పూరీ జగన్నాథ దేవాలయం భారతదేశం లోని ఒడిషా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరీ పట్టణంలో గల ఒక ప్రాచీన మరియు ప్రముఖమైన హిందూ దేవాలయము. . కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైనది. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర మరియు బలరామ సమేతంగా దర్శనమిస్తాడు. ఇక భగవంతుడు భక్తుల మధ్యకు వచ్చి అత్యంత వైభవంగా జరుపుకొనే మహోత్సవం పూరీ జగన్నాథుని రథయాత్ర. 

Image result for puri jagannadh rath yatra

భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచినది పూరీ జగన్నాథ రథయాత్ర. ఈ ఉత్సవం ప్రతీ సంవత్సరం జూన్ లేదా జూలై నెలల్లో నిర్వహిస్తారు. ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలను పూరీ వీధుల్లో ఊరేగిస్తారు. రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుంది. దీనికి ఏడు అడుగుల వ్యాసం కలిగిన 16 చక్రాలు ఉంటాయి. దాదాపు నాలుగు వేల మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగుతారు. ఆషాఢ శుక్ల విదియ రోజున నిర్వహించే రథయాత్ర వేడుకకు అక్షయ తృతీయ నుంచే సన్నాహాలు మొదలవుతాయి. వేసవి తీవ్రత మొదలవడంతో విగ్రహాలకు చందన లేపనాన్ని పూస్తారు.

Image result for puri jagannadh rath yatra

పూరీ రాజు నివాసం ఎదుట ఆలయ ప్రధాన కార్యాలయానికి చేరువలో రథాల తయారీ కొనసాగుతుంది. అక్షయ తృతీయ నాటి నుంచి జగన్నాథుని చందనయాత్ర కూడా మొదలవుతుంది. ప్రపంచంలో ఏ హిందూ ఆలయంలోనైనా సరే, వూరేగింపు నిమిత్తం మూలవిరాట్టును కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలుంటాయి. వూరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్లా చూసేదే. ఈ సంప్రదాయాలన్నింటికీ మినహాయింపు ఒడిశాలోని పూరీ జగన్నాథాలయం. బలభద్ర, సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలోంచి బయటికి తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు. వూరేగించేందుకు ఏటా కొత్తరథాలను నిర్మిస్తారు.


అందుకే... జగన్నాథుడి రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు. రథయాత్ర నేపథ్యం గురించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ద్వాపర యుగంలో కంసుడిని వధించడానికి బలరామకృష్ణులు బయలుదేరిన ఘట్టాన్ని పురస్కరించుకుని ఈ యాత్ర జరుపుతారని ఒక కథనం. ద్వారకకు వెళ్లాలన్న సుభద్రాదేవి కోరిక తీర్చే ముచ్చటే ఈ రథయాత్ర అని మరొకొందరు చెబుతారు. ఇక గుండీచాదేవి మందిరం విషయానికొస్తే... పూరీ జగన్నాథ ఆలయాన్ని నిర్మించిన ఇంద్రద్యుమ్న మహారాజు భార్య గుండీచా. ఆవిడ కూడా జగన్నాథబలభద్రుల కోసం ప్రధానాలయానికి మూడు కి.మీ. దూరంలో ఒక మందిరం నిర్మించింది. అదే గుండీచా ఆలయం.

Image result for puri jagannadh rath yatra

రథయాత్రలో భాగంగా అక్కడికి తీసుకువెళ్లిన మూడు విగ్రహాలనూ ఈ గుడిలోని రత్నసింహాసనంపై కూర్చుండబెట్టి గుండీచాదేవి పేరిట ఆతిథ్యం ఇస్తారు.  మేళతాళాలతో గర్భగుడిలోకి వెళ్లిన పండాలు (పూజరులు) ఉదయకాల పూజాదికాలు నిర్వహిస్తారు. శుభముహూర్తం ఆసన్నమవగానే ‘మనిమా(జగన్నాథా)’ అని పెద్దపెట్టున అరుస్తూ రత్నపీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు. ఆలయ ప్రాంగణంలోని ఆనందబజారు, అరుణస్తంభం మీదుగా వాటిని వూరేగిస్తూ బయటికి తీసుకువస్తారు. ఈ క్రమంలో ముందుగా... దాదాపు ఐదున్నర అడుగుల ఎత్తుండే బలరాముడి విగ్రహాన్ని తీసుకువస్తారు. బలభద్రుడ్ని చూడగానే జై బలరామా, జైజై బలదేవా అంటూ భక్తులు చేసే జయజయధ్వానాలతో బోడోదండా మారుమోగిపోతుంది.


బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజంపై ప్రతిష్ఠింపజేస్తారు. అనంతరం ఆ స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాగా ఇతర అలంకరణలను తీసి భక్తులకు పంచిపెడతారు.  ఇక ఆ జగన్నాథుడిని దర్శించుకునే క్షణం ఎప్పుడెప్పుడా అని తహతహలాడిపోతుంటారు భక్తులు. దాదాపు ఐదడుగుల ఏడంగుళాల ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో నుంచి బయటికి తీసుకువస్తుండగానే జయహో జగన్నాథా అంటూ భక్తిపారవశ్యంతో జయజయధ్వానాలు చేస్తారు. ఇలా మూడు విగ్రహాలనూ రథాలపై కూర్చుండబెట్టే వేడుకను పహాండీ అంటారు. ఈ దశలో కులమత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుడి విగ్రహాన్ని తాకవచ్చు.

Image result for puri jagannadh rath yatra

ఈ మూడు విగ్రహాలనూ తీసుకువచ్చేవారిని దైత్యులు అంటారు.విశాలమైన బోడోదండ (ప్రధానమార్గం) గుండా యాత్ర మందగమనంతో సాగుతుంది. లక్షలాది భక్తజనం నడుమ జగన్నాథుడి రథం అంగుళం అంగుళం చొప్పున చాలా నెమ్మదిగా కదులుతుంది. దీన్నే ఘోషయాత్ర అంటారు.భక్తుల తొక్కిసలాటలో చక్రాలకింద ఎవరైనా పడినా, దారిలో ఏ దుకాణమో అడ్డువచ్చినా రథం వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. అడ్డొచ్చిన దుకాణాలను కూలగొట్టైనా సరే ముందుకే నడిపిస్తారు. ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే... జగన్నాథుడి గుడి నుంచి కేవలం మూడు మైళ్ల దూరంలో ఉండే గుండీచా గుడికి చేరుకోవడానికి దాదాపు పన్నెండుగంటల సమయం పడుతుంది.

Related image

గుండీచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథాల్లోనే మూలవిరాట్లకు విశ్రాంతినిస్తారు. మర్నాడు ఉదయం మేళతాళాలతో గుడిలోకి తీసుకువెళతారు. వారం రోజులపాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమినాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. దీన్ని బహుదాయాత్ర అంటారు. ఆ రోజు మధ్యాహ్నానికి మూడు రథాలూ జగన్నాథ ఆలయానికి చేరుకుని గుడిబయటే ఉండిపోతాయి. మర్నాడు ఏకాదశినాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. సునావేషగా వ్యవహారించే ఈ వేడుకను చూసేందుకు బారులు తీరుతారు భక్తులు. గర్భాలయం నుంచి మూల విరాట్లను వరుస క్రమంలో రథాలపైకి తరలించేందుకు వీలుగా ముందురోజు రథాలను మలుపు తిప్పటం ఆచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: