"శ్రీపరాశర భట్టర్ వారు ప్రసాదించిన "శ్రీరంగనాథ స్తోత్రం"  లోని "కావేరీ వైభవం" గురించి ఉ.వే.శ్రీమాన్ ఈ. ఏ. శింగరాచార్య స్వామి వారు అనుగ్రహించిన తెలుగు వ్యాఖ్యానంలో4వ శ్లోకంలోని కొంత వివరణ సేవించి తరిద్దాం. 


శ్లో// కదా౽హం కావేరీ విమలసలిలే వీతకలుషో
భవేయం తత్తీరే శ్రమముషీ వసేయం ఘనవనే/
కదా వా తం  పుణ్యే మహతి పులినే మంగళగుణం
భజేయం రంగేశం కమలనయనం శేష శయనమ్//


వివరణ 2
కావేరీ నదికి కల ఈవిమలత్వము కేవలం భౌతిక దృష్టిలోనే కాక, ఈపరమార్థ దృష్టిలో కూడ సిద్ధము. ఎందులకనగా - సాక్షాత్తు పరమపథనాథునకు ప్రతి రూపమగు శ్రీరంగనాథుని పాదముల స్పర్శను నిత్యమును కలిగినది కదా కావేరీ!  గంగానదికి త్రివిక్రమ అవతార సందర్భమున మాత్రమే భగవానుని పాద సంబంధము కలుపగా, కావేరీ నది దానిని నిత్యము కలిగి ఉండుట విశేషము. అంతియే కాదు, స్వామిని ప్రకాశింప చేయునట్టి అపూర్వమైన మహిమను కలిగినది.

కావుననే గర్వించు గంగాదేవిని చూచి కావేరీ పరిహాసముగా నుఱుగు రూపమున మందహాసమును చేయుచున్నదనుచు "శ్యామం వేదరహో వ్యనక్తి పులినే ఫైనైర్హసంతీవ తత్  గంగాం విష్ణు పదీత్వపదీత్వమాత్ర ముఖరాం హేమాపగా" (మఱుగున ఉన్న వేద రహస్యమును, అనగా పరమాత్మను కావేరీ నది మధ్యలోని ఇసుక తిన్నెపై వ్యక్తము చేయుచున్న    కావేరీ, విష్ణు పాదోత్పన్నత్వ మాత్రముచే "నేనే అన్ని నదుల కంటే గోప్పదానను"అని తన తరంగముల ధ్వనుల రూపమున గర్జించు గంగను  నురుగు రూపములో పరిహాసము చేయుచున్నది.

22వ శ్లోకమున పల్కిరి కదా మఱియు వైకుంఠ నగరమే శ్రీరంగముగా ఆవిర్భవించినట్లు విరజావదియే కావేరీ అయ్యేను. విరజా అనగా రజోగుణము లేనిది. ఇది తమస్సు  లేకుండుటకును  ఉపలక్షణము. దాని ప్రతిరూపమైన కావేరీయు అట్టిదే. కావున ఆ నది యెుక్క విమలత్వము సిద్ధము. 

వీతకలుష: -పరమపదమును చేరు జీవుడు విరజానదీ స్నానముచే తన కల్మషములన్నింటిని పోగోట్టుకొనును. ఆ పాప పంకిలమంతయు విరజానదికి ప్రతిరూపమగు కావేరీ జలమందు స్నానము చేయుట వలన తొలుగునని  భావము.  రేపటిరోజు  మూడవ వివరణ తెలుసుకుందాం ఆచార్య, భగవత్ అనుగ్రహంతో... 


అపరాధాన్ క్షమస్వ
శ్రీమతే రామానుజాయ నమః
అడియేన్ రామానుజ దాసన్.


మరింత సమాచారం తెలుసుకోండి: