తెలంగాణ రాష్ట్రము  జనగామ జిల్లా చిలుపూరు గ్రామంలోని గుట్టపైన శ్రీ బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. అతి ప్రాచీన ఆలయాలలో ఈ ఆలయం ఒకటిగా చెబుతారు. ఇక్కడ వెలసిన స్వామివారిని దర్శనం చేసుకుంటే అప్పుల బాధలు తొలగిపోతాయని నమ్మకం. ఎందుకంటే ఈ ఆలయ గర్భగుడిలో దర్శనమిచ్చే శ్రీవేంకటేశ్వరస్వామిని బుగుల్ లేదా గుబులు వేంకటేశ్వరస్వామి అని పిలుస్తారు. ఈవిధంగా వేంకటేశ్వరస్వామిని పిలవడం వెనుక ఒక పురాణం ఉంది.


ఈ ఆలయ పురాణానికి వస్తే, శ్రీ వేంకటేశ్వరస్వామి పద్మావతి అమ్మవారితో వివాహం జరుగగా అప్పుడు స్వామివారు కుబేరుని దగ్గర అప్పు తీసుకుంటాడు. ఆవిధంగా తీసుకున్న అప్పు తీర్చలేక వడ్డీ కడుతూ స్వామివారు వడ్డికాసులవాడు అయ్యాడని చెబుతారు. అయితే తీసుకున్న అప్పు తీర్చలేక స్వామివారు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడి గుట్టపైన తపస్సు చేసాడని స్థలపురాణం చెబుతుంది. అందుకే ఇక్కడ వెలసిన స్వామివారిని బుగుల్ లేదా గుబులు అని పిలుస్తారు.

దీనికి చింత, దిగులు అని అర్ధం. అయితే వేంకటేశ్వరస్వామి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కొండక్రింది భాగంలో పాదాల గుర్తులు ఏర్పడ్డాయి. ఇలా స్వామివారి పాదాల గుర్తులు ఉన్న ఈ ప్రదేశాన్ని పాదాల గుండు అని పిలుస్తుంటారు.


ఈ విధంగా పురాతన కాలం నుండి పూజలు అందుకుంటున్న ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. ఇంకా శ్రీ వెంకటేశ్వరస్వామి వారే అప్పుల బాధ నుండి బయటపడటానికి ఇక్కడ తపస్సు చేసుకున్నాడు కనుక ఇక్కడ వెలసిన స్వామివారిని దర్శనం చేసుకుంటే అప్పుల బాధలు ఉండవని భక్తుల నమ్మకం. స్వామివారిని దర్శించుకున్న తర్వాత నిజంగానే కొంత మంది అప్పుల భారి నుంచి విముక్తి లభించిందని అంటారు.  ఏది ఏమైనా  స్వామి వారిని దర్శించుకున్న ఆయన పాదలు చూసినా ఆశీర్వదించినట్లు ఉంటుందని ఇక్కడకు వచ్చిన భక్తులు చెబుతుంటారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: