ఏ దేవతను పూజించినా షోడశోపచార పూజచేస్తాం. దానిలో ‘ఛత్రం ధారయామి’ అనేది ఒక సేవ. ఒక ఉపచారం. అంటే గొడుగు పట్టుకోవడం. వినాయక పూజలో గొడుగు పట్టుకోవడంతో పాటు పాలవెల్లిని కట్టడం ఒక ఆనవాయితీ. పాలవెల్లి చతురస్రాకారంగా ఉంటుంది.  నీ నిజానికి పాలవెల్లి అంటే  ఆకాశంలో కనిపించే పాలపుంత. వినాయకునికి కట్టే పాలవెల్లి అంటే ఆకాశమే. నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై అన్నట్లు వినాయకుణ్ణి ఆకాశం గొడుగుకింద పూజిస్తాం. భువన భాండాలన్నింటినీ ఆయన గొడుగుతో సమానంగా భావిస్తాం.

Image result for వినాయకచవితికి పాలవెల్లి

 గణేశుని పూజ అంటే ప్రకృతి ఆరాధనే కదా! ప్రకృతిలో సృష్టి, స్థితి, లయలనే మూడు స్థితులు కనిపిస్తాయి. గణేశుని పూజలో ఈ మూడు స్థితులకూ ప్రతీకలని గమనించవచ్చు. ఈ భూమిని (సృష్టి) సూచించేందుకు మట్టి ప్రతిమను, జీవాన్ని (స్థితి) సూచించేందుకు పత్రినీ, ఆకాశాన్ని (లయం) సూచించేందుకు పాలవెల్లినీ ఉంచి ఆ ఆరాధనకి ఓ పరిపూర్ణతని ఇస్తాము.  పాలవెల్లి అంటే పాలపుంతే అని తేలిపోయింది. నక్షత్రాలకు సంకేతంగా మొక్కజొన్నలు, వెలగపళ్లు, దానిమ్మ, బత్తాయి, అరటివంటి పళ్లతో పాలవెల్లిని అలంకరిస్తాం. ఉమ్మెత్తను కూడా పాలవెల్లికి అలంకరించవచ్చు. మామిడాకులు కూడా పెట్టవచ్చు. పాలవెల్లి అలంకరణ వినాయకచవితికి పెద్దపని.


పాలవెల్లి ఎంత అందంగా ఉంటే వినాయక మంటపం అంత శోభస్కరంగా ఉంటుంది. పండుగకు ముందురోజే పాలవెల్లిని అలంకరించడం మంచిది. పాలవెల్లికి కట్టిన పళ్లను ఏంచేయాలన్నదన్నది ఒక ధర్మసందేహం. తొమ్మిదిరోజులు పూజిస్తే పళ్లు పాడవుతాయి కనుక వినాయక నిమజ్జనంలో పాలవెల్లికి కట్టిన పళ్లను కూడా వేసేస్తారు. అలాకాకుండా ఒక్కరోజే పూజించేవారు ఆ పళ్లను నిరభ్యంతరంగా తినవచ్చు. కలశంలో కొబ్బరికాయ, దేవుడికిచ్చే హారతి, పాలవెల్లికి కట్టే పళ్లు ఇవన్నీ విసర్జించవలసిన వస్తువులు, దృష్టితీసిన వస్తువులు కానేకావు. అలాగే చవితినాడు మనింట్లో పూజచేయడంతో పాటు మరో ముగ్గురి ఇళ్లలో అయినా గణేశ పూజా మండపాలను దర్శించడం అనే ఆనవాయితీ గతంలో ఉండేది.

Related image

ఇవన్నీ వివిధ ఖగోళవస్తువులకు సూచన అన్నమాట. గణపతి పూజ ఆడంబరంగా సాగే క్రతువు కాదు. మనకి అందుబాటులో ఉన్న వస్తువులతో భగవంతుని కొలుచుకునే సందర్భం. బియ్యంతో చేసిన ఉండ్రాళ్లు, చెట్ల మీద పత్రి లాంటి వస్తువులే ఇందులో ప్రధానం. ఏదీ లేకపోతే మట్టి ప్రతిమను చేసి, పైన పాలవెల్లిని వేలాడదీసి, గరికతో పూజిస్తే చాలు.... పండగ అంగరంగవైభవంగా సాగిపోయినట్లే! పసుపు రాసి కుంకుమబొట్లు పెట్టిన పాలవెల్లి గణేశుని పూజకి అద్భుతమైన శోభనిస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: