సృష్టికారుడైన ఆ బ్రహ్మను తలుచుకోగానే నాలుగు తలల రూపమే గుర్తుకువస్తుంది. ఈ నాలుగు తలలూ నాలుగు వేదాలకి ప్రతిరూపం అని కొందరంటే, నాలుగు దిక్కులకీ ఆధారం అని కొందరు భావిస్తుంటారు. కానీ ఈ నాలుగు తలలకీ సంబంధించి ఒక ఆసక్తికరమైన కథనం ప్రచారంలో ఉంది.


అదేమిటంటే... పూర్వం బ్రహ్మ, శతరూప అనే ఒక స్త్రీమూర్తిని సృష్టించాడు. వంద రకాలైన రూపాలను ధరించగల ఆ శతరూపని చూడగానే సాక్షాత్తూ ఆ బ్రహ్మదేవునికే మతి చలించింది. తన కూతురితో సమానురాలు అన్న విషయాన్ని కూడా గ్రహించకుండా బ్రహ్మ చూపు ఆమె మీదే నిలిచింది. ఆమె నాలుగు దిక్కులా సంచరిస్తుంటే ఆమెనే గమనించేందుకు బ్రహ్మకు నాలుగు తలలు ఉద్భవించాయి.


వీటికి తోడుగా శతరూప ఊర్ధ్వముఖంగా పయనించేటప్పుడు, ఆమెనే చూస్తూ ఉండేందుకు ఐదో తల కూడా ఏర్పడింది. ఈ దృశ్యాన్ని చూసిన పరమేశ్వరుడు, బ్రహ్మ చపలచిత్తానికి తగిన దండన విధించాలని అనుకున్నాడట. ఫలితం! శివుడు తన త్రిశూలంతో బ్రహ్మదేవుని ఐదో శిరసుని ఖండించివేశాడు.


అలా ఖండించబడిన బ్రహ్మకపాలం బదరీనాధ్‌ క్షేత్రం దగ్గర పడిందని అక్కడి ప్రజలు నమ్ముతారు. ఆ స్థలంలో కనుక పూర్వీకులకు పిండప్రదానాలను చేస్తే అధిక ఫలితం వస్తుందని భావిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: