సేవ‌కులంతా క‌లిసి చివ‌ర‌కు తిరుమ‌ల‌ శ్రీ‌వారి ప్ర‌తిష్ట‌కు మ‌చ్చ తెస్తున్నారు. దేశంలో సుమారు 130 కోట్ల‌మంది జనాభా ఉంటే స్వామి వారికి సేవ చేసుకునే అదృష్టం చాలా కొద్దిమందికి మాత్ర‌మే ద‌క్కుతుంది. అతంటి అదృష్టం ద‌క్కిన‌వారు ఏం చేస్తున్నారు ?  వారి స్వ‌లాభాల కోసం, ఆధిప‌త్యం నిరూపించుకునేందుకు అదృష్టాన్ని క‌ల‌గ‌చేసిన  స్వామివారి ప్ర‌తిష్ట‌కే మ‌చ్చ తెస్తున్నారు.  తిర‌మ‌ల ప‌విత్ర‌త‌కే క‌ళంకం తెస్తున్నారు. దేశంలో మ‌రే ప్రార్ధ‌నాలయంపై లేని వివాదాలు, ఆరోప‌ణ‌లు కేవ‌లం తిరుమ‌ల‌లోని శ్రీ‌వారి దేవాల‌యం చుట్టూనే ఎందుకు ముసురుతున్నాయి ?  తాజాగా తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో మాజీ ప్ర‌ధానార్చ‌కులు ర‌మ‌ణ‌దీక్షితులు- టిటిడి ఈవో మ‌ధ్య మొద‌లైన వివాదం కోట్లాది భ‌క్తుల మ‌నోభావాల‌ను దెబ్బ తీస్తున్నాయ‌న‌టంలో ఎటువంటి సందేహం లేదు. 

ఎందుకీ వివాదాలు ?

Image result for తిరుమ‌ల

తిరుమ‌ల ఆల‌యం చుట్టూ సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి వివాదాలు ఎందుకు ముసురుకుంటున్నాయంటే కేవ‌లం ఇగో ప్రాబ్లం అనే చెప్పాలి. ఆల‌యంలో శ్రీ‌వారికి జ‌ర‌గాల్సిన కైంక‌ర్యాల విష‌యం పాల‌కుల జోక్యం పెరిగిపోతుండ‌ట‌మే అందుకు ప్ర‌ధాన కార‌ణంగా చెప్పుకోవాలి. కైంక‌ర్యాలంటే  రోజువారి జ‌రిగే దూప‌, దీప నైవేద్యాలు,  నిత్యం శ్రీ‌వారికి జ‌రిగే సేవ‌లు,  ప్ర‌త్యేక రోజుల్లో జ‌రిగే ఉత్స‌వాల‌తో ఆటు ఊరేగింపులు, బ్ర‌హ్మోత్స‌వాలు త‌దిత‌రాల‌న్న‌మాట‌. స‌హ‌జంగానే కైంక‌ర్యాల గురించి పాల‌కుల‌కు తెలిసింది చాలా త‌క్కువే. ఎందుకంటే, పాల‌కుల బాధ్య‌త‌లు, విధులు వేరే ఉంటుంది కాబ‌ట్టి.  వంశ‌పారంప‌ర్యంగా  చిన్న‌ప్ప‌టి నుండి ఇదే వృత్తిలో ఉంటున్న కార‌ణంగా ఆర్చ‌క‌, మిరాశీ కుటుంబాల‌దే కైంక‌ర్యాల విష‌యంలో అంతిమ నిర్ణ‌యంగా ఉంటుంది. 

ఆధిప‌త్యమే ప్ర‌ధాన కార‌ణ‌మా ?

Image result for ttd

ద‌శాబ్దాల టిటిడి చ‌రిత్ర‌లో అర్చ‌క‌, మిరాశీల‌కు పాల‌కుల‌కు మ‌ధ్య వివాదాలు రేగిన సంద‌ర్భాలు చాలా త‌క్కువ‌. ఒక‌వేళ ఏ విష‌యం అయినా వివాదం మొద‌లైనా వెంట‌నే ఎవ‌రో ఒక‌రు స‌ర్దుబాటు చేసుకునే వారు కాబ‌ట్టి రోడ్డున ప‌డిన వివాదాలు త‌క్క‌వ‌నే చెప్పాలి. ఎన్టీ రామారావు ముఖ్య‌మంత్రి అయిన ద‌గ్గ‌ర నుండి కైంక‌ర్యాల విష‌యంలో పాల‌కుల జోక్యం ఎక్కువైంద‌నే చెప్పాలి. అప్ప‌టి నుండి  టిటిడికి ఇవోలుగా, ఛైర్మ‌న్లుగా వ‌చ్చిన వారిలో అత్య‌ధికుల‌కు స్వామిమీద భ‌క్తిక‌న్నా ఇత‌ర అంశాల‌పైనే ఎక్కువ దృష్టి ఉండ‌టంతోనే వివాదాలు మొద‌ల‌య్యాయి. పైగా ఛైర్మ‌న్లుగా ప‌నిచేసిన వారిలో అత్య‌ధికులు ఏదో ఓ వ్యాపారంలోనో,  రంగంలోనో ఉండ‌టంతో స్వ‌లాభంపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. కాబ‌ట్టే త‌మ మాటే చెల్లుబాటు కావ‌ల‌న్న ఆధిప‌త్య‌ధోర‌ణి మొద‌లైంది. 

ఎక్కువైన పాల‌కుల‌ జోక్యం

Image result for Ramana Deekshithulu

స్వామివారి కైంక‌ర్యాల్లో పాల‌కుల జోక్యం ఎక్కువైపోయింది. కైంక‌ర్యాల‌ను య‌ధావిధిగా జ‌రిపించాల్సిన అర్చ‌క‌, మిరాశీల విధుల్లో పాల‌కుల త‌ర‌చూ జోక్యం చేసుకోవ‌టం ఎక్కువైపోయింది. ఈవో, ఛైర్మ‌న్లు మారిన‌ప్పుడ‌ల్లా స్వామి వారి సేవ‌ల్లో మార్పులు చేయ‌టం మొద‌లైంది. తాజాగా ర‌మ‌ణ‌దీక్షితులు లేవ‌నెత్తుతున్న అనేక‌ ప్ర‌శ్న‌లు అవే అంశాల‌ను ఎత్తి చూపుతోంది. దాన్నే పాల‌కులు స‌హించ‌లేకున్నారు. టిటిడి ఈవోలైనా, ఛైర్మ‌న్లైనా ముఖ్య‌మంత్రుల‌కు ఇష్ట‌మైన వారే అవుతారు కాబ‌ట్టి స‌హ‌జంగా సిఎం ఆలోచ‌న‌లే టిటిడిలో ప్ర‌తిఫ‌లిస్తుంటుంది. ప్ర‌స్తుతం ర‌మ‌ణ‌దీక్షితులు చేస్తున్న ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌ల‌న్నీ చంద్ర‌బాబునాయుడును ఉద్దేశించి చేస్తున్న‌వే అన్న విష‌యం ఎవ‌రికైనా అర్ధ‌మైపోతుంది. ప్ర‌భుత్వంపై ర‌మ‌ణ‌దీక్షితులు ఆరోప‌ణ‌లు చేయ‌టం ఇదే కొత్త‌కాదు. అందుకే ప్ర‌భుత్వం కూడా దీక్షితుల‌పై క‌క్ష క‌ట్టిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించి ప్ర‌ధానార్చక‌ బాధ్య‌త‌ల నుండి త‌ప్పించ‌ట‌మే కాకుండా ఏకంగా  విధుల నుండే రిటైర్ చేసేసింది. 

ఎవ‌రిది త‌ప్పు ? ఎవ‌రిది ఒప్పు ?

Image result for ttd

ర‌మ‌ణ‌దీక్షితులు లేవ‌నెత్తుతున్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలివ్వాల్సిన బాధ్య‌త క‌చ్చితంగా ప్ర‌భుత్వంపై ఉంటుంది. అదే స‌మ‌యంలో ఆల‌యంలో జ‌రుగుతున్న అనేక అప‌చారాల‌ను ప్ర‌భుత్వం దృష్టికి తేవ‌టంలో దీక్షితులు కూడా సంయ‌మ‌నం పాటించాల్సిన అవ‌స‌రం ఉంది. దీక్షితులు చెబుతున్న‌ట్లు ఆల‌యంలో అప‌చారాలు, అవినీతి జ‌రుగుతుంటే వాటిని ఎత్తి చూపేందుకు మార్గాలు వేరే ఉన్నాయి. ప్ర‌తీదానికి మీడియా ముందుకు రావ‌టం అంత మంచిదికాదు. శ్రీ‌వారి ఆల‌యం మొత్తం కంచి కామ‌కోఠి పీఠం సూచ‌న‌లు, స‌ల‌హాల‌పై న‌డుస్తుంది. 

దీక్షితులుపై క‌క్ష సాధింపేనా ?

Image result for ttd

ఆల‌యంలో జ‌రుగుతున్న వ్య‌వ‌హారాల‌ను దీక్షితులు మ‌ఠం ద్వారా ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళితే బాగుండేది. లేదంటే ముఖ్య‌మంత్రిని తానే నేరుగా క‌లిసి వివ‌రించి ఉండాల్సింది. మ‌రి ఆ మార్గాల్లో దీక్షితులు ప్ర‌య‌త్నం చేసింది లేంది తెలీదు. ఎప్పుడైతే మీడియాతో మాట్లాడారో, అప్పుడే విష‌యం సంచ‌ల‌నంగా మారింది. ఇక్క‌డ త‌ప్పొప్పుల‌ను వెతికే క‌న్నా ఇరువ‌ర్గాలు అనుస‌రిస్తున్న వైఖ‌రితో తిరుమ‌ల ప్ర‌తిష్ట‌కు భంగం క‌ల‌గ‌టం వ‌ల్ల కోట్లాది మంది భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బ‌తింటున్నాయ‌న్న విష‌యం గ‌మ‌నించాలి.  ఆల‌యం వ్య‌వ‌హారాల‌పై దీక్షితులు  ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు మొద‌లుపెట్టారో వెంట‌నే ప్ర‌భుత్వం కూడా దీక్షితుల‌పై క‌క్ష క‌ట్టిన‌ట్లుగా వ్య‌వ‌హరించ‌టం మొద‌లుపెట్టింది. ఆల‌యంలో అర్చ‌కుల ఉద్యోగ విర‌మ‌ణ‌పై ఎప్పుడో జారీ చేసిన ఉత్త‌ర్వుల‌ను హ‌టాత్తుగా పాల‌క‌మండ‌లి ద్వారా అమ‌లు చేయించింది. దాంతో వివాదం మ‌రింత రాజుకుంది. 

అర్చ‌కుల‌కు రిటైర్మెంట్ స‌బ‌బేనా ?

Image result for ttd

ఈ విష‌య‌మై రాష్ట్రంలో ఇపుడు పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. నిజానికి అర్చకుల‌కు వ‌య‌స్సు, అనుభ‌వం పెరిగేకొద్దీ త‌న త‌రువాతి త‌రం వారికి అవ‌స‌ర‌మైనపుడు మార్గ‌ద‌ర్శ‌కంగా ఉంటారు. ఒంట్లో శ‌క్తి ఉన్నంత వ‌ర‌కూ ఆల‌యాల్లో అర్చ‌క‌త్వం చేయ‌టం, పూజ‌ల్లో పాల్గొన‌టం చాలా స‌హ‌జం. అటువంటిది ఎక్క‌డా లేన‌ట్లు తిరుమ‌ల ఆల‌యంలో రిటైర్మెంట్ నిబంధ‌న‌ను ప్ర‌భుత్వం ఎందుకు తెచ్చిందో అర్ధం కావ‌టం లేదు. చూడ‌బోతే ర‌మ‌ణ‌దీక్షితుల‌ను ఇంటికి సాగ‌నంప‌టానికే నిబంధ‌న తెచ్చిందా అన్న అనుమానాలు మొద‌లైంది. అందుకే అర్చ‌కులు, కైంక‌ర్యాల్లో పాల‌కుల జోక్యం పెరిగిపోతోందంటూ దీక్షితులు ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: