టిటిడికి అనుబంధంగా ఉన్న ఆలయాల్లో జనవరి 24వ తేదీ బుధవారం రథసప్తమి పర్వదినాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం,  శ్రీకోదండరామాలయం, తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, చంద్రగిరిలోని శ్రీకోదండరామస్వామివారి అలయం, అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయం, కార్వేటినగరంలోని శ్రీవేణుగోపాలస్వామివారి ఆలయం, నాగలాపురంలోని శ్రీవేదనారాయణస్వామివారి ఆలయాల్లో రథసప్తమి పర్వదినం కోసం ఏర్పాట్లు పూర్తిచేశారు.
Image result for ttd ratha saptami 2018
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి, అమ్మవార్లు సప్తవాహనాలపై ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు. జనవరి 24వ తేదీ బుధవారం తెల్లవారుజామున 3.00 గంటలకు శ్రీచక్రత్తాళ్వార్‌ను ఊరేగింపుగా శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలోని ఆళ్వారు తీర్థానికి వేంచేపు చేసి చక్రస్నానం నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో శ్రీ గోవిందరాజ స్వామివారి వాహన సేవలు ప్రారంభమవుతాయి. రాత్రి 8.00 గంటల వరకు హంస, హనుమంత, పెద్దశేష, ముత్యపుపందిరి, సర్వభూపాల, గరుడవాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఉదయం 8.00 గంటలకు సూర్యప్రభవాహనం, రాత్రి 7.00 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి సందర్భంగా ఉదయం 7.00 గంటలకు సూర్యప్రభ వాహనంతో వాహనసేవలు ప్రారంభమవుతాయి. అప్పటినుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు అమ్మవారు హంస, అశ్వ, గరుడ, చిన్నశేష వాహనాలపై ఊరేగనున్నారు. సాయంత్రం 3.00 నుండి 4.00 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 6.00 నుండి రాత్రి 9.30 గంటల వరకు చంద్రప్రభ, గజ వాహనాలను అధిష్టించి అమ్మవారు దర్శనమిస్తారు.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం పక్కన గల శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం 6.00 గంటలకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం 6.00 గంటల నుండి 7.00 గంటల వరకు బంగారు తిరుచ్చిపై స్వామివారు దేవేరులతో కలసి ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించనున్నారు. అనంతరం ఆలయంలో ఆస్థానం నిర్వహించనున్నారు.


చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఉదయం 9.00 నుండి 11.00 గంటల వరకు బంగారు తిరుచ్చిపై స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించనున్నారు. అనంతరం ఆలయంలో ఆస్థానం నిర్వహించనున్నారు.అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం 6.00 గంటల నుండి 8.00 గంటల వరకు తిరువీధి ఉత్సవం ఘనంగా జరుగనుంది.నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం 6.30 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు సూర్యప్రభ, హంస, చిన్నశేష, కల్పవృక్ష, పెద్దశేష వాహన సేవలు, తిరుచ్చి ఉత్సవం జరుగనున్నాయి. సాయంత్రం 6.00 నుండి రాత్రి 7.30 గంటల వరకు చంద్రప్రభ వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.


కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో 6.00 గంటల నుండి 7.00 గంటల వరకు స్వామివారికి తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు.నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో ఉదయం 6.00 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు సూర్యప్రభ, హంస, కల్పవృక్షవాహన సేవలు, తిరుచ్చి ఉత్సవం జరుగనున్నాయి. సాయంత్రం 4.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు శేషవాహనం, చంద్రప్రభ వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ సప్తమి సూర్యజయంతిని పురస్కరించుకొని తితిదే స్థానిక ఆలయాల్లో రథసప్తమి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఆరోజు ఉదయం భానుని తొలిరేఖలు సూర్యప్రభ వాహనంలో కొలువైన శ్రీవారి లలాటపలకం, నాభి, పాదకమలాలపై ప్రసరించే అద్భుత దృశ్యాన్ని తిలకించడానికి భక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తుంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: