hills of Manali, the Hadimba Temple is a unique shrine dedicated to Hidimba Devi

మనదేశంలో దుర్గ, పార్వతి, లక్ష్మి, సరస్వతి లాంటి ఎందరో స్త్రీ దేవతలకు గుళ్లున్నాయి. కానీ పురాణాల్లో రాక్షస పాత్రలైన ఏ స్త్రీకి గుడి కనిపించదు. అలాంటిది హిడింబికి మాత్రం ఓ గుడి ఉంది.

మహాభారతంలో కండలవీరుడు భీముడిని ఇష్టపడుతుంది, హిడింబి అనే రాక్షస వనిత. ప్రేమించి పెళ్లి చేసుకొని ఘటోత్కచుడి లాంటి వీరపుత్రుడిని కంటుంది. కురుక్షేత్ర యుద్ధంలో ఆ ఒక్కగానొక్క కొడుకు చనిపోతే కన్నీరు మున్నీరై, మానసిక ప్రశాంతతకోసం తపస్సు చేస్తూ, ప్రాణాలు వదిలేస్తుంది. ఆమెకు పురాణాల్లో మంచి స్ధానం ఉంది. చివరి వరకు పచ్చని ప్రాంతాల్లో మధ్య, అడవితల్లి ఒడిలోనే బతికింది.

ఇలాంటి హిడింబికి హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలిలో గుడి ఉంది. ఆమెకు నిత్యం పూజలు చేస్తు, భక్తులు తమ కోర్కెలు తీర్చమని మొక్కుకుంటున్నారు. ఏటా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇంతకి.. హిడింబిలోని గొప్పతనం ఏమిటో తెలుసుకోవాలంటే పురాణాల వైపు ఒక లుక్‌ వేయాల్సిందే...

అరణ్యవాసంలో పాండవులు లక్కఇంటి నుంచి తప్పించుకున్న తర్వాత అడవిలోకి వెళ్తారు. మిగిలిన వాళ్లందరూ నిద్రపోతుంటే భీముడు కాపలా కాస్తూ ఉంటాడు. వాసనతో వాళ్లను గుర్తుపట్టిన హిడింబాసురుడు, చెల్లెలు హిడింబిని పంపించి వాళ్ల వివరాలు కనుక్కోమంటాడు. కానీ హిడింబి తొలి చూపులోనే భీముడి ప్రేమలో పడుతుంది. అతడిపై ఉన్న ప్రేమతో 'మా అన్నవల్ల మీకు ముప్పు ఉంది, ఈ ప్రాంతాన్ని వదిలి పొమ్మ'ని సలహా ఇస్తుంది. భీముడు యుద్ధంలో హిడింబాసురుడిని చంపుతాడు.

తర్వాత హిడింబి భీముడిని పెళ్లిచేసుకోమని అడుగుతుంది. 'కొంతకాలమే కలిసి ఉంటాను, తర్వాత మేం వెళ్లిపోతాం' అని భీముడు పెట్టిన షరతులకు ఒప్పుకుని పెళ్లి చేసుకుంటుంది. భీముడితో ఉన్నన్ని రోజులు అతడికి తన ప్రేమను పంచుతుంది. ఘటోత్కచుడిని కంటుంది. అందుకే హిడింబి ప్రేమలో స్వార్థం లేదు. స్వచ్ఛమైంది. పాండవులతో పాటు వెళ్లదు. తన పుట్టిల్లు లాంటి అడవిలో కొడుకును పెంచుకుంటూ ఉండిపోతుంది.

కొడుకు పుట్టిన తర్వాత భీముడు, మిగిలిన పాండవులు, కుంతి.. ఆమెను అడవిలోనే వదిలేసి తమపాటికి తాము వెళ్లిపోతారు. అయినా ఆమె అధైర్యపడదు. భర్త దగ్గర లేకపోయినా కొడుకును ఆదర్శవంతంగా పెంచుతుంది. యుద్ధ విద్యల్లో ఘటోత్కచుడిని గొప్పవాడిగా తీర్చిదిద్దుతుంది. తండ్రి భీముడు, మిగిలిన పాండవులపై అభిమానం కలిగేలా చేస్తుంది. అవసరమైనప్పుడు వాళ్లకు సాయం చేయమంటుంది. యుద్ధంలో పాండవులను కాపాడడానికి ఘటోత్కచుడు తన ప్రాణాలను పణంగా పెట్టి చనిపోతాడు.

హిడింబికి అడవి మధ్య బతకడం అంటేనే ఇష్టం. కొండలు, గుట్టలు, చెట్లు, సెలయేళ్లు, పువ్వుల లోని ప్రతి అందాన్ని అనుభూతి చెందుతూ బతుకుతుంది. భీముడిని పెళ్లి చేసుకున్నాక అతడికి ఆ అడవిలోని అందమైన ప్రదేశాలన్ని చూపిస్తుంది. పాండవులు యుద్ధంలో విజయం సాధించి, రాజ్యాధికారం చేపట్టాక కూడా తను నగరానికి వెళ్లదు. తన జీవితాన్ని ప్రశాంతంగా గడపడం కోసం అడవినే ఎంచుకుంటుంది.పర్వతాలు, జలపాతాలు., అందమైన చెట్ల మధ్య కూర్చొని తపస్సు చేస్తుంది.

హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలి లో హిడింబిదేవి ఆలయం ఉంది. మనదేశంలో హిడింబికి ఉన్న ఒకే ఒక్క గుడి ఇది. ఈ ఆలయం పక్కన ప్రవహించే నీళ్లలో స్నానం చేస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా పోతాయని ఇక్కడి గిరిజనులు, భక్తులు నమ్ముతారు. క్రీ. శ. 1553లో రాజా బహుదూర్‌సింగ్‌ ఈ దేవాలయాన్నినిర్మించాడు. ధూన్‌గిరి వనవిహార్‌ అనే అటవీప్రాంతంలో ఉండటం వల్ల 'దుంగ్రీ మందిర్‌' అని కూడా పిలుస్తారు.

పరిసరప్రాంతాలు మంచుతో కప్పి, కనిపిస్తుంటాయి. ఈ గుడి దగ్గరకు వెళ్లాలంటే కొంతదూరం మెట్ల మీద నడవాలి. ఈ గుహలోనే హిడింబి తపస్సు చేసిందని స్థానిక ఆదీవాసీలు అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: