వినాయ‌క చ‌వితి రాబోతుంది. వినాయక చవితి భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పండుగలలో ఒకటి. మ‌రి ఈ వినాయ‌క చ‌వితి ఎందుకు జ‌రుపుకుంటారో? దాని వృత్తాతం ఏంటో? ఇప్పుడు తెలుసుకుందాం. ఒక రోజు దేవతలు, మునులు పరమేశ్వరుని దగ్గరకు వెళ్లి మాకు ఏ పనిచేసినా విఘ్నం రాకుండా కొలుచుకోవడానికి వీలుగా ఒక దేవుడిని కనికరించమని కోరారు. దీంతో ఆ పదవికి గజాననుడు, కుమార స్వామి ఇద్దరూ పోటీ పడ్డారు. ఆ సమస్య పరిష్కరించడానికి శివుడు, మీలో ఎవరైతే ముల్లోకముల లోని అన్ని పుణ్య నదులలో స్నానం చేసి ముందు వస్తారో వాళ్లే ఈ పదవికి అర్హులు అన్నాడు.


దానికి అంగీకరించిన కుమార స్వామి వెంటనే తన నెమలి వాహనమెక్కి వెళ్లి పోయాడు. గజాననుడు మాత్రం చిన్న బోయిన ముఖంతో 'తండ్రీ! నా బలాబలాలు తెలిసీ మీరిలాంటి షరతు విధించటం సబబేనా ? నేను మీ పాద సేవకుడిని కదా! నా మీద దయ తలచి ఎదైనా తరుణోపాయం చెప్పమని కోరాడు. ఈ క్ర‌మంలోనే శివుడు దయతో ఓ గ‌జాన‌నుడు నారాయ‌ణ మంత్రం చెప్పాడు. ఇది ఒకసారి జపిస్తే మూడు వందల కల్పాలు పుణ్య నదులలో స్నానం చేసినట్టవుతుంది. 


దీంతో గజాననుడు సందేహించకుండా ఆ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపించుచూ, మూడు మార్లు తల్లి దండ్రులకు ప్రదక్షిణ చేసి కైలాసములోనే ఉండి పోయాడు. అక్కడ కుమార స్వామికి, మూడు కోట్ల యాభై నదులలో, ఏ నదికెళ్లినా అప్పటికే గజాననుడు ఆ నదిలో స్నానం చేసి తనకెదురు వస్తున్నట్లు కనిపించే వాడు. అన్ని నదులూ తిరిగి, కైలాసానికి వచ్చేసరికి అన్నగారు, తండ్రి పక్కనే ఉన్నాడు. 


తన అహంకారానికి చింతించి, 'తండ్రీ! అన్నగారి మహిమ తెలియక ఏదో అన్నాను. నన్ను క్షమించి అన్నకు ఆధిపత్యము ఇవ్వండీ అన్నాడు. `ఆ విధంగా బాధ్రపద శుద్ధ చవితి రోజు గజాననుడు, విఘ్నేశ్వరుడైనాడు. ఆ రోజు అన్ని దేశాల లోని భక్తులందరూ విఘ్నేశ్వరునికి అనేక రకములైన పిండి వంటలు, కుడుములు, టెంకాయలు, పాలు, తేనె, అరటి పళ్లు, పానకము, వడ పప్పు స‌మ‌ర్పించి భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో వినాయ‌కుడిని కొలుస్తారు.



మరింత సమాచారం తెలుసుకోండి: