ఇస్లాం మతానికి సంబంధించిన వారికి రంజాన్ నెల ఎంతో పవిత్రమైనది. ఈ నెలలో ముస్లింలు నెల రోజుల పాటు సూర్యోదయం నుంచి సూర్యస్తమయం వరకు ఉపవాస దీక్షలు పాటిస్తారు. కనీసం నోటిలో ఉన్న లాలాజలాన్ని కూడా మింగరు. అంత కఠోర ఉపవాస దీక్షలు పాటిస్తారు.  అయితే రంజాన్ మాసం గురించి దివ్య ఖురాన్ లో  ఇలా వివరించడం జరిగింది.


‘‘పవిత్ర దివ్య ఖురాన్ గ్రంథం అవతరించిన మాసం రంజాన్. మానవులందరికీ ఆ గ్రంథం మార్గదర్శకం. రుజు మార్గం చూపే, సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఉపదేశాలు అందులో ఉన్నాయి. కనుక ఇక నుంచి రంజాన్ మాసాన్ని పొందే వ్యక్తి ఆ మాసం అంతా విధిగా ఉపవాస దీక్ష పాటించాలి. 
ఇస్లాం మతాన్ని అవలంబించేవారికి, ఆధ్యాత్మిక, సామాజిక వ్యక్తిగత, న్యాయ ధర్మ, శిక్ష వంటి అంశాలన్నింటికీ పరమ పవిత్రమైన ఖురాన్ గ్రంథమే ఆధారం. ఇస్లాం అనే పదానికి పూర్తి వినయ విధేయతలతో సకల చరాచర సృష్టికర్త, సర్వేశ్వరుడైన అల్లాకు లోబడి ఉండటం అని అర్థం. సర్వశక్తిమంతుడు, సర్వేశ్వరుడే అపార కరుణామయుడు.


ఎవరి అదుపు ఆజ్ఞలో సకల చరాచర లోకవ్యవస్థ ఆగమిస్తుందో అలాంటి పరమపవిత్రమైన పరమేశ్వరుడైన అల్లాహ్‌కి లోబడి పవిత్ర ఖురాన్ నిర్దేశిత జీవన విధానాన్ని గడపడం ఇస్లాం మతం అవలంభించేవారి విధి. అయితే ఇస్లాంను పరిపూర్ణంగా అమలు చేసేందుకు ముస్లింలు ఐదు ముఖ్యమైన అంశాలను పాటించాల్సి ఉంటుంది.


1. ఈమాన్ ( దైవత్వం పట్ల ప్రగాఢ విశ్వాసం)
2. నమాజ్ (8 సంవత్సరాలు దాటిన బాలబాలికలతో విధిగా 5 సార్లు పాటించవలసింది)
3. రోజా (ఉపవాస దీక్ష) 8 సంవత్సరాలు దాటిని బాలబాలికలతోపాటు అందరూ విధిగా పాటించాల్సింది.
4. జకాత్ / సద్కా (దాన ధర్మాలు) తమ స్థిర, చరాస్తులు, ఆదాయం, సంపదను బట్టి నిర్దేశించిన స్థాయిలో దానధర్మాలు చేయడం
5. హజ్‌యాత్ర : సౌదీ అరేబియా మక్కాలో నెలకొని ఉన్నా పరమపవిత్ర దైవగృహం అనబడే కాబా క్షేత్రాన్ని నిర్దేశిత నియమ నిబంధనలు పాటిస్తూ దర్శించి పునీతులు కావడమే హజ్ యాత్ర ఆంతర్యం. ఆర్థిక పుష్టి కలిగి, కుటుంబ బరువు బాధ్యతల నుంచి, అన్ని రకాల రుణాల నుంచి విముక్తమైనవారు తమ జీవితకాలంలో ఒకసారైనా హజ్‌యాత్ర చేయగలగాలి.
అయితే హజ్ యాత్ర తప్ప మిగతా నాలుగు అంశాలు ఆర్థిక స్థోమతలో వ్యత్యాసాలున్నప్పటికీ, ప్రతి ముస్లిం స్త్రీ, పురుషులు పాటించాల్సిందే. ఐదు అంశాల్లో ఒకటైన రోజా (ఉపవాస దీక్ష) రంజాన్ మాసంలో అత్యంత భక్తిక్షిశద్ధలతో పాటించే దీక్ష. ఈ నెలలో ముస్లిం సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరుస్తుంది. అందుకు ఎన్నో కారణాలున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: