మానవులకు ఉండవలసిన మంచి లక్షణాలలో దానగుణం ఒకటి. ప్రతి ఫలాపేక్ష లేకుండా, తన వద్ద ఉన్న ధనాన్నో , వస్తువునో ఇతరులకు ఇవ్వటమే దానం. 
"తపః పరం కృతయుగే , త్రేతాయాం జ్ఞానముచ్యతే ద్వాపరే యజ్ఞమేవాహుః , దానమేకం కలౌ యుగే " అన్నారు పెద్దలు. పూర్వయుగాలలో క్రమంగా తపస్సు, జ్ఞానం, యజ్ఞాచరణం ఉత్తమ ధర్మాలుగా పరిగణింపబడితే -కలియుగంలో దానగుణం వాటితో సమానమైనదిగా చెప్పబడింది. 
  Image result for Bagvadh geetha  dhanaluu
"శతేషు జాయతే శూరః, సహస్రేషు చ పండితః    వక్తా శతసహస్రేషు, దాతా భవతి వా న వా" అంటుంది ఒకసూక్తి. వందలమందిలో ఒక శూరుడు, వేలమందిలో ఒక పండితుడు , లక్షలమందిలో ఒక గొప్ప వక్త ఉండవచ్చుగానీ ఇందరిలో నిజమైన దాత ఉంటాడా ? ఉండడా ? అనేది సందేహమే ! "అదాన దోషేణ భవేద్దరిద్రః" అనేది మన విశ్వాసం. దానం చేయకపోవటం అనే దోషం వల్ల వచ్చే జన్మలో కావచ్చు , ఈజన్మలోనే కావచ్చు దరిద్రుడౌతాడని దీని భావం. మన ఇంటిముందు యాచకులు నిలబడి "ధర్మం చేయండి బాబూ!" అని అరుస్తున్నారంటే వాళ్ళు అడుక్కుంటున్నారనీ అర్థంకాదు. వాళ్ళు బిచ్చగాళ్ళనీ అనుకోకూడదు. "బాబూ! మీరు ధర్మదూరులై ఉన్నారు, ఇప్పటికైనా ఒక ధర్మకార్యం చెయ్యండి" అని మనను హెచ్చరించటానికి దరిద్రరూపంలో వచ్చిన నారాయణస్వరూపులుగా వారిని గుర్తించాలని విజ్ఞులు విశ్లేషిస్తారు. ఎవరైనా తమకు దానం చేస్తే , ప్రతిగ్రహీతలు కృతజ్ఞతలు చెప్పటం సర్వసాధారణం. కానీ తాను చేసిన దానాన్ని స్వీకరించి, తనను ధన్యుణ్ణి చేసిన ఆ ప్రతిగ్రహీతలకే దాత కృతజ్ఞుడై ఉండాలంటారు  వివేకానందస్వామి.

Image result for Bhagavath geetha

భగవద్గీత దానాలను మూడు విధాలుగా విభజించింది.  1. సాత్త్విక దానం :  అది ఒక కర్తవ్యంగా భావించి, ప్రత్యుపకారం చేయలేనివారికి దేశ, కాల, పాత్రతలను గమనించి యథార్హంగా చేసేది.  2. రాజసదానం : ప్రత్యుపకారం పొందటానికో, ఒక ఫలాన్ని ఆశించో, బలవంతంగా చేసేది. 3. తామసదానం : తగని చోట, అపాత్రులకు చేసేది, ప్రతిగ్రహీతలను అగౌరవపరచి, అవమానిస్తూ చేసేది.  ఈ దేశ, కాల, పాత్రతలను నిర్ణయించటంలో మెలకువ అవసరం.   
“అన్నాచ్ఛాదన దానేషు పాత్రం నైవ విచారయేత్ అన్నస్య క్షుధితః పాత్రం వివస్త్రో వసనస్య చ" అన్న, వస్త్ర దానాల విషయంలో పాత్రతనుగూర్చి ఆలోచించకూడదు.  ఆకలి చెంది ఉండటం, వివస్త్రుడై ఉండటమే ఆయావ్యక్తులకు పాత్రతను చేకూరుస్తాయి. అందువల్ల వెంటనే ఆ  దానాలు చేయాలి. 

Image result for Dhana dharmalu

“ఇచ్చేవాడుంటే చచ్చేవాడుకూడా లేచి కూర్చుంటా" డని సామెత.లోకంలో కొందరు సోమరితనానికి అలవాటుపడి యాచకులౌతారు. అంగవైకల్యాది కారణాలతో యాచకులైనవారిపట్ల సమాజానికి సానుభూతి ఉంటుంది. ఆరోగ్యంగా, దృఢంగా ఉన్న యాచకుల పట్ల  సదభిప్రాయం ఉండదు. అలాంటి పేదవారికి స్వయం ఉపాధి కల్పించి వాళ్ళ కాళ్ళమీద వారు జీవించేందుకు సహకరించటం మంచిది. 
ఒకప్పుడు ధర్మరాజు వేదవ్యాసుణ్ణి “దానం గొప్పదా? తపస్సు గొప్పదా?" అని అడిగాడు. అపుడు వ్యాసుడు ధర్మరాజుతో “నాయనా! మానవులు ధనంకోసం ఎన్ని సాహసాలైనా చేస్తారు. వారికి ప్రాణం మీద కంటె ధనం మీద ప్రీతి!  అందుకే ధనంకోసం ప్రమాదమని తెలిసినా ,పదునైన ఆయుధాల అంచులమీదికి దూకుతారు! సముద్రాలు దాటి విదేశాలకు వెళ్ళిపోతారు! వ్యవసాయం, పశుపాలనం మొదలైన క్లిష్ట కార్యాలు చేస్తూ అలసి సొలసిపోతూ ఉంటారు! పరదాస్యానికి సైతం వెనుకాడరు!ఇంత కష్టపడి సంపాదించిన ధనాన్ని ఎవరైనా దానం చేస్తున్నారంటే అది గొప్ప విషయమే కదా!" అన్నాడు. 
"మూర్ఖో నహి దదాత్యర్థం నరో దారిద్ర్య శంకయా ప్రాజ్ఞస్తు వితరత్యర్థం నరో దారిద్ర్య శంకయా"
 
“దానం చేస్తే నేను దరిద్రుడినైపోతానేమో!" అనే సంశయంతో మూర్ఖుడు అసలు దానమే చేయడు. “ఇపుడు దానం చేయకపోతే రాబోయే జన్మలో దారిద్ర్యం సంక్రమిస్తుందేమో!" అనే శంకతో ప్రాజ్ఞుడు దానం చేస్తాడు. అని ఈశ్లోకభావం. మన సంపాదనను మూడుభాగాలుగా విభజించి, అందులో రెండు భాగాలను దాన ధర్మాలకు కేటాయించాలని  పెద్దల హితవాక్యం.  ఆర్భాట ప్రచారాలు, అహంకార ప్రదర్శనలు లేకుండా చేసే దానం ప్రశస్తమైనది.  తాను దానం చేయటం, తాను దానం చేయలేకపోతే  చేసేవారిని చూపించటం దాన ద్వయం. కొందరు తాము దానం చేయరుసరికదా చేసేవారినికూడా చేయనివ్వరు. ఇలాంటి వారిని గూర్చే వేమన - “ఇచ్చువాని చెంతనీనివాడుండిన  చచ్చుగాని యీవి సాగనీడు కల్పతరువు క్రింద కంటకంబున్నట్లు  విశ్వదాభిరామ వినుర వేమ !" అన్నాడు.ఏదియేమైనా దానగుణం ఎంతో ఉత్తమమైనది. "శతహస్త సమాహర, సహస్రహస్త సంకిర" అంటుంది ఆర్షవాణి. “వంద చేతులతో సంపాదించు. వేయి చేతులతో వితరణ చెయ్యి" అని దీని భావం. పెద్దలు తాము దానాలు చేయటమే కాక, పిల్లలకూ దీనిని నేర్పాలి. ఎవరి స్థాయిలో వారు త్యాగబుద్ధిని అలవరచుకోవటం సమాజానికి ఎంతో అవసరం...కెఆర్కె


మరింత సమాచారం తెలుసుకోండి: