హాలీమ్... రంజాన్ మాసంలో ముస్లింలు బిర్యాని కాకుండా ప్రత్యేక వంటకమైన హలీమ్ ని భుజిస్తారు. ముస్లింలు మాత్రమే కాదు... ఎవరైనా హలీమ్ తీనే విధంగా పలువురు దుకాణాలు ఏర్పాటు చేసి ప్రజలకు హాలీమ్ రుచిని పరిచయం చేసారు. ఇక రంజాన్ వచ్చిందంటే హాలీమ్ అన్నట్లుగా మారిపోయింది ప్రజలకు. అసలు ఇరాన్ నుంచి నగరానికి వచ్చిన ఓ కుటుంబం పాతబస్తీలోని చార్మినార్ వద్ద మదీనా సర్కిల్‌లో 'మదీనా' పేరుతో హోటల్ పెట్టి హలీం విక్రయాలను ప్రారంభించింది. అందుకే హాలీమ్ తినాలంటే పాతబస్తీకి వెళ్లాలంటారు.


అసలు ఈ ప్రత్యేక వంటకమైన హాలీమ్ తయారీ అంత సులువు కాదండీ. హలీమ్ తయారీకి కనీసం 9 గంటల సమయం పడుతోంది. తెల్లవారు జామున 4 గంటలకే తయారీ విధానం ప్రారంభిస్తారు. మటన్ హలీం వంటకంలో మటన్, గోధుమలు, అన్ని పప్పులు, బాస్మతి బియ్యం, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డ, పచ్చిమర్చి, యాలకులు, దాల్చినచెక్క, మిరియాలు, కొత్తిమీర, నూనె, డ్రైఫూట్స్ తదితర వాటిని వినియోగిస్తారు. 


హలీమ్ తయారీ విషయానికి వస్తే ముందుగా గిన్నెలో మాంసం, నీటిని కలిపి బాగా ఉడికిస్తారు. అనంతరం గోధుమలు, బాసుమతి బియ్యం, పప్పులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాల దినుసులు, పచ్చిమిర్చి బాగా ఉడికించి మెత్తగా దంచుతారు. అనంతరం సమపాళ్లలో నెయ్యి కలుపుతారు. ఫిష్ హలీంలో గోధుమలు, మసాలాలు కలిపి ఉడికించి చివరన చేప ముక్కలను కలిపి తయారు చేస్తారు. అదేవిధంగా హలీమ్ లో చాలా రకాలున్నాయి. వీటి ప్రత్యేకత దానిదే. దక్కన్ హలీమ్.. ఇరానీ హలీం.. వెజిటేరియన్ హలీం.. ఇలా చాలా రకాలున్నాయి.


తొలినాళ్లలో నాన్‌వెజ్‌తో తయారైన హలీం ఇప్పుడు వెజిటేరియన్‌గా కూడా లభ్యమవుతోంది. నాన్‌వెజ్‌లో మటన్, చికెన్, బీఫ్, ఫిష్, ఈమూ హలీంలు ప్రత్యేకం. ఇందులో సైతం దక్కని, ఇరానీ, అరేబియన్, జఫ్రానీ, యమనీ విధానాల్లో తయారు చేస్తుంటారు. కొవ్వు తక్కువగా ఉండే ఈమూ హలీం తయారీ రెండేళ్ల క్రితం ప్రారంభమైంది. వెజిటేరియన్‌లో కూడా అనేక రకాలుగా హలీం హోటల్స్‌లో దొరుకుతోంది. 


హలీం రుచికే కాదు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులోని పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఒక కప్పు హలీం లో 365 క్యాలరీలు, కొవ్వు నుంచి లభించే క్యాలరీలు 150 లభిస్తాయి. మొత్తం కొవ్వు 17 గ్రాములు, కొలెస్ట్రాల్ 51 మిల్లీగ్రాములు, సోడియం 580 మిల్లీగ్రాములు, పొటాసియం 410 మిల్లీగ్రాములు, కార్బోహైడ్రేట్లు 29.50 గ్రాములు, డైటేరీ ఫైబర్ 9 గ్రాములు, సుగర్స్ 2.75 గ్రాములు, ప్రోతినులు 28.00 గ్రాములు లభిస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: