అతీతమైన అనేక జన్మలలో చేసిన పాప కర్మల వాసనలన్నీ అంతఃకరణాన్ని ఆక్రమించి, దాన్ని మలినం చేస్తాయి. ఆ ప్రతిబందకాలను తొలగించి మందుగా దాన్ని సంస్కరించి పరిశుద్ధం చేయాలి.

          విద్యాభ్యాసం ప్రారంభించే ముందు బాలుడికి తగిన సంస్కారం లభిస్తే, ఆ సంస్కారంతో చదివిన చదువును ఇహ పర సాదకంగా వినియోగిస్తాడు. సంస్కార రహితుడు దాన్ని దుర్వినియోగ పరచగలడు. ఈ సంస్కారం వేద విద్యలకే కాక లౌకిక విద్యలకు కూడా తప్పక అవసరమే. ఒక సంస్కారి అణు విజ్ఞానాన్ని లోక కళ్యాణానికి వినియోగించాలని కృషి చేస్తాడు. అదే ఒక సంస్కార రహితుడైన అణు శాస్త్రజ్ఞుడు దాన్ని స్వార్ధంతో లోక వినాశనానికి వినియోగించే ప్రమాదం ఉన్నది. జన్మతః బ్రాహ్మణ దంపతులకు పుట్టినా వర్ణాశ్రమాలకు ఉచితమైన ఉపనయనాది సంస్కారములు పొందని వాడు పరిపూర్ణ బ్రాహ్మణుడు కాలేడు. అట్టి వానిని శాస్త్రము 'వ్రాత్యుడు' అంటుంది. వాని జ్మ నిరర్థకము. "వ్రాత్యః సంస్కార హీనస్యాత్", " అత ఊర్ధ్యం త్రయోప్యేతే యధాకాల మసంస్కృతాః!" సావిత్రీ పతితా వ్రాత్యా భవన్త్యార్య విగర్హితాః" - అని మనుస్మృతి : 2-39.

           ఉపవీతుడై ద్విజుడైన వానికే సర్వవైదిక కర్మానుష్ఠాన అర్హత సిద్ధిస్తుంది. అట్లా కాకుండా సంధ్యావందనాది నిత్య విధులను నిర్వర్తించకుండా తమకు తోచిన దైవస్తోత్రాలు చదవటం, దానధర్మాలు, వత్రాలు, పూజలు, తీర్ధయాత్రలు వగైరా ఎన్ని చేసినా ప్రయోజనం మృగ్యం. ఇవన్నీ శుద్రాదులకు తగిన మంచి ఫలితాలను ఇస్తాయి కాని, ఉపవీతుడు కాని ద్విజునకు కాని, ఉపవీతుడై కూడా సంధ్యా వందనాది విధులు ఆచరించని ద్విజునకు ఆశించిన సత్ఫలితాలను ఇవ్వజాలవు. కారణం అర్హత లేక పోవటం వల్ల కావచ్చు, అర్హత ఉన్నా దాన్ని నిలబెట్టుకోకపోవటం వల్ల కావచ్చు. ఒక ఆయోగ్యుడైన వాడు కాని, డిగ్రీ ఉన్నా అనుభవం లేని వైద్యుడు కాని శస్త్ర చికిత్స చేస్తే? అనర్హుడైన ఇంజనీరు బహుళ అంతస్తుల భవన నిర్మాణం కాని, ఆనకట్టలు (ప్రాజెక్టులు) కాని నిర్మిస్తే? రాజనీతిజ్ఞులు కాని నేతలు పరిపాలిస్తే ? ఫలితాలు ఎలా ఉంటాయో చూస్తూనే ఉన్నాం కదా! మరి యోగ్యత లేని, సంస్కార రహితుడైన ద్విజుని కర్మల పుణ్య ఫలం ఎంత ఉంటుందో గ్రహించలేమా???.

          ఉపనయన సంస్కారం పొందని బ్రాహ్మణునికి అకాలమరణం సంభవిస్తే అతడు దహన సంస్కారాదులు పొందే యోగ్యతలేక అధోగతుల పాలవుతాడు. ఇలాంటి వారికి శ్రాద్ధాదులు (తద్దినాలు) కూడా ఉండవు కదా! దీనికి బాధ్యులెవరు? సకాలంలో ఉపనయన సంస్కారం జరిపించని తల్లిదండ్రులే!

          తనయులకు ఉపనయన సంస్కారం చేయకుండా తల్లితండ్రులలో ఎవరైనా మరణిస్తే, అట్టి వారు కన్న కొడుకుల చేత ఉత్తర క్రియలు జరిపించుకోలేరు. ఏ పుత్రులైతే పున్నామనకరం నుండి తమను ఉద్ధరిస్తారని తాపత్రయపడి వారిని కనిపెంచుతున్నారో, వారిని అందుకు తగిన సంస్కారవంతులనుగా చేయకుండా పోతే - ఇంక ఆ పుత్రులను కన్నందుకు సార్ధకత ఎట్లా సిద్ధిస్తుంది? మరి ఆపుత్రులు పితృణము నుండి ఎప్పటికి విముక్తి ని పొందాలి? ఆలోచంచండి..

          "        దైవాదీనం జగత్సర్వం మంత్రాధీనంతు దైవతమ్

          తన్మంత్రం బ్రహ్మణాధీనం బ్రహ్మణోమమ దేవతా" - భారతం

          అని పరమాత్ముడైన శ్రీకృష్ణుడే బ్రహ్మణుని దైవ సమానుడిగా ప్రస్తుతిస్తే అంతకంటే మించిన ఉన్నతస్థితి మరెక్కడైనా ఉంటుందా? ఈ సమస్త జగత్తుదైవా ధీనమైనదైతే, ఆ దేవం మంత్రానికి ఆధీనుడట, అంతటి శక్తి వంతమైన మంత్రం బ్రాహ్మణునికి ఆధీనమై ఉంటుంది. కాబట్టి 'బ్రాహ్మణుడే నా పాటి దైవ'మని శ్రీకృష్ణ పరమాత్మ భావించాడు. అంతటి భూసుర స్థితిని పొందటానికి బ్రాహ్మణుడు మంత్రాన్ని స్వాధీనం చేసుకోవాలంటే వేదోపదిష్టమైన మంత్రాలను అధ్యనం చేయాలి. ఉపాసించాలి, అనుష్ఠించాలి. వేదాధ్యయనానికి ఉపాసనకు, అనుష్ఠానానికి అర్హత ఉపనయన సంస్కారం లేనిదే రాదు కదా!.

          వైదిక కుటుంబీకులే 'వేద శాస్త్రాలను నమ్ముకుంటే పూట గడవదని' తమ పిల్లల్ని ఎలాగోలా అప్పోసొప్పో చేసి లౌకిక (కాన్వెంట్) చదువుల్లో మూడోఏట నుండే ప్రవేశ పెడుతుంటే, ఇంకా ఈ రోజుల్లో ఉపనయనాలేంటి? చాదస్తం కాకపోతే!' అనే ఈసడింపులూ, ప్రశ్నలూ మీదాకా రాలేదా? అనవచ్చు. అలాంటి వారికి చెప్పేదేమిటంటే - లౌకిక చదువులకు ఈ ఉపనయన సంస్కారం ఏ విధంగానూ అడ్డంకి కాదు కదా! రోజు సుమారు 15ని.లు చేసుకునే సంధ్యావందనం వలన ఏమైనా నష్టముంటుందా? దీని వల్ల ఆయుస్సు, వర్చస్సు, ధీశక్తి పెరుగుతాయే కాని చదువులకు ఆటంకం ఏర్పదు కదా! పోని చాదస్తమని దీన్ని మానేసినా, మిషనరీ పాఠశాలల్లో చేయించే ప్రార్థనలను కిక్కురు మనకుండా చేస్తున్న దాన్ని గూర్చి ఏమనుకుందాం? పాఠశాల స్థాయిలోనే ఐ.ఐ.టి. వగైరా ఫౌండేషన్ కోర్సుల పేరుతో అవసరమున్నా లేకున్నా పిల్లలకు వేలకు వేలు కుమ్మరించి ఊపిరాడకుండా కోచింగ్ లు ఇప్పిస్తున్నాం. కాని, ఇదే పిల్లల ఆధ్యాత్మిక పురోగతికి ఉపకరించే, పెద్దగా ఖర్చులేని పారలౌకిక సుఖాన్నిచ్చే విద్యాభ్యాసానికి కాని, ఉపనయన సంస్కారాన్ని జరుపటానికి కాని చొరవ తీసికోలేక పోతున్నాం. భవిష్యత్తులో మన పిల్లలు లక్షలు కోట్లు సంపాదించాలని, వారిని విదేశాలకు పంపాలని కలలు కంటూ వేలూ లక్షలు ఖర్చు పెట్టటంలో ఉన్న శ్రద్ధ, చివరికి మనకు పిడికెడు పిండం పెట్టటానికి ఉపకరించే ఉపనయన సంస్కారం జరుపటానికి మాత్రం లేకపోతే ఎలా??? అవేశపడకుండా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి.

                             సంధ్యావందన విధి:

                   "విప్రో వృక్షో మూలకాన్యత్ర సంధ్యా

                   వేద శ్శాఖాః ధర్మ కర్మాణి పత్రమ్

                   తస్మాన్మూలం యత్నతో రక్షణీయమ్

                   ఛిన్నే మూలే నైవవృక్షో నశాఖాః"

                   విప్రుడనే వృక్షానికి సంధ్యావందన మనే కర్మ మూలము వంటిది. విప్రుడు అధ్యయనం చేయాల్సిన నాలుగు వేదాలు ఆ వృక్షానికి శాఖలు. అతడు ఆచరించవలసిన వేదోక్తకర్మలు ఆశాఖలందలి ఆకులు. కనుక ఈ విప్ర వృక్షము యొక్క మూలాన్ని (సంధ్యా వందనాచరణను) ప్రయత్నపూర్వకంగా కాపాడాలి. మూలాన్ని భేదిస్తే అంటే సంధ్యా వందనం చేయకుంటే ఇక వృక్షం ఎలా ఉంటుంది. దాని శాఖలు, పత్రాలు దానితో పాటుగా నశిస్తాయి కదా! ఇక వృక్ష ఫలాలను ఎట్లా ఆశిస్తాం? సంధ్యావందనాన్ని మానటం వైదిక ధర్మానికి గొడ్డలి పెట్టు లాంటింది.

                   "సంధ్యాముపాసతే యేతు సంతతం సంచిత వ్రతాః

                   విధూత పాపాస్తే యాంతి బ్రహ్మలోకం సనాతనమ్|| "

          నిత్యం క్రమం తప్పక సంధ్యావందమును ఆచరించేవాడు సమస్త పాపాలనుండి విముక్తుడై పురావృతి రహిత శాశ్వత బ్రహ్మలోకాన్ని పొందుతాడనటంలో సందేహం లేదు. ఉపనయనం వలన ద్విజత్వం, ద్విజత్వం వలన వేదమంత్ర అధ్యయనార్హత, నిరంతర మంత్ర పఠనం ద్వారా దైవానుగ్రహం సిద్ధిస్తుంది. ఇంతకంటే జీవితానికి కావలసినది ఏముంటుంది? వేద విహిత కర్మలలో ఉత్కృష్టమైనది సంధ్యావందన కర్మ. అతి ముఖ్యమైన ఇట్టి పవిత్ర కర్మను ఆచరించకుండా ఇతర దైవిక కర్మలను ఎన్ని చేసినా ఫలితం సుననా, సంధ్యావదనం చేయాల్సిన సమయంలో ఇతర వ్యాసంగాలు పనికిరావు. కొందరు ఈ సమసయంలో భజన చేసినా, గుడికి వెళ్లినా ఇది కూడా దైవ సంబంధకర్మే కనుక సంధ్యావందనం చేయకున్నా ఫరవాలేదను కుంటారు. ఇది అశాస్త్రీయము. దోష భూయిష్టము. అంత శ్రద్ధ ఆసక్తి ఉన్నవారు సంధ్యా వందనం చేసికొని తర్వాత మిలిగినవి ఆచరించవచ్చు కదా!

                   "సంధ్యా హీనో శుచిర్నిత్యం అనర్హస్సర్వ కర్మసు

                   యదన్యః కురుతే కర్మ నతస్య ఫల భాగ్భవేత్

                   యోన్యత్ర కురుతే యత్నం ధర్మ కార్యే ద్విజోత్తమః

                   వివాహ సంధ్యా ప్రణతిం సయాతి నరకాయుతమ్" - కూర్మ పురాణం

                   " సంధ్యా యేన నవిజ్ఞాతా సంధ్యాయేనానుపాసితా

                   జీవమానో భవేచ్ఛూద్రో మృత శ్వానో భిజాయతే ||"

          సంధ్యావందనం తెలియని వాడు, సంధ్యావందనమును ఆచరించని వాడు బ్రతికి ఉండగా శూద్రతుల్యుడట. ఇట్టి వాడు మరణానంతరం మరుసటి జన్మలో కుక్కగా పుడతాడని గోభిల మహర్షి హెచ్చరించారు.

                   "ఋషయో దీర్ఘ సంధ్యత్వా ద్దీర్ఘ మాయు రవాప్నుయుః

                   ప్రజ్ఞాం యశశ్చ కీర్తించ బ్రహ్మవర్చసమేవచ||"

          అను వచనాను సారం ఋషులు దీర్ఘకాలం సంధ్యానుష్ఠానంతో దీర్ఘాయుస్సును పొందినట్లు, జీవించింత కాలం బుద్ధిని, యశస్సును, కీర్తిని, బ్రహ్మవచ్చస్సును పొందినట్లు తెలుస్తున్నది.

          "నగాయత్ర్యాః పరం మంత్రం నమాతుః పరదైవతమ్" అనే ఆర్షవాక్యం కూడా గాయత్రిని మించిన మంత్రం లేదని, తల్లిని మించిన దైవం లేదని స్పష్టం చేస్తున్నది. కనుక గాయత్రిని ఎంత అధికంగా ఉపాసిస్తే అంత ఆయుస్సు, వర్చస్సు, సకల శ్రేయస్సులు పొందగలుగుతాం.

                   "కామాన్మోహాద్భయాల్లోభా త్సంధ్యాం నాత్రికమే ద్విజః

                   సంధ్యాతిక్రమణాద్విప్రో బ్రాహ్మణ్యాత్పతితో భవేత్ |

                   ఉపతిష్ఠతి యే సంధ్యాం యే న పూర్వాం న పశ్చిమాం

                   వ్రజంతి తే దురాత్మాన స్తామిస్రం నరకం నృప||"

          సంధ్యాతిక్రమణం చేసిన విప్రుడు బ్రాహ్మణ్యం నుండి పతితుడౌటయే కాక 'తామిస్రమనే' నరకం చేరుతాడని విష్ణుపురాణం నొక్కి చెపుతున్నది. కనుకనే "అహరహ స్సంధ్యా ముపాసీత" అని శ్రుతి విధి వాక్యము.


మరింత సమాచారం తెలుసుకోండి: