తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఖ్యాతిగాంచిన ఖైరతాబాద్‌ గణేశుడి విగ్రహ ఏర్పాటు పూర్తి కావచ్చింది. 11రోజుల పాటు ఖైరతాబాద్‌ ఓ పుణ్యక్షేత్రంగా మారుతుంది. లక్షలాది మంది భక్తులు గణపతి దర్శనార్థం ఇక్కడకు వస్తుంటారు.ఈ సారి ఎప్పుడూ లేని విధంగా గణపతిని వైవిధ్యమైన ఆకారంలో తయారుచేస్తున్నాం. గత సంవత్సరం 57 అడుగుల ఎత్తుతో గణపతిని తయారుచేయగా ఈసారి 12 తలలతో 12 సర్పాలతో సూర్యభగవానుడి రూపంలో తయారుచేస్తున్నందున ఎత్తును పెంచకతప్పలేదు. మొత్తం మీద ఈ సారి 61 అడుగుల ఎత్తుతో గణపతిని తయారు చేస్తున్నాం. ఈ నెలాఖరు వరకు గణపతిని పూర్తి స్థాయిలో తయారుచేసి భక్తుల సందర్శనార్థం కొలువుదీరేలా చేస్తున్నాం. ఇక్కడి స్థల మహత్యం, నా తోటి కళాకారుల సహకారంతో ఎప్పుడూ ఖైరతాబాద్‌ గణపతి భక్తులకు విశేషంగానే కనిపిస్తారు. ఇప్పటికే గణపతి తయారీ పనులు 90శాతం పూర్తికాగా రంగులు ప్రారంభించాల్సి ఉంది. ప్రతి సంవత్సరం ఓ విశేష అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చే ఖైరతాబాద్‌ గణపతి ఈ సారి ద్వాదశాదిత్య మహా గణపతిగా కొలువుదీరనున్నాడు.


వికారి నామ సంవత్సరంలో గ్రహాలకు అధిపతియైున సూర్యుడి రూపంలో గణపతిని తయారుచేసి పూజిస్తే లోకకల్యాణం జరుగుతుందని, వాతావరణం అందరికీ అనుకూలించేలా ఉంటుందని, ప్రజలందరికీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండవని సిద్ధాంతి విఠలశర్మ వివరించారు. గణేశుడితోపాటు దత్తాత్రేయ స్వామి, సిద్దకుంజికా దేవీలను ఈ స్థలంలో పూజిస్తే రాహు, కేతు, శనితోపాటు అన్ని దోషాలు తొలగిపోతాయనే సూచన మేరకు ఈసారి ద్వాదశాదిత్య మహాగణపతిగా వినాయకుడిని తయారుచేస్తున్నారు. తొలిసారిగా గణపతికి కింద 7, పైన 5 కలిపి మొత్తం 12 తలలు, 24 చేతులను ఏర్పాటు చేశారు. 12 తలలపై 12 సర్పాలు, వాటి పడగల్లో శివలింగాలు కొలువుదీరనున్నాయి. గణపతి వెనుకవైపున భారీ ఆకారంలో సూర్యుడి రూపం, ఆయనతో పాటు సూర్యుడి రథాన్ని పోలుస్తూ ఇరువైపులా 7అశ్వాలు రథంపై ఉండే విధంగా కొలువుదీరాయి. గణపతికి కుడివైపున 10 అడుగుల ఎత్తుతో 3 తలలు, 6 చేతులతో సింహాసనంపై కూర్చున్న సిద్దకుంజికా దేవి విగ్రహం, ఎడమవైపున 12అడుగుల ఎత్తుతో 3 తలలతో దత్తాత్రేయ స్వామి, ఆవుతో కలిసి నిలబడ్డ విగ్రహాలు తయారయ్యాయి.



ఇక వినాయకుడితో పాటు ప్రతియేటా పూజలందుకునేందుకు విశేష దేవతలుగా కుడివైపున 18 అడుగుల ఎత్తుతో పులి వాహనంగా ఏకాదశి దేవి, శేషతల్పంపై పడుకుని ఉన్న మహా విష్ణువును పూజిస్తున్న విగ్రహం చూడముచ్చటగొల్పుతోంది. ఎడమవైపున 20 అడుగుల ఎత్తుతో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల సహిత శక్తి స్వరూపిణీ అయిన దుర్గాదేవి పద్మ కమలంపై ఆసీనురాలైన విగ్రహం కొలువుదీరింది. దాదాపు కోటి రూపాయలకు పైగా ఖర్చుతో కూడిన ఈ విగ్రహాన్ని 150 మంది కళాకారులు రాత్రింబవళ్లు దాదాపు మూడు నెలలపాటు పనిచేసి తయారు చేశారు. ఏప్రిల్‌ 30వ తేదీన కర్రపూజ జరగగా, గణపతి కోసం ప్రత్యేక నాటు దుంగలను (ఈ గణపతి కోసం ప్రత్యేకంగా పెంచినవి) మే 1వ తేదీన నర్సాపూర్‌ నుంచి తీసుకొచ్చారు. 5వ తేదీ నుంచి షెడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 10న గణపతి మూలస్తంభానికి అవసరమైన వెల్డింగ్‌ పనులను ప్రారంభించారు. 




ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన సుధాకర్‌తోపాటు మరో 19 మంది, మచిలీపట్నానికి చెందిన నాగబాబుతో పాటు 20 మంది సభ్యులు గల బృందం 25 రోజుల పాటు శ్రమించి పూర్తిచేశారు. జూన్‌ 12వ తేదీ నుంచి క్లే ఆర్ట్‌ పనులను చెన్నైకి చెందిన గురుమూర్తితోపాటు 27 మంది ఆర్టిస్ట్‌లు వీటిని పూర్తి చేశారు. ఆ తర్వాత 25వ తేదీ నుంచి మహారాష్ట్రకు చెందిన సుభాష్‌తోపాటు 20 మంది కళాకారులు ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో డిజైనింగ్‌ పనులను చేపట్టి పూర్తిచేశారు. జూలై 10వ తేదీ నుంచి బిహార్‌కు చెందిన సంతోష్‌, బెంగాల్‌కు చెందిన గోపాల్‌తోపాటు 20 మంది సభ్యుల బృందం నెల రోజులకు పైగా పనిచేసి ఫినిషింగ్‌ పనులను పూర్తిచేశారు. వీరితో పాటు హైదరాబాద్‌ స్టూడియో మోల్డర్లు 15 మంది గల బృందం ఇన్‌ఛార్జి కోటి ఆధ్వర్యంలో సపోర్టింగ్‌ ఆర్టిస్టులుగా పనిచేశారు. ఈనెల 16వ తేదీ వరకు డిజైనింగ్‌ పనులు పూర్తి స్థాయిలో ముగియనున్నాయి. అయితే.. ఈనెల 14 నుంచి కాకినాడ సత్య ఆర్ట్స్‌కు చెందిన భీమేష్‌తోపాటు 25 మంది సభ్యుల బృందం పెయింటింగ్‌ పనులను ప్రారంభించనున్నారు.




మొత్తం మీద ఈ నెలాఖరులోపు గణపతిని పూర్తి స్థాయిలో తయారుచేసేందుకు వేగం పెంచి పనులను చేస్తున్నారు. ఈ మహాగణపతిని తయారుచేసేందుకు 3 నెలల పాటు కళాకారులు రాత్రింబవళ్లు శ్రమిస్తుండగా ఆయనను తయారుచేసేందుకు వస్తువులు కూడా భారీగానే సమకూర్చారు. ఈ విగ్రహ తయారీ కోసం 25 టన్నుల స్టీలు, తమిళనాడు నుంచి తీసుకొచ్చిన 45 టన్నుల ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌, నర్సాపూర్‌ నుంచి తెప్పించిన 30 టన్నుల నాటు కర్రలు, 2వేల మీటర్ల గోనెసంచి క్లాత్‌, 30కేజీల బరువుండే కొబ్బరిపీచు బండళ్లు 60, ఏషియన్‌ పెయింట్స్‌కు చెందిన వాటర్‌ కలర్‌లను వినియోగించనున్నారు. ఈ గణపతి ఆకారాన్ని ప్రముఖ సిద్ధాంతి గౌరి భట్ల విఠలశర్మ సూచించగా దాని డిజైనింగ్‌ను ప్రముఖ గ్రాఫిక్‌ డిజైనర్‌ గవ్వల వెంకట్‌ చూడముచ్చటగా తయారు  చేశారు.
 





మరింత సమాచారం తెలుసుకోండి: