వినాయకుడు.. భారతీయులకు ఇష్టమైన దైవం.. వినాయక చవితి.. అందరికి ఆసక్తికలిగించే పండగ. ఈ పండుగ తరువాతనే మిగతా పండుగలన్నీ ప్రారంభమవుతాయి. భాద్రపద మాసంలో చతుర్ధశి నాడు మనం వినాయక చవితి పర్వదినం జరుపుకుంటాము. వినాయక చవితినాడు వేకువ జామునే లేచి అభ్యంగన స్నానం చేసి గడపలకు పసుపు రాసి కుంకుమతో అలంకరించాలి. గుమ్మాలకు మామిడాకు తోరణాలు కట్టాలి. పూజా మందిరంలో దేవుని పీఠాన్ని పసుపు కుంకుమ్మలతో అలంకరించి ఇరువైపుల అరటి స్తంబాలు కట్టాలి. పాలవెళ్ళి కట్టి దానికి కలువ పూలు మొక్క బొత్తులు, ఉమ్మెత్తకాయలు, వెలగపండ్లు వేళాడగట్టాలి.


పూజా మందిరంలో అలంకరించిన పీటపై బియ్యం పోసి, దానిపై 'పత్రీని కొంత ఉంచి పత్రిపై మట్టితోచేసిన వినాయక ప్రతిమను ఉంచాలి. తలపై గొడుగు ఉంచాలి. మొదట గౌరమ్మను పూజించి ఆ తరువాత స్వామివారిని 21 రకాల పత్రితో, పూలతో పూజించాలి. చదువుకునే పిల్లలు వారివారి పుస్తకాలను స్వామివారి వద్ద ఉంచాలి. వినాయక వ్రత కథ పుస్తకంలో సూచించిన విధంగా పూజ నిర్వహించాలి. కథలోని శమంతకోపాఖ్యాన్ని విని అక్షింతలు తలపై చల్లుకుంటే చంద్రున్ని చూచినా నీలాపనిందలు రావని మన పూర్వీకుల విశ్వాసం.


చవితినాడే గణపతిని ఎందుకు పూజించాలి?

Related image

భాద్రపద శుక్ల చవితినాడు మధ్యాహ్నంవేళ వినాయక జననం జరిగింది. నరరూపంలోఉన్న వరపుత్రుడైన వినాయకుడిని లోకకల్యాణంకోసం పరమేశ్వరుడు గజముఖుడిగా మార్చాడని ప్రతీతి. పార్వతీదేవి నలుగుపిండి ముద్దతో చేసిన బాలుడిని త్రిశులంతో శిరస్సుని ఖండించి మరలా ఆ బాలుణ్ణి బతికించేందుకు గజముఖాన్ని అతికించి ప్రాణపతిష్ఠ చేశారు. కారణజన్ముడైన గజాననుడు గజాసురుణ్ణి సంహరించి లోకాలను కాపాడాడు. గజాసురుడితోపాటు లోకుల్ని విపరీతంగా బాధపెడుతున్న మరో సమస్య  విఘ్నాలు. రకరకాల విఘ్నాలతో విసిగి వేసారిపోయిన ఏడేడు లోకాలూ విఘ్నాలకు ఓ మహనీయుడిని అధిపతిని చేయమని పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు. కుమార స్వామికీ, విఘ్నేశ్వరుడికీ ఈ విషయ గట్టి పోటీ జరిగింది. బుద్ధి కుశలతతో విఘ్నేశ్వరుడు తన ఆధిపత్యాన్ని నిరూపించుకుని గణాధిపతి అయ్యాడు. విఘ్నాలు దరిచేరకపోవడమనే వరం భాద్రపద శుక్ల చవితినాడు వినాయకుడిని పూజించేవాళ్లకి దొరికే మొట్టమొదటి లాభం. భాద్రపద శుక్ల చవితినాడు వినాయకుడికి ఈశ్వరుడు గణాధిపత్యాన్ని ఇచ్చాడు కనుక ఈ రోజున గణపతిని సేవించుకుంటే సర్వ విఘ్నాలూ తొలగిపోతాయి. సకల కార్యాలూ సానుకూలమౌతాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: