మహమ్మదీయుల ముఖ్యమైన పండుగల్లో బక్రీద్ పండుగ ఒకటి. ఈ పండుగను ఈదుల్... అజహా, ఈదుజ్జహా, లేక బక్రీద్ అని కూడా అంటారు. అల్లాహ్ ఆదేశం ప్రకారం ఇబ్రహీం ప్రవక్త తన కుమారుడు ఇస్మాయిల్ను బలి ఇవ్వడానికి తీసుకెళ్ళే సాంప్రదాయాన్ని స్మరిస్తూ ముస్లింలు ఈ పండుగ చేసుకుంటారు. ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్ ఈ పండుగకు ప్రామాణికం. ఈ పండుగను రంజాన్ పండుగ జరిగిన 70 రోజుల తరువాత జరుపుకుంటారు. 
 
అల్లాహ్ పంపిన ప్రవక్తల్లో ఒకరైన హజరత్ ఇబ్రహీం త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగను జరుపుకుంటారు. ముస్లింలకు రంజాన్ తరువాత అతి ముఖ్యమైన పండుగ బక్రీద్. ఇస్లాం క్యాలండర్ లోని బక్రీద్ మాసంలో 11 వ రోజున ఈ పండుగను జరుపుకుంటారు. హజీరా, హజరత్ ఇబ్రహీంలకు వృధ్ధాప్యంలో ఒక కుమారుడు పుడతాడు. ఆ కుమారుడిని అపురూపంగా పెంచుకుంటున్న సమయంలో ఇస్మాయిల్ మెడపై కత్తి పెట్టి కోస్తున్నట్లు ఇబ్రహీం కలగంటాడు. 
 
అల్లాహ్ తన కుమారుడిని బలిదానం కోరుతున్నాడని గ్రహించిన ఇబ్రహీం ఇస్మాయిల్ ను బలిదానం (ఖుర్ఖానీ) ఇచ్చేందుకు సిధ్ధం అవుతాడు. ఇబ్రహీం కుమారుడు ఇస్మాయిల్ కూడా అల్లాహ్ మార్గంలో బలయ్యేందుకు సిధ్ధపడతాడు. బలి ఇచ్చే సమయంలో తనపై ఉన్న ప్రేమ అడ్డొస్తే తండ్రి బలి ఇవ్వకుండా వెనుకడుగు వేస్తాడేమోనని కళ్ళకు గంతలు కట్టుకుని బలివ్వమని తండ్రికి సూచిస్తాడు ఇస్మాయిల్. 
 
అల్లాహ్ నామస్మరణతో తన కుమారుడి గొంతుపై కత్తి పెట్టిన ఇబ్రహీంకు అల్లాహ్ చివరి క్షణంలో ఇస్మాయిల్ ను తప్పించి పొట్టేలు ప్రత్యక్షమయ్యేలా చేస్తాడు. ఇబ్రహీం త్యాగనిరతికి మెచ్చిన అల్లాహ్ ఆరోజు నుంచి బక్రీద్ పండుగకు జంతు బలి ఇవ్వాలని నిర్దేశించినట్లు ఇస్లాం చెబుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: