శూర్పణఖ.. రామాయణంలో చిన్నపాత్రే అయినా కీలకపాత్రధారి.. ఈమె వల్లనే రాముడు రావణునితో వైరం తెచ్చుకుంటాడు.. పంచవటిలో పర్ణశాలలో తాపసవృత్తిని స్వీకరించి ఋషులతో కలసి వేదపురాణ శాస్త్ర సంబంధ సందేశ, సందేహ వివరణ సమాధానాల తో సత్కాలక్షేపం చేస్తూ అనుజుడైన లక్ష్మణునితో కలసి సంవత్సరాలను నడిపిస్తున్న శ్రీరాముని కవ్వించి, రాక్షసవధకు ప్రేరేపించిన పాత్ర శూర్పణఖ.

శూర్పణఖ విద్యుజ్జిహ్వుడు అనే రాక్షసుణ్ణి ఈమె వివాహం చేసుకుంది. కొన్ని కారణాల వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో రావణాసురుడు ఆ విద్యుజ్జిహ్వుని సంహరించ వలసి వచ్చింది.అప్పటి నుండి ఒంటరియైన శూర్పణఖ లంకా నగరానికి, దండకారణ్యానికి మధ్య యధేచ్చగా తిరుగుతూ కాలం గడుపుతోంది.

దండకారణ్యంలో నరవాసన తగిలి పరుగెత్తుకొచ్చిన ఈమె రామచంద్రుని దర్శనంతో ఆకలిని మర్చిపోయి, కామవికారయై ఆ పుంసాం మోహనరూపుడైన పురుషోత్తమునిపరిణయాన్ని ఆశిస్తుంది. అందుకోసం రాముని ఇల్లాలిని చంపడానికి కూడ సిద్ధపడుతుంది. శూర్పణఖను “ కామమోహిత” ను చేసిన ఆ సుందరరాముని సుమనోహర రూపాన్ని వాల్మీకి వర్ణించిన విధానం చూస్తే శూర్పణఖే కాదు.సమస్త లోకము మోహపాశబద్ధమై జగమంతా రామమయంగా మారిపోతుందనడంలో అతిశయోక్తిలేదు.

సీతను చంపడానికిఉద్యుక్తురా లౌతున్న శూర్పణఖను రామాజ్ఞతో లక్ష్మణుడుముక్కు చెవులు కోసి వదిలేశాడు. చుప్పనాతి శూర్పణఖ” కు శృంగభంగమైంది. కథ లంకకు చేర, చివరకు సుఖాంతమైంది. అయితే ఈశూర్పణఖ వృత్తాంతానికి పూర్వ కర్మ వాసన ఏమైనా ఉందా అని యోచిస్తే ఆశ్చర్యరామాయణం లో కన్పించింది. ఈశూర్పణఖ పూర్వమొక గంధర్వాంగన.ఒకనాడు శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవితో శేషపాన్పుపై శయనించి యుండగా, ఈ గంధర్వాంగన మహావిష్ణువు పైనున్న మక్కువతో ఆయనను చూడడానికి యత్నించింది. ఆది శేషుడు తన పడగలతో మహావిష్ణువు కన్పించకుండా మూసివేశాడు. కోపించిన గంధర్వకాంత శేషుని చెవులమీద, ముక్కుమీద పిడికళ్ళతో పొడిచింది.

అప్పుడుమహాలక్ష్మి శేషుని సమర్ధిస్తూ మాట్లాడు చుండగా,ఇంతలోగంధర్వాంగన యొక్క భర్త వచ్చి లక్ష్మీదేవి తో వివాదించుచున్న తన భార్యను కోపించి “భూమి యందు రాక్షసిగా“ జన్మింప శపించాడు. అప్పుడు క్రోధించిన గంధర్వాగన కాలాంతరమున నావలన నీభర్తతో నీకు వియోగము సంభవించగలదని శ్రీమహాలక్ష్మిని శపించెను. ఆ గంధర్వాంగనే ఈ శూర్పణఖ. ఆ శేషుడే ఈ లక్ష్మణుడు.”


మరింత సమాచారం తెలుసుకోండి: